బాలినేనికి మరో ఎదురుదెబ్బ, మాజీ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జనసేన

వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన నాటి నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డికి అన్నీ ఎదురుదెబ్బలే. తాజాగా మరోసారి ఆశాభంగమయ్యింది. తొలుత ఆయన ఒంగోలులో భారీ సభ ఏర్పాటు చేసి జనసేనలో చేరాలని ఆశించారు. కానీ ఆపార్టీ అధిష్టానం అందుకు భిన్నంగా ఆలోచించింది. కనీసం బాలినేని అనుచరులను కూడా వెంట తీసుకురాకుండా ఆయనతో పాటు అతి కొద్దిమందికి మాత్రమే అవకాశం ఇచ్చింది. అయినా సర్థుకుని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కండువా కప్పుకున్నారు.

ఆ తర్వాత కొంత విరామం తీసుకుని భారీ సభ నిర్వహించేందుకు అధినేత అంగీకరించారని చెప్పుకున్నారు. తీరా ఇప్పుడు నెలలు గడుస్తున్నా అలాంటి అనుమతి రాలేదు. అవకాశం లేదు. ప్రకాశం జిల్లాలో పార్టీ బలోపేతానికి కంకణం కట్టుకున్నానని చెబుతున్నా బాలినేని మాటను పవన్ కళ్యాణ్‌ ఖాతరు చేయడం లేదు.

ఇక బాలినేని ఆశించినట్టు శాసనమండలిలో అడుగుపెట్టాలన్న కలలు కూడా కరిగిపోతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా కొణిదెల నాగబాబును మంత్రివర్గంలో తీసుకోబోతున్నట్టు చంద్రబాబు ప్రకటించారు. దాంతో బాలినేని ఆశలకు గండిపడింది. కనీసం తాను మండలిలో అడుగుపెట్టగలనా అని బాలినేని సందేహించే పరిస్థితి వచ్చేసింది.

బాలినేని మండలిలో అడుగుపెట్టాలంటే ఇప్పుడు జనసేనకి మూడో ఎమ్మెల్సీ సీటు రావాలి. ఆ స్థానానికి ఆయన పేరు పరిశీలించాలి. అది అంత సులువైన విషయం కాబోదు. ఎందుకంటే ఇప్పటికే జనసేన తరుపున కాపు కులస్తుడు హరిప్రసాద్ తొలి ఎమ్మెల్సీగా ఉన్నారు. ఇప్పుడు నాగబాబుని రెండో ఎమ్మెల్సీ చేసి మంత్రివర్గంలో తీసుకోవడం దాదాపు ఖాయంగా ఉంది. మూడోసీటు కూడా ఓసీలకు కట్టబెట్టే అవకాశం అత్యల్పం. అసలు మూడో ఎమ్మెల్సీ జనసేనకు ఎప్పుడు వస్తుందో స్పష్టత లేదు. వస్తే ఎవరికిస్తారో తెలీదు. అలాంటప్పుడు బాలినేని వరకూ ఛాన్స్ రావడం గగనమే.

ఇవన్నీ ఇప్పుడీ మాజీ మంత్రి ఆశల మీద నీళ్లు జల్లుతున్నట్టవుతోంది. ఓవైపు మిత్రపక్ష టీడీపీ నేతల నుంచి చీదరింపులు, రెండో వైపు తాను నమ్ముకున్న నాయకుడి నుంచి ఎదురుదెబ్బలతో బాలినేని లబోదిబోమనే పరిస్థితి వస్తోంది. ఇంతటి క్లిష్ట పరిస్థితిని ఆయన గతంలో ఎన్నడూ ఎదుర్కొని ఉండరనే మాట కూడా వినిపిస్తోంది.

One thought on “బాలినేనికి మరో ఎదురుదెబ్బ, మాజీ మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జనసేన

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *