బాలినేని బల ప్రదర్శనకు అడ్డంకులు ఏమిటి ?
బహిరంగ వేదికలపై టీడిపి, జనసేన నాయకుల కోట్లాటలు చంద్రబాబు,పవన్ కళ్యాణ్ లకు తల నొప్పిగా మారాయి. ఇలాంటి ఘటనల వలన… వలస నేతలను చేర్చుకునేందుకు టిడిపి జనసేనలు భయపడుతున్నాయి. ప్రకాశం జిల్లా ఒంగోలులో మొదలయిన ఈ అసంతృప్త జ్వాలలు అన్నీ నియోజకవర్గాలకు విస్తరించాయి. ఒంగోలు, దెందులూరు, నెల్లిమర్ల,పిఠాపురం నియోజకవర్గాల బాటలో చాలా నియోజకవర్గాలు చేరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరి దాదాపు 50 రోజులు పైనే అవుతుంది.కానీ పూర్తి స్థాయిలో జనసేన నాయకుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఎదగలేకపోతున్నారన్న ఆవేదన ఆయన అభిమానుల్లో ఉంది. మరో పక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో టిడిపి బలంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల్లో 14 స్థానాలకు గాను 12 స్థానాలు ఆ పార్టీ గెలుచుకుంది. టిడిపి జిల్లా అధ్యక్షులుగా,ఒంగోలు ఎమ్మెల్యే గా బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ ప్రత్యర్థి దామచర్ల జనార్దన్ ఉన్నారు.
బాలినేని బాటలో సామినేని, రోశయ్య వెళితే….?
బాలినేని రాకను జనసేన క్యాడర్ స్వాగతించినప్పటకి… టీడిపి క్యాడర్ మాత్రం వ్యతిరేకించింది. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒంగోలులో అతి త్వరలోనే భారీ సభ ఏర్పాటు చేస్తామని జనసేన లో చేరినప్పుడు బాలినేని ప్రకటించారు.కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సభ నిర్వహణ సాధ్యం అయ్యేలా లేదని సమాచారం.ఇప్పటికే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , బాలినేని లపై దామచర్ల బహిరంగ వ్యాఖ్యలు చేశారు.పవన్ కళ్యాణ్ కూడా బాలినేనిని కాపాడలేరు అంటూ తీవ్రంగా హెచ్చరించారు. దామచర్ల కు కౌంటర్ గా.. పవన్ కళ్యాణ్ పై బహిరంగ వ్యాఖ్యలు చేయవద్దని..పవన్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు తన ఎమ్మెల్యేలకు సూచనలు చేశారు.బాలినేని, పవన్ కళ్యాణ్ కు ఒకే వేదికపై కనిపిస్తే అది వైసిపి కంటే టిడిపి కే ఎక్కువ ప్రమాదంగా మారే అవకాశం లేకపోలేదు.జిల్లా రాజకీయాలును పూర్తిగా మార్చే నాయకుల్లో బాలినేని ఒకరు.బాలినేని సభకు పవన్ హాజరైతే .. అది అగ్నికి ఆజ్యం పోసినట్టు అవుతుంది. రేపు జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, వైసిపి గుంటూరు పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసిన కీలారి రోశయ్య కూడా అదే బాటలో చేరే అవకాశం లేకపోలేదు. రాష్ట్ర పరిపాలనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్న చంద్రబాబు ,పవన్ కళ్యాణ్ లు గొడవలకు ప్రాధాన్యత ఇవ్వరని..సహృద్ధ వాతావరణంలోనే సమస్యల్ని పరిష్కరించుకోవాలని టీడిపి, జనసేనల నుంచి కీలక నాయకులు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.