రేషన్ అక్రమరవాణాకు మూలం అవేనట..మాఫియా నియంత్రణ కష్టమట!
ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి ఆసక్తికర చర్చకు తెరలేపారు. ఏపీలో రేషన్ బియ్యం మాఫియాకు డోర్ డెలివరీ కోసమంటూ వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన వాహనాలు కారణమంటూ విమర్శించారు. ఏకంగా 1600 కోట్ల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన వాహనాల ద్వారా గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసుకుని అక్రమంగా బియ్యం తరలిస్తున్నారంటూ చెప్పుకొచ్చారు. దానికి ఆధారంగా గడిచిన మూడు ఆర్థిక సంవత్సరాలలో జరిగిన బియ్యం ఎగుమతుల విలువను వెల్లడించారు. రూ. 48,537 కోట్ల విలువైన బియ్యం కాకినాడ నుంచి ఎగుమతి చేశారంటూ వివరించారు.
కాకినాడ పోర్ట్ కేంద్రంగా సాగుతున్న రేషన్ మాఫియా కుట్రపూరితంగా సాగిందని విమర్శించారు. ఒక వ్యక్తి, ఒక కుటుంబం మీద తమకు కక్ష లేదని, దాని వెనుక ఎవరున్నారన్నది తేల్చాలని ప్రయత్నమన్నారు. అరబిందో రియాల్టీకి కాకినాడ సీపోర్ట్స్ లో 41 శాతం వాటా ఎలా అప్పగించారని ఆయన ప్రశ్నించారు. భారత కార్పోరేట్ చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో కేవీ రావు కుటుంబాన్ని బెదిరించి పోర్టులో వాటా రాయించుకున్నారని మండిపడ్డారు. ఆరబిందో రియాల్టీ కాకినాడ పోర్టు మాత్రమే కాకుండా కాకినాడ ఎస్ఈజెడ్ కూడా లాగేసుకున్నారని విమర్శించారు.
కానీ సివిల్ సప్లయిస్ మంత్రి అనేక విషయాలు విస్మరించారు. జగన్ ప్రభుత్వం రేషన్ బియ్యం డెలవరీ వెహికల్స్ ఏర్పాటు చేసుకుని బియ్యం అక్రమంగా తరలిస్తుంటే ఆరు నెలలు దాటినా ఇంకా వాటిని ఎందుకు కొనసాగిస్తున్నారన్నది ఆయన చెప్పలేదు. కాకినాడ స్మగ్లింగ్ డెన్ గా మారిస్తే ఎందుకు నియంత్రించలేకపోతున్నారన్నది మంత్రి వెల్లడించకపోవడం విశేషం. బియ్యం ఎగుమతులు ఆరబిందో పోర్ట్ ను టేకోవర్ చేసిన తర్వాతనే జరిగిందని ఆరోపించడం ద్వారా కాకినాడ పోర్ట్ ద్వారా బియ్యం ఎగుమతులు పెరగడాన్ని ఆయన ప్రశ్నిస్తున్నారు. తద్వారా కాకినాడ పోర్ట్ నుంచి ఎగుమతులు నియంత్రించే ప్రయత్నంలో ప్రభుత్వముందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.
కాకినాడ పోర్ట్ సెక్యూరిటీ లోపం ఉంటే కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నది ఆయన తెలివిగా ఉపేక్షించడం విడ్డూరంగా కనిపిస్తోంది. రేషన్ బియ్యం సేకరణలో వ్యవస్థ ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడుతుంటే అడ్డుకోలేకపోతున్నామంటూ ఆయన పరోక్షంగా అంగీకరించడం చేతగానితనం కాదా.. అదే సమయంలో మంత్రి రెండు విషయాలను కలిపి మాట్లాడడం విడ్డూరంగా కనిపిస్తోంది. కేవీ రావు నుంచి పోర్టులో వాటాలు తీసుకోవడం మీద అభ్యంతరం పెడుతున్నారా లేక రేషన్ బియ్యం స్మగ్లింగ్ మాపియాను తొలగించడం కష్టమని చెప్పదలచుకున్నారా అన్నది మంత్రి నాదెండ్ల మనోహర్ కే తెలియాలి.