కడప రెడ్డమ్మకు అవమానమా, ఎమ్మెల్యే మాధవి నిరసన
కడప రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్పోరేషన్ వ్యవహారాల్లో పెత్తనం కోసం ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి మేయర్ సురేష్ బాబు కి మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. తాజాగా మేయర్ ఛాంబర్ లో ఎమ్మెల్యే కుర్చీలు కూడా తీసివేయించారంటూ ఎమ్మెల్యే మాధవి ఆరోపిస్తున్నారు. తమను అవమానించారంటూ ఆమె నిరసనకు దిగారు.
తాజాగా మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆమె నిలబడి తన నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ మేయర్ స్పందించకపోవడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ పాలక మండలి తీరుని తప్పుబట్టారు. టీడీపీ ఎమ్మెల్యే గా గెలిచినప్పటికీ మునిసిపల్ కార్పోరేషన్ వైఎస్సార్సీపీ చేతుల్లో ఉండడంతో ఆమె మాట చెల్లుబాటు కాకపోవడంతో ఆమె అసహనం ప్రదర్శించారు.
మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో మేయర్ తో పాటుగా తమకు కూడా కుర్చీలుండాలని ఆమె పట్టుబట్టారు. మేయర్ వైఖరిని తప్పుబడుతూ దీని మీద ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. ఈ వ్యవహారం కడప మునిసిపల కార్పోరేషన్ సమావేశంలో గందరగోళానికి దారి తీసింది.