ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి తప్పుకున్న వైఎస్సార్సీపీ!ఎవరికి కలిసొస్తుంది?
ఏపీలో శాసనమండలి స్థానాలకు జరుగుతున్న ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము పోటీ చేయబోవడం లేదని ఆపార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో అదుపుతప్పిన శాంతిభద్రతల కారణంగా ఎన్నికల తీరు మీద తమకు విశ్వాసం లేదని ప్రకటించింది.
రెండు జిల్లాల పార్టీ నేతలతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. నాయకుల అబిప్రాయం సేకరించారు. తొలుత కార్మిక నాయకుడు పి గౌతమ్ రెడ్డిని పోటీలో పెట్టాలని భావించిన వైఎస్సార్సీపీ చివరకు నిర్ణయం మార్చుకున్నట్టు వెల్లడించారు.
వచ్చే ఏడాది ఆరంభంలో గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంతో పాటుగా గుంటూరు- కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతోంది. ఈ రెండు స్థానాలు ప్రస్తుతం పీడీఎఫ్ చేతుల్లో ఉన్నాయి. ఆ సంస్థ తరుపున సిట్టింగ్ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మరోసారి బరిలో దిగుతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కృష్ణా-గుంటూరు జిల్లాల పరిధిలో ఆయనకు గట్టిపట్టుంది. ఇక గోదావరి ఎమ్మెల్సీగా ఉన్న ఐ వెంకటేశ్వర రావు మరోసారి పోటీ చేస్తారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
టీడీపీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. గోదావరి జిల్లాల్లో పేరాబత్తుల రాజశేఖర్, కృష్ణా-గుంటూరు జిల్లాలకు ఆలపాటి రాజా పోటీలో ఉంటారని ప్రకటించింది. జనసేన, బీజేపీ మద్ధతుందని వెల్లడించింది. ఇప్పుడు వైఎస్సార్సీపీ పోటీలో తప్పుకోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలిక తగ్గుతుందని పీడీఎఫ్ అంచనా వేస్తుంది. ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇప్పటికే చంద్రబాబు పాలనా తీరుతో అసంతృప్తిగా ఉన్న తరుణంలో తమకు కలిసివస్తుందని అంచనా వేస్తోంది. అయితే వైఎస్సార్సీపీ పోటీలో లేకపోవడం వల్ల తమకు తిరుగుండదన్న విశ్వాసం టీడీపీ నేతలు వ్యక్తం చేస్తున్నారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల నుంచి టీడీపీ పోటీ నుంచి తప్పుకోగా, ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకి పోటీ నుంచి వైఎస్సార్సీపీ తప్పుకోవడం ఆసక్తికరం.