బాబు స్కెచ్ పెద్దది..కానీ అంత సీన్ ఉంటుందా?
గోదావరి జలాలను రాయలసీమ తరలించడం గురించి చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడారు. గోదావరి- పెన్నా అనుసంధానం అంటూ 2014-19 మధ్య పలుమార్లు ప్రస్తావించారు. ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా చేశారు. కానీ ఇప్పుడది తెరమరుగయ్యింది. కొత్తగా బనకచర్లకు గోదావరి జలాల తరలింపు ప్రక్రియ ముందుకు తెచ్చారు. డీపీఆర్ సిద్ధంచేసి, మూడు నెలల్లో టెండర్లని చెబుతున్నారు. పైగా ఇదే ఏపీకి గేమ్ ఛేంజర్ అంటూ వర్ణించారు.
ఎప్పుడైనా నీటి ప్రాజెక్టులు పూర్తి చేయడం అందరూ ఆహ్వానించాలి. అది అవసరం. కానీ కేంద్రంలో నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన దేశమంతా వెదికినా ఓ లక్ష ఎకరాలకు సాగునీరు అందించే పెద్ద ప్రాజెక్ట్ ఒక్కటీ పూర్తయిన దాఖలాలు లేవు. ఆయన గద్దెనెక్కకముందే ప్రారంభించిన పోలవరం వంటివి పూర్తవుతున్న ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు. అలాంటి దశలో చంద్రబాబు ఏకంగా రూ. 80వేల కోట్ల ప్రతిపాదనతో బడా ప్రాజెక్టుకి రూపకల్పన చేస్తున్నామంటున్నారు. దేశంలోనే ఇదే పెద్ద ప్రాజెక్ట్ అంటున్నారు.
ఆలోచన సరిగ్గా ఉన్నంత మాత్రాన ఫలితాలు రావు. ఆలోచనలతో పాటుగా ఆచరణ కూడా తోడుకావాలి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు స్కెచ్ ఏమేరకు నెరవేరేనో అన్నది అతి పెద్ద అనుమానం. రాయలసీమ సాగునీటి అవసరాలు తీర్చడాన్ని ఎన్నడైనా ఆహ్వానించాల్సిందే. కానీ అందుకు ఎంచుకున్న మార్గం, దానికోసం జరుగుతున్న ప్రయత్నాలే అత్యాశకు పోతే అసలుకే ఎసరు తప్పదా అన్న అనుమానానికి తావిస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో రాయలసీమ లిఫ్ట్ ప్రతిపాదన ఏమయ్యిందో తెలీదు. వెలిగొండ ఎన్నిటికి నిండేనో అర్థంకావడం లేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి దిక్కూ మొక్కూ లేదు. పోలవరం పూర్తికావచ్చేనా అన్నదే పెద్ద ప్రశ్న. ఇలాంటి అనేకనేక ప్రాజెక్టులు అరకొరగా ఉంటే, ఇతర పలు ప్రతిపాదనలు, పూర్వపు ప్రాజెక్టులు అగ్యమగోచరంగా మారుతుంటే, మరోవైపు పూర్తయినా గానీ ప్రాజెక్టుల నిర్వహణ లేక వరదలకు కొట్టుకుపోతుంటే వాటిని సరిచేయకుండా భారీ అంచనాలతో ముందుకెళ్తే ఏమవుతుంది. వైఎస్ జగన్ పాలనలో అన్నమయ్య ప్రాజెక్టు, చంద్రబాబు హయంలో పెద్దవాగు కొట్టుకుపోయాయి. అపారనష్టం జరిగింది. అయినా వాటిని గాడిలో పెట్టిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు గోదావరి జలాలు బనకచర్లకు అంటుంటే వినడానికి బాగున్నా వాస్తవ రూపం దాల్చడమెలా అన్నదే ప్రశ్న.
ఉన్న ప్రాజెక్టులు పూర్తికాకుండా కొత్త ప్రాజెక్టులంటూ ఊహాల్లో ఊరేగితే ఏం ఒరుగుతుంది. అరకొరగా ఉన్న వాటిని సరిచేసుకోకుండా అదనపు భారాన్ని నెత్తిన పెట్టుకుంటే ఏం జరుగుతుంది. రాష్ట్రంలో సాగునీటి రంగాన్ని సరిదిద్దడంలో భాగంగా అసలు సమస్యకు పరిష్కారం లేకుండా అదనపు సమస్యలను ముందుకు తీసుకొస్తే ఎలా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అనేకనేక అనుమానాలు ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం అడుగులు వేస్తోంది. గోదావరి జలాలను ఎత్తిపోసి రాయలసీమకు తరలించే ప్రయత్నంలో ఉన్నామని అంటోంది. చూడాలి..దానికి కార్యరూపం దాల్చి, జనం ఆశలు పండేదానికి ఎన్నడు మోక్షమో