కాకినాడ: అప్పుడు డీప్ వాటర్ పోర్టు, ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ బలి చేస్తున్నారా?

కాకినాడ పోర్ట్ వ్యవహారం పెను దుమారం దిశగా సాగుతోంది. చంద్రబాబు ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్‌ రాజేసిన వివాదం ఇప్పట్లో సర్థుమణిగేలా లేదు. దానికి కారణం ఏకంగా కాకినాడలో సుదీర్ఘ చరిత్ర కలిగిన యాంకరేజ్ పోర్ట్ మీద ప్రభుత్వం కన్నేసిందన్న ప్రచారమే. ఏకంగా యాంకరేజ్ పోర్ట్ మూతవేసే దిశలో ఉందంటూ వస్తున్న కథనాలే అందుకు కారణంగా కనిపిస్తోంది.

కాకినాడ తీరం కొంత భిన్నంగా ఉంటుంది. కాకినాడ పోర్టుకి ఎదురుగా బంగాళాఖాతంలో హోప్ ఐలాండ్ ఏర్పడడం, అది క్రమంగా విస్తరించడంతో కాకినాడలో సహజసిద్ధంగా పోర్ట్ ఏర్పడలేదు. దాంతో ఐలాండ్ కి, కాకినాడ తీరానికి మధ్య నౌకలు లంగరు వేసి నిలుపుతారు. అక్కడికి తీరం నుంచి బార్జీలలో సరుకులు తీసుకెళ్లి సముద్రం మధ్యలో ఓడల్లోకి తరలిస్తారు. ఓడల ద్వారా వచ్చిన సరుకులను అదే రీతిలో దిగుమతి చేసి బార్జీల ద్వారా ఒడ్డుకి తీసుకొస్తారు. దానినే యాంకరేజ్ పోర్ట్ ఉంటారు.

ఈ యాంకరేజ్ పోర్ట్ కి సుమారు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అప్పటి బ్రిటీష్ వారి కాలం నుంచి కూడా ఇదే ప్రక్రియ. కాకినాడ వచ్చిన నౌకలన్నీ ఇదే పద్ధతిలో సముద్రం మధ్యలో లంగరు వేసి ఎగుమతులు దిగుమతులు సాగిస్తుంటాయి. మొన్న పవన్ కళ్యాణ్‌ వెళ్లింది కూడా అలా సముద్రం మధ్యలో లంగరు వేసి సరుకులు ఎగుమతి చేస్తున్న నౌక దగ్గరకే. అక్కడే ఆయన సీజ్ ద షిప్ అన్నారు. తుఫాన్ కారణంగా సముద్రంలో అలల తీవ్రత కారణంగా ఆయన వెళ్లిన బోటు నుంచి షిప్ లోకి ఎక్కేందుకు అవకాశం లేదని, భద్రత రీత్యా తగదని చెప్పడంతో ఆయన ఆగ్రహించి అలకబూని, ఆవేశపడ్డారు.

తాజాగా సివిల్ సప్లయిస్ మంత్రి నాదెండ్ల మనోహర్ మరో అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. కాకినాడ సీపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో 41 శాతం వాటాను జగన్ ఒత్తిడితో అరంబిందో రియాల్టీకి రాయించుకున్నారన్నది అభియోగం. ఈ పోర్ట్ కి యాంకరేజ్ పోర్టుకి సంబంధం లేదు. నాదెండ్ల చెబుతున్నది డీప్ వాటర్ పోర్ట్ లో వాటాల గురించి. దీనిని ఏడీబీ అప్పులతో 1990లలో నిర్మించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 1998లో ప్రభుత్వం నిర్మించిన పోర్టుని ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టారు. అప్పట్లో కేవీ రావు అనే చంద్రబాబు బినామీకే పోర్టు అప్పగించారన్న విమర్శలు వచ్చాయి. వైఎస్సార్ వంటి వాళ్లు ఆందోళన కూడా చేశారు. కోర్టుల వరకూ వెళ్లింది. ప్రభుత్వ ఆస్తులను కాజేసిన అక్రమాల విషయంలో కోర్టుల పాత్ర అందరికీ తెలిసిందే కదా.

సరిగ్గా ఇన్నాళ్లకు అదే కేవీ రావుకి చెందిన కాకినాడ సీపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ లో అరబిందో రియాల్టీ 41 శాతం వాటాను బెదిరించి తీసుకుందంటున్న నాదెండ్ల మనోహర్ మరి ఇన్నాళ్లుగా ఎందుకు ఉపేక్షించారన్నది చెప్పలేదు. కానీ ఇప్పుడు రైస్ మాఫియా గురించి వివాదం నడుస్తుంటే మధ్యలో డీప్ వాటర్ పోర్ట్ వ్యవహారాన్ని ముందుకు తీసుకొచ్చారు. తద్వారా ప్రజలను గందరగోళంలో నెట్టి యాంకరేజ్ పోర్ట్ మూతవేసే ప్రయత్నం జరుగుతున్నట్టుగా భావిస్తున్నారు. కాకినాడ పోర్ట్ కి అటూ ఇటూ ఉన్న రెండు పోర్టులు ప్రస్తుతం అదానీ చేతిలో ఉన్నాయి. అటు గంగవరం, ఇటు కృష్ణపట్నం అదానీవే. అక్కడి నుంచి కూడా బియ్యం ఎగుమతులు జరుగుతున్నాయి. కాకినాడ చుట్టూ వివాదం తర్వాత పెరిగాయి కూడా. అయినా వాటి గురించి మాట్లాడకుండా కేవలం కాకినాడ మీద గురిపెట్టడం ద్వారా కాకినాడ యాంకరేజ్ పోర్ట్ మూతవేసేసి, అదానీ పోర్టుల నుంచి ఎగుమతులు పెంచే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందా అన్న సందేహాలు కలుగకమానవు.

ఇప్పటికే జగన్ హయంలో ప్రారంభించిన ప్రభుత్వ పోర్టులను పీపీపీ పేరుతో ప్రైవేటు వాళ్లకు అప్పగించే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారన్నది బహిరంగ వాస్తవం. దానికి కొనసాగింపుగా కాకినాడలో సుదీర్ఘ చరిత్ర కలిగి, 10వేల మంది కార్మికులకు ఉపాధి కలిగిస్తున్న యాంకరేజ్ పోర్ట్ కూడా మూతవేసి ప్రైవేటు పోర్టులకు లాభాలు పెంచే ప్రయత్నంలో ఉన్నట్టుగా అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో అదే కాకినాడలో డీప్ వాటర్ పోర్టును ప్రైవేటుపరం చేసిన చంద్రబాబు ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ మీద కన్నేసి ఇంత రాద్ధాంతం నడుపుతున్నారా అన్న సందేహాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఇంత రాద్ధాంతం చేస్తున్నారా అనే వాదన వినిపిస్తోంది. వాస్తవానికి కాకినాడ యాంకరేజ్ పోర్ట్ ఏపీలోనే అతి పెద్ద మైనర్ పోర్ట్. వ్యవసాయ ఉత్పత్తులను కేవలం యాంకరేజ్ పోర్ట్ ద్వారా మాత్రమే ఎగుమతి, దిగుమతి చేయాలన్న ఒప్పదం అప్పట్లో కార్మికుల ఆందోళన తర్వాత కుదిరింది. కానీ ఇప్పుడు యాంకరేజ్ పోర్ట్ మూతవేస్తే అవన్నీ ప్రైవేటు పోర్టులకు లాభాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఆ లక్ష్యంతోనే ఇదంతా జరుగుతుందా అని కార్మికులు ఆందోళన చెందుతున్నారు. మరి ప్రభుత్వం రేషన్ బియ్యం మాటున ఇంత కథ నడుపుతోందా లేక అసలు లక్ష్యాలు ఇంకేమయినా ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది.

కాకినాడ పోర్టుల గురించి వివరణాత్మక వీడియో చూడండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *