ఆలయ కమిటీల్లో ఆ రెండు కులాలకు చోటు, మరి మిగిలిన వాళ్లేం చేశారు?
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ పాలకమండళ్ల నియామకాలకు సిద్ధమవుతోంది. ఆక్రమంలో కొత్తగా కమిటీల్లో రెండు కులాల వారికి చోటు కల్పించాలని నిర్ణయించింది. అందులో బ్రాహ్మణ, నాయి బ్రాహ్మణులకు అవకాశం కల్పించాలని నిర్ణయించింది.
ఇప్పటి వరకూ దేవాలయ కమిటీల్లో ఆయా ప్రాంతాలను బట్టి కమిటీల్లో చోటు లభిస్తుంది. కులాల వారీగా కేటాయింపులు లేవు. కానీ తొలిసారిగా ఆ రెండు కులాల వారికి చోటు కల్పించాలంటూ చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఆ రెండు కులాల వారికి కేటాయించేందుకు తగ్గట్టుగా అదనంగా రెండు పోస్టులు కూడా పెంచుతూ ఆదేశాలు వెలువడ్డాయి. ఇప్పుడిది ఆసక్తిగా మారుతోంది. అన్ని చోట్లా ఆయా కులాల వారు ఉండకపోతే పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పల్లెల్లో కొన్నిచోట్ల ఈ కులాల నుంచి ఎవరూ లేకపోతే ఏం చేస్తారన్నది తేలాల్సి ఉంది. దానికి తోడుగా ఆ రెండు కులాల వారికేనా మాకు ఛాన్స్ ఉండదా అంటూ ఇతర కులాలు ప్రశ్నించే అవకాశం లేకపోలేదు.
దేవాలయ కమిటీల్లో రెండు కులాలకు రిజర్వేషన్లు కల్పించడంతో ఇతర కులాల డిమాండ్లు అనివార్యంగా మారబోతున్నాయి. ముఖ్యంగా వైశ్యుల నుంచి ఇది ఎక్కువగా రావచ్చని అంచనా. ఆలయాల నిర్వహణ బాధ్యత నుంచి ప్రభుత్వం వైదొలగాలని కొందరు డిమాండ్ చేస్తుంటే, ఆలయాల్లో నియామకాలకు కూడా రిజర్వేషన్లు కల్పించే ప్రక్రియ చేపట్టడం విశేషంగా మారుతుంది. ఇది రాజకీయంగా ప్రభావితం చేసే అవకాశం కూడా లేకపోలేదు.