కాకినాడ పోర్టులో షిప్ సీజ్ చేయలేమని తేల్చేసిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించినట్టు కాకినాడ పోర్టు నుంచి బియ్యం ఎగుమతి చేస్తున్న పనామా స్టెల్లా షిప్ ను సీజ్ చేయలేమని ఏపీ ప్రభుత్వం తేల్చేసింది. అయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. దానికి తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేసింది.
కాకినాడ నుంచి బియ్యం ఎగుమతులు సహా ఇతర అక్రమాల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, వ్యవసాయశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సంయుక్తంగా ఈ అంశంపై సమావేశం నిర్వహించారు. పలువురు అధికారులు పాల్గొన్నారు.
ఏపీలో పోర్టుల నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాదాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టు భద్రత కోసం ఛీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ నియమించాలని నిర్ణయించారు. కాకినాడ పోర్టులో భద్రత వ్యవస్థ బలోపేతం చేయాలని నిర్ణయించినట్టు వెల్లడించారు.
రేషన్ బియ్యం అక్రమ రవాణాను వ్యవస్థీకృత నేరంగా పరిగణించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు.
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తే ఇక కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కాకినాడ పోర్టు, పరిసర ప్రాంతాల్లో రవాణా కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామన్నారు. కాకినాడ పోర్టుకు వెళ్లే లారీల నుంచి అక్రమ వసూళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కాకినాడ యాంకరేజ్ పోర్టులో బియ్యం ఎగుమతి చేస్తున్న స్టెల్లా నౌకపై చట్టపరమైన చర్యలకు నిర్ణయిం,చారు.