ఇకపై‌ ఆ విన్యాసాలు కుదరవు..క్రికెట్ లో కొత్త రూల్

వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే మార్లిబాన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) క్రికెట్ క్తాచింగ్ రూల్స్‌లో కీలక మార్పులు చేసింది. ఎంసీసీ రూల్స్‌నే ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) అమలు చేస్తుంది. ఇటీవల కాలంలో బౌండరీల వద్ద క్యాచ్‌లు పట్టే సమయంలో ఫీల్డర్ల విన్యాసాలను మనం చూస్తూనే ఉన్నాం. బౌండరీల వద్ద క్యాచ్ చేసే సమయంలో బ్యాలెన్స్ కోల్పోతున్నామని అనుకున్నప్పుడు.. బంతిని గాల్లోకి విసిరి.. బౌండరీ దాటి వెళ్లి..‌మళ్లీ తిరిగి వచ్చి బంతులు పడుతున్నారు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ ఇలాంటి క్యాచ్ తీసుకోవడం చూశాం.

అయితే బిగ్‌బాష్ లీగ్‌లో మైఖెల్ నెసర్ తీసుకున్న క్యాచ్ వివాదాస్పదమైంది. బౌండరీ వద్ద బంతిని క్యాచ్ చేసిన అనంతరం దాన్ని గాల్లోకి విసిరి లైన్ దాటాడు. ఆ తర్వాత బంతిని పట్టుకునే క్రమంలో అక్కడే గాల్లోకి ఎగిరి బంతిని బౌండరీ లోపలకు వేశాడు.‌అప్పుడు మళ్లీ లోపలకు వచ్చి క్యాచ్ చేశాడు. ఈ ‘బన్నీ హాప్’ క్యాచ్ వివాదాస్పదమైంది. బౌండరీ వెలుపల బంతిని పట్డుకునే సమయంలో అతని కాళ్లు నేలకు తాకలేదు. కానీ బయటే ఉండి ఎగురుతూ బంతిని మళ్లీ లోపలకు పంపాడు. దీనిపై వివాదం నెలకొనడంతో ఐసీసీ కొత్త రూల్స్ తెచ్చింది. బౌండరీల వద్ద ఎలా క్యాచ్ చేయాలో స్పష్టతనిచ్చింది.

బౌండరీ వద్ద క్యాచ్ చేసి బంతిని గాల్లోకి విరిరిన అనంతరం లైన్ దాటితే.. రెండో సారి బంతిని పట్టుకోవాలంటే తప్పని సరిగా బౌండరీ లోపల కాలు పెట్టాల్సిందే. బౌండరీ లోపల కాలు పెట్టకుండా రెండో సారి బంతిని పట్టుకుంటే ఆ క్యాచ్ చెల్లదు. అంటే సూర్యకుమార్ క్యాచ్‌కు వ్యాలిడిటీ ఉంది. కానీ మైఖెల్ నెసర్ పట్టిన క్యాచ్‌కు చెల్లుబాటు లేదు. అది సిక్స్‌గానే పరిగణిస్తారు. బౌండరీ దాటిన తర్వాత మళ్లీ లోపల కాలు పెట్డకుండా బయట నుంచి ఎగిరి వేరే ఫీల్డర్‌కు బంతిని విసిరినా చెల్లదు.

మొత్తానికి ఫీల్డర్లు బౌండరీల దగ్గర బన్నీ హాప్ విన్యాసాలు ఇకపై జాగ్రత్తగా చేయాల్సిందే. లేకపోతే బ్యాటర్‌కు పరుగులు రావడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *