వైఎస్ కుటుంబ ఆస్తుల తగాదా తేలాలంటే ఇంకో నెల ఆగాల్సిందే..
వైఎస్సార్ కుటుంబంలో ఆస్తుల తగాదాలో వచ్చిన విబేధాల మీద విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన కేసు డిసెంబర్ 13కి వాయిదా వేస్తున్నట్టు ఎన్సీఎల్టీ ప్రకటించింది. దాంతో ఈ వ్యవహారంలో స్పష్టతకు మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంటుంది.
సరస్వతి పవర్ లో వైఎస్ జగన్, ఆయన భార్య భారతి పేరు మీద ఉన్న వాటాలను వైఎస్ విజయమ్మకు గిఫ్ట్ డీడ్ గా రాశారు. దానిని వైఎస్ షర్మిలకు అప్పగించేందుకు వారి మధ్య 2019 ఆగష్టులో ఎంవోయూ కుదిరింది. కానీ అందుకు విరుద్ధంగా మొన్నటి జూలైలో విజయమ్మ షేర్లను వైఎస్ షర్మిల పేరుతో బదిలీ చేశారన్నది జగన్ అభియోగం. గతంలో తాము చేసుకున్న గిఫ్ట్ డీడ్ ఒప్పందం రద్దుచేయాలని ఎన్సీఎల్టీని ఆశ్రయించారు.
తెలంగాణా హైకోర్టులో వివాదంలో కేసుకి సంబంధించిన ఆస్తుల బదిలీ జరిగితే చట్టపరంగా చిక్కులు తప్పవని జగన్ శిబిరం వాదిస్తోంది. అయితే వైఎస్సార్ ఆశించినట్టు ఇరువురికి సమాన ఆస్తులు దక్కాలని వైఎస్ విజయమ్మ ఆంటోంది. ఈ నేపథ్యంలో వారి ఆస్తుల తగాదా రాజకీయ రచ్చకు దారితీసింది. చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యల గురించి ఎన్సీఎల్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది తేలాలంటే మరో నెల రోజుల పాటు వెయిట్ చేయక తప్పదు.