ఎక్కడ తేడా వచ్చింది? ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది?

ప్రపంచం బాధను తన బాధగా భావిస్తారని శ్రీ శ్రీ గురించి.. తన బాధను ప్రపంచం బాధగా చూస్తారని కృష్ణశాస్త్రి గురించి సాహితీ లోకంలో ఉన్న టాక్. ఇప్పుడు టీడీపీ సానుభూతిపరుల్లో కొందరు శ్రీ శ్రీలు, ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయినట్టే కన్పిస్తోంది. జీవీ రెడ్డి-దినేష్ కుమార్ ఎపిసోడులో కొందరు శ్రీ శ్రీలుగా మారిపోయారు.. ఇంకొందరు కృష్ణశాస్త్రిలుగా మారిపోయారు. ఎవరి అభిప్రాయాలను వారు చెప్పేస్తున్నారు. ఇంకొందరు ఏకంగా చంద్రబాబు కంటే జీవీ రెడ్డే గ్రేట్ అనే స్థాయిలో కామెంట్లు కూడా చేసేస్తున్నారు. ఇదంతా చూస్తున్న కొందరు సీనియర్ నేతలు వాళ్ల సన్నిహితుల వద్ద ఓ కామెంట్ చేస్తున్నారు.. జీవీ రెడ్డి అంత గొప్పవాడా..? అంటున్నారట.
ఈ మొత్తం చర్చ ఎందుకు జరుగుతోందంటే.. ఫైబర్ నెట్ ఎండీగా వ్యవహరించిన దినేష్ కుమార్ తన మాట వినడం లేదని ఫైబర్ నెట్ ఛైర్మనుగా ఉన్న జీవీ రెడ్డికి కోపం వచ్చింది. ప్రెస్ మీట్ పెట్టారు. ఓ అధికారి మాట వినకపోవడమే ఈ ఎపిసోడులో బాటమ్ లైనుగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన అంశమేమిటంటే.. జీవీ రెడ్డి మాటే కాదు.. సీఎం చంద్రబాబు మాట కూడా కొన్ని సందర్భాల్లో అమలు కాకపోవచ్చు. దీనికి లేటెస్ట్ ఉదాహరణ ఏపీపీఎస్సీ పరీక్షల వాయిదా ఎపిసోడ్. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలకున్న గొప్పతనమిదే. చంద్రబాబు వ్యవస్థలను గౌరవించే మనిషి. వ్యవస్థలో భాగస్వాములుగా ఉన్న వ్యక్తులు వ్యవస్థకు లోబడి పని చేయాల్సి ఉంటుంది. తనకు అధికారం ఉంది కదా అని తన మాటే చెల్లుబాటు చేసుకోవాలని ప్రయత్నిస్తే గత పాలకులకు.. ఇప్పటి వారికి తేడా ఏముందనే ప్రశ్నలు వస్తాయి.
గత ప్రభుత్వంలో రాష్ట్ర ఎన్నికల కమిషనరుగా వ్యవహరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలోనూ ఇదే జరిగింది. నాడు సీఎంగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి నిమ్మగడ్డ విషయంలో శివాలెత్తిపోయారు.. ప్రెస్ మీట్ పెట్టారు.. ఏదేదో మాట్లాడేశారు. ఎవరెవరికో ఫిర్యాదు చేశారు. దీని వల్ల నిమ్మగడ్డకు ఏం పోలేదు. కానీ జగనుకు మాత్రం పదవి పోవడానికి ఆ ఎపిసోడూ ఓ కారణం అయింది. వ్యవస్థలను గౌరవించాల్సిన స్థానాల్లో ఉన్న వారే వ్యవస్థలను లెక్కపెట్టకుండా వ్యవహరిస్తే అంతిమంగా పరువు పోతుంది.
అదే సమయంలో వ్యవస్థలో ఉన్న అధికారులు తప్పు చేస్తే భరించాల్సిన అవసరమూ లేదు. వారు చేసే తప్పులను సాక్ష్యాలతో సహా నిరూపించగలిగితే.. వాళ్లూ దారిలోకి వస్తారు. మరి జీవీ రెడ్డి ఈ సాక్ష్యాధారాల సేకరణ విషయంలో ఏం కసరత్తు చేశారో తెలియదు. వ్యవస్థలకంటే వ్యక్తులు ఎప్పటికీ గొప్ప వారు కారు, కాలేరు. వాళ్లు సీఎం అయినా.. పీఎం అయినా.. ఈ విషయాన్ని చంద్రబాబు గుర్తించారు. కానీ ఆయన నేతృత్వంలో పని చేసిన జీవీ రెడ్డి మాత్రం ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. అయితే జీవీ రెడ్డి దీన్ని గుర్తించలేకపోవడాన్ని పెద్ద ఆశ్చర్యంగా చూడాల్సిన అవసరం లేదు. కారణం.. ఆయన కొన్నాళ్ల క్రితమే తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. డిబేట్లల్లో.. పార్టీ బ్యాక్ ఆఫీస్ వ్యవహరాల్లో తప్ప ఆయన పార్టిసిపేషన్ పెద్దగా కన్పించ లేదు. ఈ తరహాలో పని చేసే వారు గతంలోనూ.. ఇప్పటికీ ఎలాంటి పదవులు లేకుండానే ఉన్నారు. ఈ విధంగా చూస్తే.. జీవీ రెడ్డికి చాలా తక్కువ సమయంలోనే మంచి పదవి దక్కిందనే చెప్పాలి. కానీ దాన్ని ఆయన నిలబెట్టుకోలేకపోయారు.
- PMR Chandrasekhar