పవన్ కళ్యాణ్ కి తెలిసే అన్నారా..తెలియక హోం మంత్రిని బద్నాం చేశారా?
“హోమ్ శాఖ మంత్రి బాగా పనిచేయటం లేదు. ఆడపిల్లల ప్రాణాలు పోతున్నాయి. బయటకు వెళ్తే ప్రజలు తిడుతున్నారు. నేను ఆ శాఖ కూడా తీసుకుంటే ఇరగతీస్తాను. అందుకే చెప్తున్నాను పని తీరు మార్చుకోండి.” ఈమాటలన్నది స్వయంగా ఏపీ డిప్యూటీ సీఎం. అంటే ఏపీలో శాంతిభద్రతలు బాలేదని, ప్రజలు తిడుతున్నారని, పరిస్థితి చక్కదిద్దాలని ఆయన గుర్తించారు.
కానీ పవన్ కళ్యాణ్ విస్మరించిన వాస్తవం ఏమంటే ఏపీలో శాంతిభద్రతల విభాగం వంగలపూడి అనిత చేతిలో లేదు. పైగా పవన్ కళ్యాణ్ ఎవరినైనా ఆదర్శంగా తీసుకుని, ఎవరి నుంచి పాలనా పద్ధతులు నేర్చుకుంటున్నానని చెప్పారో అదే ముఖ్యమంత్రి చేతుల్లో శాంతిభద్రతలున్నాయి. అంటే ఆడపిల్లల ప్రాణాలు పోతే కాపాడాల్సిన బాధ్యత హోం మంత్రిది కాదు.. శాంతిభద్రతల శాఖ చూస్తున్న సీఎంది.
ఈ విషయంలో డిప్యూటీ సీఎంకి తెలియక మాట్లాడారా..లేక తెలిసే మహిళా మంత్రిని అవమానించారా అన్నది ప్రశ్నార్థకం. తను నిత్యం ప్రస్తావించే విశేష అనుభవం కలిగిన నాయకుడి చేతుల్లో ఉన్న శాంతిభద్రతల విభాగం గురించి మాట్లాడకుండా కేవలం పోలీసులకి సంబంధించిన వ్యవహారాలు మాత్రమే తన పరిధిలో ఉన్న వంగలపూడి అనితను నిందించడం భావ్యమా అన్నది పవన్ కళ్యాణ్ ఆలోచించాలి.
పైగా ఆయన మూడు శాఖల మంత్రి. కర్ణాటక వెళ్లి కుంకీ ఏనుగుల కోసం ఒప్పందం చేసుకుని వచ్చారు. ఏమయ్యాయి.. ఇప్పటికీ రైతుల ప్రాణాలు పోవాల్సిన దుస్థితి ఎందుకు కొనసాగుతోంది. తన శాఖ పరిధిలో ప్రజల ప్రాణాలు కాపాడే నిర్ణయాలు అమలుకాలేదన్నది ఆయనకు అర్థమయితే ఇతర శాఖల మంత్రుల గురించి మాట్లాడే అవకాశం ఉంటుంది.
తన పరిధిలోని పర్యావరణ శాఖలో యురేనియం తవ్వకాలు చిచ్చుపెట్టాయి. ఇప్పటికే కప్పట్రాళ్ల ప్రాంతంలో చివరకు జనసేన కార్యకర్తలు కూడా ఆందోళనలో ఉన్నారు. అన్ని పార్టీలు కలిసి అక్కడ ఉద్యమం చేస్తున్నాయి. పైగా విపక్షంలో ఉండగా పవన్ కళ్యాణ్ తప్పుబట్టిన తవ్వకాలు ఇప్పుడు తన హయంలో సాగుతుంటే పల్లెత్తు మాట అనలేని మంత్రి పక్క శాఖ మంత్రి మీద నిందలు వేయడం ఏమిటన్నది కీలకాంశం.
మరి..నిజంగా అంత సమర్థత తనుకుంటే తానే ఆ శాఖ కోరుకుని, ఆడపిల్లల ప్రాణాలు కాపాడాల్సింది పోయి..తనకు ఇస్తే ఇరగదీస్తాను అంటే అర్థం ఏమిటీ.. పైగా మంత్రివర్గం అంటే సమిష్టి బాధ్యత అన్న విషయం వదిలేసి సాటి మంత్రిని బహిరంగంగా చిన్నబుచ్చే రీతిలో మాట్లాడడం ఈ మంత్రికి భావ్యమా అన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి వంగలపూడి అనిత కన్నా పవన్ కళ్యాణ్ జూనియర్. ఆమె రెండోసారి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తుంటే పవన్ కళ్యాణ్ తొలిసారి సభకు ఎన్నికయ్యారు. సీనియారిటీ ప్రాతిపదిక కాదనుకుందామా అంటే ఆయనే అనుభవం అవసరమని తాను చంద్రబాబుకి మద్ధతు ఇస్తున్నట్టు చెబుతుంటారు.
అలాంటి అనుభవజ్ఞుడి చేతుల్లో ఉన్న శాఖ వ్యవహారం బాగోకపోతే మరో శాఖ మంత్రిని బద్నాం చేసే యత్నం భావ్యమా డీసీఎంకి. పవన్ కళ్యాణ్ ఆవేశంలో చేసే ప్రకటనలు ఎన్డీయే ప్రభుత్వానికి మేలు చేస్తున్నాయా లేక సాటి మంత్రులను ప్రజల్లో పలుచన చేస్తున్నాయా అన్నది ఆయనకి అర్థమయినా బాగుంటుందేమో కదా.
Telise annadu