జనసేన నాయకుడి ఇంట్లో బాలుడి అనుమానాస్పద మృతి, దర్యాప్తు కోసం ఆందోళన

కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అనుచరుడి ఇంట్లో బాలుడి మృతి కలకలం రేపుతోంది. బాధిత కుటుంబ సభ్యులు, బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. పోలీసుల తీరు మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కాకినాడ ఎల్బీనగర్ కు చెందిన ఆటోడ్రైవర్ కుక్కల మల్లేశ్వరరావు కుమారుడు కుక్కల చరణ్ శ్రీ తేజ (12) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. తమ ఇంటికి సమీపంలోనే ఉన్న రాజేశ్వరి రెసిడెన్సీ వద్ద ఈ ఘటన జరిగింది. అపార్ట్ మెంట్ వాచ్ మెన్ చెప్పిన వివరాలు అనుమానాస్పదంగా ఉన్నాయంటూ బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయినప్పటికీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయకుండా కేసును పక్కదోవ పట్టించడానికి ప్రయత్నం జరుగుతోందంటూ ఆందోళనకు దిగారు.

తొలుత ఉసిరి చెట్టు పైనుంచి పడిపోయాడని, తరువాత అపార్ట్మెంట్ ఆర్చి పైనుంచి పడిపోయాడని, తర్వాత కరెంట్ షాక్ వలన పడిపోయాడని రకరకాల కారణాలు చెప్పడం, పడిపోయిన చోట కాకుండా పడిపోయిన మృతదేహం తరలించడం వంటి అనుమానాలు బాధిత కుటుంబీకులు వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా ఈ ఘటన జరిగిన వెంటనే ఆ ఫ్లోర్ లో నివశించే వ్యక్తి విదేశాలకు వెళ్లడం మీద సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో పాటుగా అదే అపార్ట్మెంట్లో జనసేనకు సంబంధించిన స్థానిక ఎంపీ తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ముఖ్య అనుచరుడు నల్లం వాసు అలియాస్ *బుల్లెట్ వాసు మూలంగానే కేసు పక్కదారి పడుతోందని విమర్శిస్తున్నారు.

“పోలీసులు సైతం ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, సంఘటన ఉదయం జరిగితే సాయంత్రం వరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోకపోవడం, దర్యాప్తులో వివరాలు సేకరించకుండా కేవలం మృతుని బంధువులు తల్లిదండ్రులను మాత్రమే ప్రశ్నిస్తూ దర్యాప్తును ముందుకు సాగించకపోవడం, అపార్ట్మెంట్లో సిసి టీవీలు పని చేయకపోయినా కనీసం చుట్టుపక్కల ఉన్న సిసి టివి ఫుటేజ్ ను వెంటనే సేకరించే ప్రయత్నం చేయకపోవడం” ఏమిటని బీసీ నేత పప్పుల దుర్గా ప్రసాద్ డిమాండ్ చేశారు.

రీ పోస్టుమార్టం నిర్వహించి, ఈ బాలుడి మృతిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేస్తూ వివిధ సంఘాలకు చెందిన నేతలు కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు ఫిర్యాదు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *