ఏబీఎన్, టీవీ5 తగాదాకి మూలమైన తలనూనె మళ్లీ వచ్చింది!

నూజెన్ హెయిర్ ఆయిల్ గుర్తుందా, చాన్నాళ్లకు మళ్లీ వచ్చింది. కొంతకాలం మరుగున పడిన ఆ తలనూనె మళ్లీ తడాఖా చూపించే దిశలో సాగుతోంది.


టీవీ5 చైర్మన్ బీఆర్ నాయుడుకి ఇటీవల పదవీయోగం దక్కింది. ఏకంగా టీటీడీ చైర్మన్ పదవి సొంతం చేసుకున్నారు. ఆయనకు అధికార హోదా దక్కిన తర్వాత చాలాకాలానికి మళ్లీ నూజెన్ హెయిర్ ఆయిల్ తెరమీదకు వచ్చింది. ప్రకటనలు కనిపిస్తున్నాయి.

పదేళ్లకు పూర్వం నూజెన్ హెయిర్ ఆయిల్ ఓ సంచలనం. బట్టతల మీద జట్టు మొలిపించేస్తామంటూ పెద్ద హంగామా. ఆ ప్రచారంలో లొసుగులను పట్టుకుని ఏబీఎన్ రాధాకృష్ణ చెడుగుడు ఆడేశాడు. దాంతో ఏబీఎన్ కి, టీవీ5కి మధ్య చాన్నాళ్ల పాటు యుద్దమే నడిచింది. ఇరు సంస్థలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుకునే వరకూ వెళ్లింది.

ఈ ఆయిల్ వాడకం వల్ల నష్టాలే తప్ప లాభం లేదని, ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని ఆంధ్రజ్యోతి పదే పదే కథనాలు ఇచ్చింది. తప్పుడు ప్రసారంతో టీవీ5 మోసగిస్తోందంటూ బాధితులతో ఇంటర్వ్యూలు కూడా చేసింది. ఇలాంటివన్నీ ఆ సంస్థ అమ్మకాల మీద ప్రభావం చూపడంతో కొంతకాలం ప్రసార జోరు తగ్గించిన యాజమాన్యం ఇప్పుడు మళ్లీ పత్రికలకెక్కడం ఆసక్తిదాయకమే.

ఏబీఎన్ రాజేసిన వివాదం నూజెన్ ఆయిల్ ను చుట్టుముట్టుంది. పలువురు వినియోగదారులు మోసం జరిగిందంటూ గగ్గోలు పెట్టారు. కొందరు ఆందోళనకు కూడా దిగారు. దాంతో క్రమంగా నూజెన్ ప్రచారం పక్కకెళ్లిపోయింది. కానీ ఇప్పుడు మరోసారి అది ముందుకొచ్చింది. తాజాగా పత్రికల్లో ప్రకటనలు కూడా మొదలుకావడంతో నూజెన్ మళ్లీ మార్కెట్లో సందడి చేసేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. పైగా ప్రస్తుతం ఈ యాడ్ కూడా ఆంధ్రజ్యోతి పత్రికలోనే ప్రచురించడం విశేషం.

నూజెన్ హెయిర్ ఆయిల్ కోసం ఆరంభంలో రాజమండ్రి పరిసరాల్లో నర్సరీల నుంచి విరివిగా పూలు సేకరించిన బీఆర్ నాయుడు కంపెనీ ఆ తర్వాత సొంతంగా మందారాలు పండించే ప్రయత్నం చేసింది. తద్వారా పూర్తి ఏర్పాట్లు చేసుకుంది. కానీ అనూహ్యంగా మార్కెట్లో వినియోగదారుల నుంచి వచ్చిన ప్రతిఘటనతో కొంతకాలం వెనకడుగు వేసింది.

కానీ ఇప్పుడు మళ్లీ ముందుకొచ్చింది.ప్రస్తుతం చివరి పేజీలో యాడ్ చూసినప్పటికీ త్వరలోనే మొదటి పేజీలకు వచ్చే అవకాశం లేకపోలేదు. మరోసారి మార్కెట్లో ఈ హెయిర్ ఆయిల్ హల్ చల్ చేస్తుందనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *