అప్పుగా కాదు…కేంద్ర గ్రాంట్ గా నిధులు ప్రకటించాలి : సి.హెచ్ బాబురావు
రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు ప్రకటించిన పదిహేను వేల కోట్ల రూపాయల నిధులను అప్పుగా కాకుండా కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ గా ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సి.హెచ్ బాబురావు కోరారు. శనివారం తుళ్లూరులో సిఆర్డిఏ ప్రపంచ బ్యాంకు ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. భవిష్యత్తులో అమరావతిపై మళ్ళీ అనిశ్చిత పరిస్థితి తలెత్తే అవకాశం లేకుండా చట్టబద్ధంగా,పటిష్టంగా వ్యవస్థీకృతమైన ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు.రాజధాని నిర్మాణంలో జాప్యం జరిగినందున రైతులకు కౌలు ,పేదలకు పెన్షన్ మరో పదేళ్లు పొడిగించాలని కోరారు. దళిత బలహీన వర్గాల అసైన్డ్ భూములకుఇతరులతో సమానంగా ప్యాకేజీ ఇచ్చి న్యాయం చేయాలని అన్నారు.ఉపాధి కల్పించే భారీ సంస్థలు ఏర్పాటు చేయకుండా రాజధాని ప్రజలకు మేలు జరగదని వివరించారు.రాజధాని అమరావతికి ప్రాధాన్యతిస్తూ క్యాపిటల్ రీజియన్ ప్రాంతం పై కూడా దృష్టి సారించాలని సూచించారు.
అక్రమ కేసులు ఎత్తివేయాలి
గత ప్రభుత్వంలో రాజధాని రైతులు, కూలీలు, ప్రజలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేసి ప్రజలలో ప్రభుత్వం విశ్వాసం కల్పించాలని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలకు స్థలాలు కేటాయించినా, ఇప్పటివరకు వాటి నిర్మాణం చేపట్టలేదని ఆందోళన వ్యక్తం చేశారు.తక్షణమే ఆ నిర్మాణాలు చేపట్టాలన్నారు. రాజధానిలో సిఆర్డిఏ లో పనిచేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని,ఇతర మున్సిపాలిటీలలో వలె 21 వేల రూపాయలు వేతనం చెల్లించాలని కోరారు. రాజధాని ప్రాంతంలో స్థానిక సంస్థలు ఎన్నికలు
జరిపి స్వపరిపాలనకు అవకాశం కల్పించాలని అన్నారు.మూడు సంవత్సరాల్లో రైతుల ప్లాట్లు అభివృద్ధి చేయాలని చట్టంలో పేర్కొన్నా..ఇప్పటివరకు జరగలేదు,వాటి అభివృద్ధికి దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
వాటికి విలువ రావాలంటే ఉపాధిక ల్పించే సంస్థలు పెట్టాలన్నారు.రైతుల ప్లాట్లపై బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రుణాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని కోరారు.