అక్కడికి టీమిండియా వెళ్లడం లేదు.. ఇప్పుడేమవుతుంది?
పాకిస్తాన్ లో నిర్వహించబోయే ఛాంపియన్స్ ట్రోపీకి తమ టీమ్ ని పంపించేందుకు బీసీసీఐ నిరాకరించింది. టీమిండియా ఆ దేశంలో అడుగుపెట్టబోదంటూ తేల్చేసింది. దాంతో ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫి నిర్వహిస్తున్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి పెద్ద తలనొప్పిగా తయారయ్యింది.
గత ఏడాది ఆసియా కప్ మ్యాచ్ ల కోసం కూడా టీమిండియా అక్కడికి వెళ్లలేదు. దాంతో హైబ్రీడ్ పద్ధతిలో టీమిండియా మ్యాచ్ లను శ్రీలంకలో నిర్వహించారు. ఇప్పుడు కూడా అలాంటి మార్గం అన్వేషించాలని బీసీసీఐ కోరుతోంది. ఇండియా- పాకిస్తాన్ మధ్య సంబంధాల నేపథ్యంలో భారత ప్రభుత్వం అనుమతివ్వకపోవడంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్టు అంతా భావిస్తున్నారు.
టీమిండియా కూడా పాకిస్తాన్ రావాల్సిందేనని పీసీబీ గట్టిగా పట్టుబట్టింది. వన్డే వరల్డ్ కప్ కోసం పాకిస్తాన్ జట్టు ఇండియాలో పర్యటించినప్పుడు పాకిస్తాన్ లో ఛాంపియన్స్ ట్రోఫికి రావడానికి అభ్యంతరం పెట్టడాన్ని తప్పుబట్టింది. అయినప్పటికీ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడంతో ఇక ఛాంపియన్స్ ట్రోపీలో టీమిండియా మ్యాచ్ లను అటు యూఏఈలో గానీ ఇటు శ్రీలంకలో గానీ నిర్వహించాల్సి ఉంటుంది.
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ఇప్పటికే శ్రీలంక క్రికెట్ బోర్డు సుముఖత చూపింది. దాంతో అటు మళ్లిస్తారా లేక దుబాయ్ వేదికగా జరుపుతారా అన్నదే తేలాల్సి ఉంది.