ఫీజు రీయంబెర్స్మెంట్ రాకపోవడంతో పిల్లలకు భోజనాలు లేవు- మంత్రి నారా లోకేశ్ చూస్తున్నారా?

కాకినాడలో ఓ నర్సింగ్ కాలేజ్ యజమాన్యం అడ్డగోలుగా వ్యవహరించింది. విద్యార్థులను రోడ్డుకి నెట్టింది. ఫీజు రీయంబెర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో ఫీజులు కట్టని పిల్లలకు భోజనాలు పెట్టలేం అంటూ హాస్టల్ మూసేసింది. దాంతో విద్యార్థులు తీవ్రంగా సతమతమయ్యారు. చివరకు సమీపంలోని ఫంక్షన్ హాళ్లలో ఓ పూట కడుపు నింపుకున్నారు. కానీ ఆదివారం నాడు అలాంటి అవకాశం కూడా లేకపోవడంతో అధికారులకు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది.

కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ జోక్యం చేసుకుని ఆర్డీవో మల్లిబాబుని కాలేజ్ దగ్గరకు పంపించారు. రమ్య నర్సింగ్ కాలేజ్ యాజమాన్యం తీరు మీద విచారణ చేశారు. విద్యార్థులతో మాట్లాడారు. తగిన వసతి, భోజన సదుపాయాలు కల్పించడం లేదంటూ విద్యార్థులు ఫిర్యాదు చేశారు. అయితే ఫీజు రీయంబెర్సమెంట్ బకాయిలు రాకపోవడంతో ఫీజులు కట్టలేకపోయామని విద్యార్థులు వాపోయారు. దాంతో తమకు హాస్టల్ మూసేయడం సమస్యగా మారిందంటూ విన్నవించారు.

ఈ విషయంపై అధికారుల ఆదేశాల తర్వాత మళ్లీ హాస్టల్ తెరిచారు. కానీ ఫీజులు చెల్లించకుండా తాము కూడా హాస్టల్ నిర్వహించలేమని కాలేజ్ యాజమాన్యం చెబుతోంది. ఇప్పటికే ఆరేడు నెలలుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో తామంతా సతమతమవుతున్నామని అంటోంది. ఈ వ్యవహారం మీద ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. ఇలాంటి పరిస్థితి విద్యార్థులకు ఎదురుకావడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఏడాది రెండు విడదల ఫీజు బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. విద్యాదీవెన నిధులకు ఎన్నికల కోడ్ అడ్డురావడం వల్ల చెల్లించలేకపోయామని వైఎస్సార్సీపీ చెప్పింది. కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు దాటిపోయినా ఇంకా బకాయిలు విడుదల కాకపోవడం ఆందోళనకరంగా మారుతోంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేశ్ ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం కనిపిస్తోంది. విద్యార్థులను రోడ్డుకి నెట్టే పరిస్థితులు నియంత్రించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *