జగన్ చొరవ నేరంగా చిత్రీకరించే యత్నంలో చంద్రబాబు, చేతులుడిగిన విపక్షం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకకాలంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణానికి పూనుకోవడం ఓ చరిత్ర. గతంలో ఎన్నడూ, ఏ ప్రభుత్వం చేయని సాహసం. అనేక విధాలుగా ఆర్థిక అవస్థల్లో ఉన్న ఏపీలో ఒకేసారి 17 మెడికల్ కాలేజీలు, అవి కూడా ప్రభుత్వమే నిర్మించపూనుకోవడం అభినందించాల్సిన అంశం. అందులో 5 కాలేజీలు ప్రారంభించి, మరో 5 కాలేజీల ప్రారంభానికి సన్నాహాలు చేయడం ఆహ్వానించాల్సిన అంశం. ఇదంతా జగన్ పాలనలో ఏపీకి జరిగిన మేలు. ఏపీలో వైద్య విద్య అభ్యసించాలని ఆశిస్తున్న వారికి కలిగిన ప్రయోజనం.

కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ పేరుతో సీట్లను అమ్మకానికి పెట్టడం జగన్ ప్రభుత్వ పరువు తీసింది. అభాసుపాలుజేసింది. చేసిన ప్రజాప్రయోజనాన్ని కొద్ది మొత్తంలో దక్కే దానికోసం ఆతృతపడి బూడిదలో పోసుకున్నట్టయ్యింది. లభించాల్సిన క్రెడిట్ కన్నా నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. చివరకు ప్రభుత్వం మారిన తర్వాత ఎన్డీయే ప్రభుత్వం ఇప్పుడు మొత్తం ప్రభుత్వ వైద్యవిద్యనే దుంపనాశనం చేసే దిశలో ఉంది. పేదలకు వైద్య విద్యను దూరం చేసే దిశలో ఉంది.

పీపీపీ అంటూ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు దారదాత్తం చేసేందుకు సన్నద్దమవుతోంది. అందుకు గానూ జగన్ హయంలో సాగిన మంచి ప్రయోగాన్ని కూడా తప్పుబట్టేందుకు సిద్ధమవుతోంది. అప్పట్లో ఏమీ జరగలేదనే అభిప్రాయం ప్రజల్లో కలిగించే ప్రయత్నం చేస్తోంది. జగన్ మోహన్ రెడ్డి హయంలో నిర్మించిన భవనాలు కూడా ఏమీ లేవనే రీతిలో చిత్రీకరిస్తోంది. వాస్తవానికి మెడికల్ కాలేజీల నిర్మాణం అనేది ఒకే కాలంలో జరగదు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చేరిన వారికి తగ్గట్టుగా క్లాసుల నిర్వహణకు, హాస్టల్స్ కి, ఇతర కార్యకలాపాలకు ఆటంకాలు లేకుండా భవనాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండో ఏడాది మరో బ్యాచ్ చేరుతుంది కాబట్టి మొదట ఏడాది చేరిన వారితో పాటుగా కొత్త బ్యాచ్ కోసం అదనపు సదుపాయాలను మరుసటి ఏడాదికి సిద్ధంచేయాల్సి ఉంటుంది. ఇలా ఏటేటా చేరే కొత్త బ్యాచ్ లకు అనుగుణంగా ఆయా మెడికల్ కాలేజీల్లో సదుపాయాలు సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది.

జగన్ హయంలో దానికి అనుగుణంగానే మొత్తం రూ. 8,500 కోట్ల సుమారుగా నిధులతో అంచనా వేసి ప్రారంభించిన నిర్మాణాల్లో దాదాపు 30 శాతం వరకూ నిధులు వెచ్చించింది. అందులో కొంత మొత్తం కాంట్రాక్టర్లకు బకాయిలున్నాయి కాబట్టి జగన్ హయంలో జరిగిన పనులు 15 శాతమేనన్నది కూటమి ప్రభుత్వ మాట. కానీ ఇప్పటికే 5 కాలేజీలు ప్రారంభమయ్యి, మరో 5 కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నారన్న సంగతిని ఉద్దేశపూర్వకంగానే పక్కదారి పట్టిస్తోంది. తద్వారా ప్రజల్లో జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదన్న అభిప్రాయం కలిగించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. తద్వారా ప్రైవేటువారికి అప్పగించే ప్రణాళికలో భాగంగా ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నంలో ఉంది.

పులివెందుల మెడికల్ కాలేజీ నిర్మాణం పరిశీలించి ఎన్ఎంసీ స్వయంగా 50 సీట్లకు అనుమతిస్తూ ఆదేశాలు ఇచ్చిన తర్వాత అక్కడ కాలేజీ ప్రారంభించడానికి నిరాకరించిన ప్రభుత్వం ఇప్పుడు పులివెందుల కాలేజీ గురించి వ్యాఖ్యానించడం విడ్డూరంగా కనిపిస్తోంది. ఎన్ఎంసీ కూడా అంగీకరించిన కాలేజీని అక్కడ అవి లేవు, ఇవి లేవు అంటూ మాట్లాడడం విస్మయకరంగా ఉన్నప్పటికీ అసలు లక్ష్యం మాత్రం తమ విధానంలో భాగంగా ఆయా కాలేజీలను పీపీపీలో ప్రైవేటువాళ్లకు కట్టబెట్టే వ్యూహం కొట్టిచ్చినట్టు కనిపిస్తోంది. జగన్ హయంలో జరగిన ప్రభుత్వ కాలేజీల మీద గురిపెట్టి, ప్రజల్లో వాటిని పలుచన చేయడం ద్వారా ప్రైవేటు లాభాలకు అనుగుణంగా మరల్చే యత్నం కనిపిస్తోంది.

ఏపీలో పిడుగురాళ్ల, మార్కాపురం, ఆధోని, మదనపల్లె, నర్సీపట్నం లాంటి మారుమూల ప్రాంతాల్లో కూడా మెడికల్ కాలేజీల నిర్మాణం దాదాపు 50 శాతం పైబడి పూర్తి చేసినట్టు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నా వాటిని మరుగునపరిచి ప్రజలను మభ్యపెట్టవచ్చని ఈ ప్రభుత్వం ఆశిస్తున్నట్టు కనిపిస్తోంది. తద్వారా ప్రైవేటు లాభాలే తమకు పరామవధిగా చెబుతోంది. కానీ దానిని కూడా తగిన రీతిలో తిప్పికొట్టలేని స్థితిలో విపక్షం ఉంది. మండలిలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష సభ్యుల వైఫల్యం బయటపడింది. అసెంబ్లీకి వెళ్లబోము, సభ వెలుపలే అభిప్రాయం చెబుదామంటున్న వైఎస్ జగన్ కూడా ప్రభుత్వ మెడికల్ విద్య మీద సాగుతున్న ప్రభుత్వ ప్రచారాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నట్టు లేదు. తద్వారా తాము సాధించిన అభివృద్ది, తమ హయంలో జరిగిన ప్రజా ప్రయోజనం కూడా చాటిచెప్పేందుకు సుముఖంగా లేకపోవడం ఆపార్టీ బలహీనతలను చాటుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *