ట్రంప్- మస్క్ బంధం చెడింది! ‘బ్రొమాన్స్’ ముగిసింది!

ప్రపంచంలోనే అత్యంత శక్తివంతుడైన రాజ్యాధినేతకు, బడా బిలియనీర్‌కు మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన బ్రొమాన్స్ ఇక ముగిసిపోయింది. అమెరికా ఎన్నికలకు ముందు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కోసం కాలికి బలపం కట్టుకొని తిరిగిన వ్యక్తి ఎలాన్ మస్క్. అమెరికాలో ఎంతో మంది బిలియనీర్లు, టెక్ జెయింట్లు ఉన్నా.. కేవలం మస్క్ మాత్రమే డొనాల్డ్ ట్రంప్‌ను బహిరంగంగా సపోర్ట్ చేస్తూ.. డెమోక్రటిక్ పార్టీని విమర్శిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాడు. ట్రంప్ ఎక్కడకు వెళ్తే.. అక్కడకు వెంట వెళ్లాడు మస్క్. అతడో బిలియనీర్.. అతడికి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్రమంలో ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండానే ట్రంప్‌కు ఇలా మద్దతు ఇస్తాడని ఎవరూ అనుకోలేదు. తప్పకుండా తెరవెనుక బడా ప్లాన్ ఉండే ఉంటుందని అనుకున్నారు.

అందరూ ఊహించినట్లుగానే.. ట్రంప్ అధ్యక్షుడు కాగానే.. మస్క్‌కు కీలకమైన పోస్టు కట్టబెట్టాడు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియన్సీ (Doge) అనే విభాగాన్ని ఏర్పాటు చేసి.. దానికి మస్క్‌ను హెడ్‌గా నియమించాడు ట్రంప్. ప్రభుత్వం ఏయే శాఖల్లో అత్యధికంగా నిధులు ఖర్చు చేస్తోంది, ఎక్కడ ఉద్యోగులు ఎక్కువ ఉన్నారో గుర్తించి.. ఆయా శాఖలకు నిధుల్లో భారీగా కొతపెట్టాడు. అంతే కాకుండా వేలాది మంది ఉద్యోగులను ఒక్క సంతకంతో ఇంటికి పంపించేశాడు. మస్క్ నిర్ణయాలపై ట్రంప్ ఏ మాత్రం అభ్యంతరం చెప్పకుండా సంతకాలు పెట్టుకుంటూ పోయాడు. ఓవల్ ఆఫీసును కూడా మస్క్ తన సొంత ఇంటిలా మార్చేశాడు. తన చిన్న కొడుకుతో పాటు ఎప్పుడూ ట్రంప్ ఆఫీసులో కనిపించేవాడు. ట్రంప్ నిర్ణయాలన్నింటినీ మస్క్ ప్రభావితం చేస్తూ వచ్చాడు. అసలు యూఎస్ అధ్యక్షుడు ట్రంపా? మస్క్ఆ..‌ అనే విమర్శలు కూడా వచ్చాయి.

cease fire

ఇంతలా సాగిన ట్రంప్, మస్క్ బంధం.. ఇప్పుడు విడిపోయే దశకు వచ్చేసింది. దాదాపు విడిపోయారనే వైట్ హౌస్‌లో టాక్. ట్రంప్ ప్రవేశపెట్టాలని భావిస్తున్న స్పెండింగ్ బిల్‌ను మస్క్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాడు. దానికి వ్యతిరేకంగా లాబీయింగ్ కూడా చేశాడు. కానీ ట్రంప్ మాత్రం ఆ బిల్‌పై గట్టిగానే ఉన్నాడు. ట్రంప్ నిర్ణయంపై మస్క్ తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. దీంతో గత కొన్ని రోజులుగా ట్రంప్‌కు వ్యతిరేకంగా తన సోషల్ మీడియా Xలో పోస్టులు పెడుతున్నాడు. గురువారం జర్మన్ లీడర్‌తో ఓవల్ కార్యాలయంలో జరిగిన మీటింగ్‌లో మస్క్‌పై తనకు ఉన్న అసంతృప్తిని చెప్పాడట. ఈ విషయం తెలిసి ట్రంప్‌పై అనేక ఆరోపణలతో మస్క్ ట్వీట్లు చేస్తున్నాడు. దీనికి ప్రతిగా ట్రంప్ కూడా స్పందిస్తున్నాడు. మస్క్ ఇలాగే వ్యవహరిస్తే ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తానని, ట్యాక్సులు కూడా పెంచుతానని హెచ్చరించాడు.

ట్రంప్ హెచ్చరికలతో టెస్లా స్టాక్ ఒక్కసారిగా 14 శాతం పడిపోయింది. అయితే ఇప్పటికే మస్క్ కూడా వార్నింగ్ ఇచ్చాడు. తనపై ఇలా ఒత్తిడి తెస్తే.. అమెరికా వ్యోమగాములు వాడుతున్న స్పేస్ఎక్స్ స్పేస్ క్రాఫ్‌ను డీకమీషన్ చేస్తానని బెదిరించాడు. వైట్ హౌస్ వేదికగా జరుగుతున్న ట్రంప్-మస్క్ డ్రామాను అమెరికా ప్రజలతో పాటు ప్రపంచమంతా గమనిస్తోంది. నిన్న మొన్నటి వరకు ‘నాకు నువ్వూ.. నీకు నేను’ అనుకుంటూ అమెరికాతో పాటు ప్రపంచ దేశాలను ఒక ఆట ఆడుకున్న జంట మధ్య ఎందుకు ఇంత గ్యాప్ వచ్చేసింది? ఇది నిజంగా ఉన్న అభిప్రాయబేధాలా.. లేకపోతే ఇంకేదైనా డ్రామానా అనే డౌటనుమానాలు కూడా ఉన్నాయి. 130 రోజుల పాటు స్పెషల్ గవర్నమెంట్ ఎంప్లాయిలా పని చేసిన మస్క్ గత వారమే ఆ పోస్ట్ నుంచి బయటకు వచ్చేశాడు. ట్రంప్ కూడా తన బిల్లును నెగ్గించుకోవాలని చూస్తున్నాడు. మరి వీరిద్దరి వివాదం రానున్న రోజుల్లో ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

  • జాన్ కోరా
  • సీనియర్ జర్నలిస్ట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *