ఆ నలుగురినీ రీప్లేస్ చేసేదెవరూ? కొత్త కెప్టెన్ ఎవరూ?
టీమిండియాలో పెను మార్పులకు సమయం ఆసన్నమవుతోంది. న్యూజిలాండ్ తో హోమ్ సిరీస్ లో ఖంగుతిన్న టీమ్ లో అనేక మార్పులకు సూచనలు కనిపిస్తున్నాయి. బోర్డర్ గవాస్కర్ ట్రోపీ కోసం ఆస్ట్రేలియా వెళ్లాల్సిన జట్టుని ఇప్పటికే ప్రకటించడంతో అక్కడి ఫెర్మార్మెన్స్ ను బట్టి కొందరి విషయంలో నిర్ణయాలు ఉండొచ్చు. కానీ ఓ నలుగురికి మాత్రం దాదాపుగా ఆస్ట్రేలియా సిరీస్ ఆఖరిదనే అభిప్రాయం వినిపిస్తోంది.
ఆసీస్ తో సిరీస్ గట్టెక్కడం అంత సులువు కాదు. వరుసగా నాలుగు సార్లు ఈ ట్రోఫీని టీమిండియా నిలబెట్టుకుంటోంది. కానీ ఈసారి మాత్రం ఆసీస్ సమరోత్సాహంతో ఉండగా టీమిండియా తీవ్ర నైరాశ్యంలో కనిపిస్తోంది. మానసికంగా జట్టు పరిస్థితి చాలా పేలవంగా ఉంది. దానిని అధిగమించి సిరీస్ సాధిస్తారా అన్నది సందేహమే. గత పర్యటనలో పెర్త్ టెస్టు ఓటమి తర్వాత పుంజుకున్న తీరుని కొందరు గుర్తు చేసుకోవచ్చు. కానీ ఈసారి పరిస్థితి అలాంటిది కాదు.
నలుగురినీ ఒకేసారి టెస్ట్ జట్టు నుంచి సాగనంపాల్సి వస్తే అందులో మొదటి పేరు రోహిత్ శర్మ , ఆ తర్వాత అశ్విన్ ఉంటారు. జడేజా కూడా దాదాపు ఖాయమే. ఇక విరాట్ కోహ్లీ కూడా ఆసీస్ గడ్డ మీద బ్యాట్ ఝుళిపిస్తాడా లేదంటే ఇక గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతాడా అన్నది తేలాలి. ఈ నలుగురు ఆటగాళ్లకు వయసు తో పాటుగా ఫామ్ కూడా ప్రధాన పాత్ర పోషించబోతున్న తరుణంలో కొత్త తరం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది.
రోహిత్ శర్మ స్థానంలో ఓపెనర్ గా ఇప్పటికే రుతురాజ్ గైక్వాడ్, అభిమాన్యు ఈశ్వరన్ మధ్య గట్టిపోటీ ఉంది. ఆసీస్ టూర్ లో ఈశ్వరన్ కి అవకాశం దక్కేలా ఉంది. టాలెంట్ నిరూపించుకుంటే టెస్ట్ ఓపెనర్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటాడు. ఆ తర్వాత కోహ్లీ ప్లేసులో సాయి సుదర్శన్, రజిత్ పటిదార్ లో పోటీ పడబోతున్నారు. దేవదత్ పడిక్కల్ కూడా పోటీలో ఉంటాడు. జడేజా స్థానంలో ఆల్ రౌండర్ బెర్త్ వాషింగ్టన్ నిలదొక్కుంటున్నట్టే కనిపిస్తోంది. ఇక అశ్విన్ స్థానంలో వచ్చే స్పిన్నర్ సీటు కోసం గట్టి పోటీ ఉంటుంది.
కెప్టెన్ బెర్త్ కూడా ఖాళీ కాబోతున్న తరుణంలో ఆస్ట్రేలియా సిరీస్ లో తొలి ఒకటి, రెండు టెస్టు మ్యాచ్ లకు రోహిత్ శర్మ అనుమానమే. అతడి స్థానంలో బుమ్రా కెప్టెన్సీ వహిస్తాడు. కానీ లాంగ్ రన్ లో బుమ్రాకి బదులుగా రిషబ్ పంత్, శుభ్ మన్ గిల్ కెప్టెన్సీ రేసులో ఉంటారు. బుమ్రా మీద ఒత్తిడి తగ్గించే లక్ష్యంతో పంత్, గిల్ లో ఒకరికి అవకాశం ఉంటుందనే ప్రచారం ఉంది. అది కూడా గట్టిపోటీ ఉండే స్థానమే.
విండీస్ లో జరిగిన టీ20 ఫైనల్స్ గెలిచి పొట్టి ఫార్మేట్ కి బైబై చెప్పేసిన సీనియర్లు ఆస్ట్రేలియాలో కూడా విజయం సాధించి ఘనంగా వీడ్కోలు పలకాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఎలానూ డబ్ల్యూటీసీ ఫైనల్స్ కి చేరే ఛాన్స్ చాలా తక్కువ. అందుకు ఆసీస్ ను క్లీన్ స్వీప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న స్థితిలో అది దాదాపు అసాధ్యం. కాబట్టి కనీసం సిరీస్ గెలిచి కెరీర్ కి ముగింపు పలికితే ఫ్యాన్స్ కొంత సంతృప్తి పడతారు. మరి చూడాలి చివరి సిరీస్ లో ఈ సీనియర్ ఆటగాళ్ల ఫార్మార్మెన్స్ ఎలా ఉంటుందో..