సీపీఎం మీద ఏబీఎన్ ఆర్కే అక్రోశం అందుకేనా?
ఏపీలో సీపీఎం బలం గతంతో పోలిస్తే తగ్గింది. ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆపార్టీ బలహీనపడిందన్నది బహిరంగ రహస్యం. అయినా సీపీఎం విధానం మాత్రం చాలామందికి కంటిగింపుగానే ఉంటుంది. పార్టీ బలహీనపడుతుందని ఓవైపు హేళన చేస్తూనే ఇంకా ఆపార్టీ తన విధానానికి కట్టుబడి ఉందనే కలవరం వారిలో కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో ఏబీఎన్ రాధాకృష్ణ ఒకరు. పది రోజుల క్రితం ఆయన పత్రికలోనే సీపీఎం విధానం గురించి ఓ గాలి వార్త రాశారు. దానిని చాలామంది సోషల్ మీడియాలో వైరల్ చేసి సీపీఎం మీద తమ దుగ్ధను చాటుకున్నారు.
సీపీఎం రాజకీయ విధానం గురించి వచ్చే ఏప్రిల్ లో జరగబోయే అఖిలభారత మహాసభలో నిర్ణయం తీసుకుంటారు. దానికి సంబంధించిన ముసాయిదా నివేదిక కూడా ఇంకా వెలువడకుండా ఊహాగానాలతో రాతలు, దానికి వక్రభాష్యాలు కోకొల్లలు. దానికి మూలం ఆంధ్రజ్యోతి రాతలేనని చెప్పవచ్చు. తాజాగా రాధాకృష్ణ ఏపీలో సీపీఎం మీద అసహనం ప్రదర్శించారు. ఆపార్టీ వైఎస్సార్సీపీకి వంతపాడిందంటూ రాసుకొచ్చారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమానికి పదునుపెడుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
రాధాకృష్ణ అసలు ఆందోళన అదే. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతోంది. విధానాల మీద అసంతృప్తి మొదలయ్యింది. ఎన్నో మాటలు చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం మీద అసహనం పెరగబోతోంది. దీనిని రాధాకృష్ణ గ్రహించినట్టుగానే ఉంది. అలాంటి అసంతృప్తి కారణంగా వచ్చే ఉద్యమాలకు నాయకత్వం వహించే సీపీఎం మీద ఉక్రోశానికి అసలు కారణమదే. ఇప్పటికే హామీలు అమలుచేయడం లేదంటూ చంద్రబాబు ప్రభుత్వం మీద వివిధ వర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి. కొందరు ఓ అడుగు వేసి ఉద్యమ బాట పట్టారు. ఇంకొందరు సమ్మె నోటీసులు కూడా ఇచ్చారు. ఇవన్నీ ప్రభుత్వానికి చెమటలు పట్టిస్తాయి. పాలకులకు వంత పాడి, తమ వంతు ప్రయోజనాలు నేరవేర్చుకునే రాధాకృష్ణ వంటి వాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి.
ప్రజలు తమ సమస్యల కోసం అడుగువేసిన ప్రతీసారి వారికి అండగా నిలిచేందుకు సీపీఎం ప్రయత్నిస్తుంది. టీడీపీ, వైఎస్సార్సీపీ అధికారంలో ఎవరున్నా ఆ పార్టీ తీరు మారిన దాఖలాలు లేవు. ఎన్నికల్లో పొత్తులు, ఎత్తులతో సంబంధం లేకుండా ఎవరు పరిపాలిస్తున్నా పోరాటాలకు వెనకడుగు వేసింది లేదు. అయినా గానీ వైఎస్సార్సీపీకి వంతపాడుతూ ఉద్యమాలకు సిద్ధం కాలేదంటూ ఏబీఎన్ ఆర్కే కొత్త భాష్యం చెబుతున్నాడు. బహుశా ఆయన మరచిపోయినట్టుంది.. జగన్ హయంలో తొలి ఉద్యమం ఇసుక కొరత మీద నినదించిన భవన నిర్మాణకార్మికుల ఆందోళనకు అండగా నిలిచిన ఎర్రజెండాను. ఆనాటి కార్మికుల పోరాటాన్ని రాజకీయంగా టీడీపీ ఉపయోగించుకున్న వైనాన్ని. ఇక చివరిలో అంగన్ వాడీల సుదీర్ఘ సమ్మె కాలంలో ఎవరు అండగా ఉన్నారన్నది 10 నెలలు కూడా నిండకుండా మరచిపోతే ఎలా ఆర్కే.
బహుశా రాధాకృష్ణ మాదిరిగా అందరూ ఉంటారని, ఉండాలని ఆయన కోరిక. అందుకు భిన్నంగా సాగిన వాళ్లంటే గిట్టకపోవడం వెనుక అసలు కారణమదే. మొన్నటి వరకూ చంద్రబాబు పాలన అత్యంత అసమర్థంగా ఉందంటూ ఆంధ్రజ్యోతి నిత్యం రాస్తూ వచ్చింది. ప్రభుత్వ వైఫల్యాల మీద వరుస కథనాలు రాసి తన లక్ష్యాలు నెరవేర్చుకోవాలన్నది ఆయన కోరిక. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం హక్కులు తమకి కాకుండా మరో సంస్థకు కట్టబెట్టడం మీద ఆర్కే ఎంత గుర్రుగా ఉన్నాడన్నది అతడి రాతలు చెబుతూ వచ్చాయి. అదే సమయంలో టీవీ5 చైర్మన్ కి టీటీడీ బోర్డు చైర్మన్ గిరీ ఇవ్వడం మీద ఆక్రోశం కూడా వెల్లడయ్యింది. చివరకు టీడీపీ అధిష్టానంతో రాజీకుదిరిన తర్వాత మళ్లీ ఇతరుల మీద కువిమర్శలకు దిగుతున్న తీరుని తాజాగా సీపీఎం మీద విమర్శలు చాటుతున్నాయి. అందరూ తనలా ఉంటారని, బ్లాక్ మెయిల్ తోనే పబ్బం గడుపుకుంటారనే పచ్చ కామెర్ల రోగిని తలపించేలా ఆయన తీరు ఉంటుందని ఈ వ్యవహారాలు చాటుతున్నాయి.
ఉద్యమాల ప్రభావం ప్రభుత్వాలకు ఎంత సమస్యగా ఉంటుందన్నది అందరికీ తెలుసు. ఇప్పుడు ఫీజు రీయంబెర్స్ మెంట్ బకాయిల కోసం విద్యార్థులు, సమ్మె కాలపు ఒప్పందాల అమలు కోసం స్కీమ్ వర్కర్లు, ఉద్యోగ, ఉపాధ్యా య సమస్యల కోసం ఆయా విభాగాలు కార్యాచరణ వైపు అడుగులేస్తున్న తీరు గమనించిన కారణంగానే రాధాకృష్ణకు సీపీఎం మీద కోపం వచ్చినట్టు కనిపిస్తోంది. అన్ని తరగతులు తమ హామీల అమలుకోసం కదిలితే ప్రభుత్వానికి చిక్కులు తప్పవని తెలిసే సీపీఎం మీద నిందలు వేసి ప్రజలను పక్కదారి పట్టించవచ్చని ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. ఉద్యమాలకు నాయకత్వం వహించే వారి మీద బురద జల్లడం ద్వారా ఆయా వర్గాల పోరాటాలకు సారధి లేకుండా చేయాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది.
బహుశా రాధాకృష్ణకు తెలిసే ఉండాలి. లేదంటే మరచిపోయి ఉండాలి గానీ సీపీఎం మీద నిందలు కొత్త కాదు. వారి విధానాల మీద వికృత రాతలు కొత్త కాదు. అదే సమయంలో ప్రజలు పోరాడుతున్న ప్రతీసారి జనం వెంట నడవడం సీపీఎంకి కూడా కొత్త కాదు. కాబట్టి రాధాకృష్ణ ఎంతగా ఆవేశపడినా, ఎన్ని రకాలుగా వక్రభాష్యాలు వల్లించినా బాధిత ప్రజానీకం పోరాటంలోకి రాక తప్పదు. పోరాడుతున్న వాళ్లకు ఉద్యమాల పార్టీ అండగా నిలవకా తప్పదు. అనివార్యమగు విషయాల గురించి చింతించనేల రాధాకృష్ణ!