జగనూ, పవనూ ఇద్దరికీ పాఠం చెప్పిన సినిమా రాజకీయాలు!
రాజకీయ పార్టీ లేదా సినిమా ఏదైనా గానీ ఒక కులం, ఒక వర్గం ఆధారంగా సక్సెస్ కొట్టలేవన్నది జగమెరిగిన సత్యం. కానీ ఆయా కులాల అండదండలతో కొంత ఊపు వస్తుంది. పార్టీకయితే పునాది అవుతుంది. సినిమాకయితే ఒకటి రెండు రోజుల వసూళ్లుంటాయి. అంతకుమించి కులాన్ని నెత్తిన పెట్టుకుంటే ఏమవుతుందో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కొణిదెల పవన్ కళ్యాణ్ కి అర్థమయ్యి ఉండాలి. ఎందుకుంటే కులం కారణంగా రాజకీయాల్లో ఒకరు, సినిమాల్లో ఒకరు దెబ్బతినాల్సి వచ్చింది.
పవన్ కళ్యాణ్ జనసేన కారణంగా వైఎస్ జగన్ కి ఎదురుదెబ్బ తగిలింది. కాపులను సమీకరించడంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ అయ్యారు. కాపు ఓట్లు పూర్తిగా జగన్ వ్యతిరేకంగా మారిపోవడంతో వైఎస్సార్సీపీకి ఊపిరిసలపని పరిస్థితి ఏర్పడింది. గంపగుత్తగా తన ఓట్లను టీడీపీకి మళ్లించడం ద్వారా పవన్ కళ్యాణ్ తన ప్రత్యర్థి జగన్ ను కట్టడి చేయగలిగారు. రాజకీయంగా కాపు ఓట్లు దూరం కావడంతో జగన్ అధికారం కోల్పోవాల్సి వచ్చింది.
సరిగ్గా అదే కాపు మంత్రి కొణిదెల కుటుంబానికి సినిమాల్లో బూమరాంగ్ అవుతోంది. కాపుల ఆధిక్యం కోసం చేసిన యత్నాలతో మెగా ఫ్యామిలీకి అనేక కుటుంబాలు దూరమయ్యాయి. మెగా శిబిరం ఇతర హీరోలు, పార్టీల అభిమానుల దృష్టిలో విలన్ అయ్యింది. ఇది వరుసగా మెగా సినిమాలకు దక్కుతున్న ఫలితాల్లో కనిపిస్తోంది. చిరంజీవి సినిమాలు ఘోర పరాభవాలు మూటగట్టుకోగా, తాజాగా రామ్ చరణ్ డిజాస్టర్ తో దెబ్బతినాల్సి వచ్చింది. పండుగ సీజన్ లో కూడా మినిమమ్ గ్యారంటీ వసూళ్లు అనుకుంటే మొదటి రోజే థియేటర్లు ఖాళీ కావాల్సి వచ్చింది.
వీటి ప్రభావం పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల మీద కూడా ఉండక తప్పదు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా ఈ సమస్య వెంటాడడం అనివార్యం అని పవన్ కళ్యాణ్ గ్రహిస్తే ఉపయోగం. లేదంటే చేదు ఫలితాలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. సినిమా వేదికగా చేసుకుని రాజకీయ విమర్శలు, రాజకీయ ప్రత్యర్థులను నిందించడం వంటివి చేయడం ద్వారా జరిగే నష్టాన్ని పూడ్చడం ఇప్పుడిప్పుడే పవన్ కి కూడా సాధ్యమా కాదా అన్నది ప్రశ్నార్థకమే.
మరోవైపు పవన్ బలపడినా, జనసేన రాజకీయంగా ఎదిగినా అది టీడీపీకి నష్టం. ఉమ్మడిగా సాగితే ఎక్కువ సీట్లు కట్టబెట్టాల్సి ఉంటుంది. విడిగా పోటీ చేస్తే ఓట్ల చీలిక అనివార్యమవుతుంది. ఏం జరిగినా అది టీడీపీకి ఇబ్బందిని తెస్తుంది. కాబట్టి జనసేన ఎదగడానికి టీడీపీ సహకరించే అవకాశం లేదు. జనసేన ఎదిగే ప్రయత్నాలను అడ్డుకుటుందనడం నిస్సందేహం. అలాంటి సమయంలో మెగా శిబిరానికి అటు సినిమాల్లో, జనసేనకి ఇటు రాజకీయంగా కాపు కులం మాత్రమే కాపు కాయగల పరిస్థితి ఉండదు. ఇది పవన్ కళ్యాణ్ రాజేసిన మంట కాబట్టి నష్టనివారణ కూడా ఆయన చేతుల్లోనే ఉంటుది. మరి దానిని సమర్థవంతంగా చేయగలరా లేక ఇప్పటికే చేతులు కాలుతున్నప్పటికీ అదే ధోరణిని కొనసాగిస్తారా అన్నది కీలకం.
ఏమైనా కాపులను ఏకీకృతం చేయడంలో సూపర్ సక్సెస్ కొట్టిన పవన్ కి ఇతరులు దూరమయిన విషయం గుర్తించకపోతే గేమ్ ఛేంజర్ మాదిరి బోల్తా పడే పరిస్థితి వస్తుంది.