చంద్రబాబు ప్లాన్డ్ గానే ఉన్నారు.. జగన్ కు ఇబ్బందులు తప్పవా..?

ఏపీలో కూడా జమిలీ ఎన్నికలు తప్పవా అన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే ప్రకటిస్తున్న వేళ ఏపీ అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు తప్పవనే అంచనాలు పెరుగుతున్నాయి. ఈసారి అసెంబ్లీకి పూర్తి ఆయుష్షు కష్టమనే అభిప్రాయం బలపడుతోంది.

మధ్యంతర ఎన్నికలు వస్తే అవి ఎప్పుడా అన్న చర్చ కూడా సాగుతోంది. 2027లోనే యూపీ ఎన్నికలతో పాటుగా ముందస్తు ఎన్నికలకు కేంద్రం సిద్ధమయితే ఏపీ కూడా దాంతో కలిపి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందన్న వాదన బలపడింది. కేంద్రంలో ఎన్డీయే పక్ష నాయకుడి ప్రకటనలతో ఏపీలో ఎన్డీయే పక్షాలు కూడా సిద్దం కావాల్సి ఉంటుందన్న లెక్కలేస్తున్నారు.

ఏపీ సీఎం చంద్రబాబు దానికి అనుగుణంగానే వేగంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. జమిలీ ఎన్నికలు వస్తున్నాయన్న అంచనాలు తమకున్నాయని వైఎస్సార్సీపీ చెబుతున్నప్పటికీ చంద్రబాబు వ్యూహాలతో విపక్షం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పదే పదే జగన్ ను డిఫెన్స్ లోకి నెట్టేలా చంద్రబాబు అడుగులు పడుతున్నాయి.

తాజాగా షర్మిలతో ఆస్తుల వివాదంలో జగన్ అడుగులు తడబడుతున్నాయి. సొంత చెల్లెలి విషయంలోనే జగన్ అన్యాయం చేశారన్న వాదన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న టీడీపీ యత్నం కొంత మేరకు ఫలించింది. అయితే వారి వ్యక్తిగత వివాదాన్ని నెత్తినెత్తుకోవడం వల్ల టీడీపీకి కలిసొచ్చేదెంత అనే వాదన కూడా ఉంది. ఏమయినా సాయిరెడ్డి- శాంతి వివాదం నాటినుంచి మొదలుకుని వరుసగా వైఎస్సార్సీపీ కి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.

షర్మిల- జగన్ వ్యవహారం తమకు తలనొప్పులు తెస్తుందన్న అంశాన్ని వైఎస్సార్సీపీ కూడా గుర్తించింది. దానికి అనుగుణంగా పార్టీ యావత్తు స్పందించింది. అదే సమయంలో చంద్రబాబు హయంలో పెంచుతున్న సర్ధుబాటు ఛార్జీలు సహా వివిధ అంశాల మీద వైఎస్సార్సీపీ దృష్టి మరల్చి తన విధానాలను వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్లడంలో చంద్రబాబు సక్సెస్ అయినట్టుగా కనిపిస్తోంది. రాబోయే రోజుల్లో కూడా టీడీపీ ఇలాంటి వైఖరితో మరింత ముందుకు వెళ్లడం ఖాయంగా ఉంది. విపక్షాన్ని డైవర్ట్ చేసి, ప్రభుత్వ కార్యకలాపాల ప్రచారం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.

జమిలీ ఎన్నికలు వచ్చినప్పటికీ అప్పటి వరకూ వైఎస్సార్సీపీని కోలుకోకుండా చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుత తీరు కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్‌ కూడా దానికి అనుగుణంగానే వ్యవహరిస్తున్నారు. తాజాగా జగన్నాథపురంలో జరిగిన సభలో షర్మిల సెక్యూరిటీ అంశాన్ని పవన్ ప్రస్తావించినట్టుగా ఉంది. ఏమయినా ముందస్తు ఎన్నికలు వచ్చినప్పటికీ కూటమికి ఢోకా లేకుండా చేసుకోవాలని చూస్తున్న బాబు వ్యూహం చివరకు ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *