మోదీ నాయకత్వ వైఫల్యం అదే! దీర్ఘకాల నష్టాలు తప్పవు!

భారత్, పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ జరిగింది. కానీ పూర్తిగా దాని ఫలితం దక్కడం లేదు. కవ్వింపు చర్యలు కొనసాగుతుండడం కలవరపరుస్తోంది. దానికి మించి అమెరికా ఆదేశాలను భారత ప్రభుత్వం అనుసరించడం అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది. కాల్పుల విరమణకి పాల్పడిన దేశాల కన్నా ముందే అమెరికా ఈ ప్రకటన చేయడం విస్మయకరంగా మారింది. ట్రంప్ పోస్టులోని కామన్ సెన్స్, ఇంటిలిజెన్స్ వంటి పదాలు అవమానకరంగా కనిపిస్తున్నాయి.
అసలింతకీ ఇండియా ఇక్కడి వరకూ ఎందుకొచ్చిందన్నదే ముఖ్య ప్రశ్న. ఉగ్రవాద దాడుల్లో బాధితురాలిగా ఉన్న దేశం ఆఖరికి ఎందుకు చేతులు ముడుచుకోవాల్సి వచ్చిందన్నది ముఖ్యాంశం. మొత్తం ఎపిసోడ్ అంటే ఏప్రిల్ 22 వ తేదీ పెహల్గావ్ ఉదంతంతో మొదలైతే నరేంద్రమోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యం అర్థమవుతుంది. వ్యూహాత్మక తప్పిదాలు తేటతెల్లమవుతాయి.
దౌత్యపరంగా వైఫల్యం
కాల్పుల విరమణ తర్వాత అందరూ 1971 గుర్తు చేసుకుంటున్నారు. ఇందిరాగాంధీ తెగువని ప్రదర్శిస్తున్నారు. కాలం మారవచ్చు..నేతలు మారవచ్చు. ఆయుధ సంపత్తిలో వైరుధ్యం ఉండొచ్చు. కానీ ఎన్ని ఉన్నా అంతిమంగా నాటికీ నేటికీ ప్రధాన వైరుధ్యం దౌత్యపరంగా ఇందిరా ముందుచూపుతో సాగితే మోదీ ప్రభుత్వం అక్కడే ఘోరంగా విఫలమయినట్టు కనిపిస్తోంది.
1971 నాటికి ప్రచ్ఛన్నయుద్ధం ఎంత తీవ్రంగా ఉందో అందరికీ తెలుసు. సోవియట్ రష్యా, అమెరికా ఒకరిపై ఒకరు పెత్తనం కోసం సాగిస్తున్న ప్రయత్నాలు కూడా తెలుసు. అప్పట్లో అమెరికా పాకిస్తాన్ కి అండగా నిలిచినప్పటికీ ఇందిరాగాంధీ తెగువకి ప్రధాన కారణం అమెరికా ప్రత్యర్థి శిబిరం మనకు తోడుగా ఉండడం. అందులోనూ రష్యా సంపూర్ణ సహకారం. ఆయుధాల నుంచి అన్నింటా రష్యా నాటికీ, నేటికీ అండగానే నిలుస్తోంది.
కానీ మోదీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా సాగింది. దౌత్యపరంగా తగినంత బలాన్ని సంపాదించలేకపోయింది. అమెరికాకి అనుకూలంగా సాగుతున్నప్పటికీ పాకిస్తాన్ తో ఆ దేశ అవసరాలను గుర్తించలేకపోయింది. పాకిస్తాన్ ను కాదని, పూర్తిగా ఇండియావైపు అమెరికా ఉండదన్న విషయాన్ని గ్రహించలేకపోయింది. ఆఖరికి గతంలో ట్రంప్ ఎన్నికల పర్యటనకు వచ్చినప్పుడు ఇండియా నుంచే పాకిస్తాన్ వెళ్లిన విషయం కూడా మరచిపోయింది. దాంతో అమెరికాను నమ్ముకుని ఆఖరికి బాధితదేశంగా మిగిలింది.
ఇటీవల ఆర్థికంగా డీ డాలరైజేషన్ సహా అనేక అంశాల్లో బ్రిక్స్ దేశాలన్నీ దాదాపు ఒకే నిర్ణయంతో ఉన్నప్పటికీ అమెరికాకి ఆగ్రహం కలిగించకూడదనే కారణంతో మోదీ దానికి అంగీకరించడం లేదు. దాంతో ప్రత్యామ్నాయ కరెన్సీ కోసం బ్రిక్స్ చేసిన ప్రయత్నాలు పూర్తిగా ఫలించలేదు. ఇలాంటి అనేక కారణాలతో రష్యా, చైనా కూడా ఇండియా విషయంలో అనుమానిస్తున్నాయి. అమెరికా ప్రయోజనాలు దెబ్బతినకుండా చూసుకునే లక్ష్యంతో మోదీ సాగడం వారికి గిట్టడం లేదు. అమెరికాను కాదని, రెండో శిబిరానికి చేరడంలో మోదీ ప్రభుత్వ ఊగిసలాట తాజా పరిణామాల్లో మరోసారి స్పష్టమయ్యింది. ఇందిరాకు ఉన్నది మోదీకి లేనిదీ ఈ అవగాహనే అన్నది అర్థమవుతోంది.

పాకిస్తాన్ ను ఒంటరిచేయడంలో విఫలం
ఉగ్రవాద చర్యల్లో బాధిత దేశం అందుకు తగ్గట్టుగా వ్యవహరించాలి. పాకిస్తాన్ ను బోనెక్కించాలి. ఉగ్రవాద చర్యలకు ఆధారాలతో ప్రపంచంముందు ఆ దేశాన్ని దోషిగా నిలపాలి. ఆర్థిక, ఆయుధ సరఫరా అడ్డుకోవాలి. కానీ భారత ప్రభుత్వం ఈ విషయంలో ఘోరంగా విఫలమయ్యింది. అసలు పెహల్గావ్ ఘటనకు పాక్ దే బాధ్యత అని ప్రపంచం ముందు ఆధారాలు చూపలేకపోయింది. అందుకు తగ్గట్టుగా పాకిస్తాన్ ను దోషిని చేయడంలో జాప్యం చేసింది. ఆఖరికి ఐఎంఎఫ్ నుంచి భారీగా అప్పులు జారీ అవుతున్నా అడ్డుకోలేకపోవడంలో ఇదో కారణం. కనీసం ఐఎంఎఫ్ లో ఇండియా వాదనను బలపరిచేవాళ్లు కురువయ్యారు. చివరకు బాయ్ కాట్ చేసి బయటకు రావడమే మినహా అప్పు జారీ కాకుండా చేయలేకపోవడం ఘోర వైఫల్యం.
అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా సాగుతున్నప్పటికీ మోదీ ప్రభుత్వం తీరుని ట్రంప్ సర్కారు పూర్తిగా విశ్వసించడం లేదని ఈ ఉదంతం చాటుతోంది. అంతేగాకుండా తుర్కియే ద్వారా పాకిస్తాన్ చేరిన ఆయుధాల్లో అత్యధికం అమెరికావే. గతంలో అదే తుర్కియే నుంచి ఇజ్రాయెల్ కి చేరినా, ఇప్పుడు పాకిస్తాన్ చేరినా అన్నీ అమెరికన్ ఆయుధాలే. అలాంటివి ఉగ్రవాద శిబిరాలకు చేరుకుండా నిలువరించే ప్రయత్నమే జరగలేదు. తమకు గిట్టనప్పుడు ఉగ్రవాదులను ఏరివేసే హక్కు అమెరికాకు ఉన్నట్టే ఇండియాకు కూడా ఉంటుందనే విషయాన్ని మోదీ గుర్తించలేదు. దానిని ఎలుగెత్తిచాటేందుకు సాహసించ లేదు. అంతిమంగా ఒంటరిగా మిగలాల్సిన నిందితుడికి అనేక దేశాల నుంచి సాయం అందించేందుకు సిద్ధమయినా చెక్ పెట్టలేకపోవడం సమస్యగా మారింది.
టారిఫ్ తగాదా మీద అంచనాలేవీ
ప్రపంచ ఆధిపత్యం నిలబెట్టుకునేందుకు అమెరికా యత్నిస్తోంది. దానికి చెక్ పెట్టాలని చైనా చూస్తోంది. ఇది టారిఫ్ యుద్ధానికి కారణమయ్యింది. పోటాపోటీగా ఇరువురు తలపడుతున్నారు. దున్నపోతుల యుద్ధంలో లేగదూడల కాళ్లు విరిగే ప్రమాదం పొంచి ఉంటుందనే స్పృహ భారత ప్రభుత్వానికి ఉన్నట్టు కనిపించలేదు. యూఎస్, చైనా ట్రేడ్ వార్ కారణంగా అనేక కంపెనీలు ఇండియాలో ఏర్పాటు చేసే అవకాశం ఉన్నందున దానిని అడ్డుకునే చర్యలు అనివార్యం అని ముందే గ్రహించాలి. దానికి తగ్గట్టుగా ముందస్తు చర్యలుండాలి. రక్షణ, నిఘా అన్నింటా వైఫల్యం ఇంత వరకూ వచ్చింది. చివరకు దౌత్యపరంగానూ చేతగానితనం చేటు తెచ్చింది.
ఇండియాలో వివిధ కంపెనీల ఏర్పాటుకి అవకాశం ఉంటుందనే తరుణంలో తీవ్రవాద చర్యలు, యుద్ధ వాతావరణం దేశాన్ని చాలా నష్టపరుస్తాయి. అవకాశాలు చేజారిపోవడానికి కారణమవుతాయి. ఓవైపు వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాలు కాచుకుని కూర్చున్న తరుణంలో మోదీ ప్రభుత్వ అసమర్థత స్పష్టమవుతోంది. ఆఖరికి ఐపీఎల్ వంటివే అర్థాంతరంగా నిలిపివేయాల్సిన దశలో పెట్టుబడుల వెల్లువ అంత సులువు కాదన్నది ఇట్టే అర్థమవుతోంది. కాబట్టి టారిఫ్ వార్ ప్రభావం, దాని కారణంగా ఎదురయ్యే సవాళ్ల విషయంలో ఎన్డీయే పాలకులు శ్రద్ధ పెట్టలేదు. చివరకు దేశం అన్ని రకాలుగానూ నష్టపోయేందుకు కారణమయ్యారు. అందుకు తోడు అంతర్జాతీయంగా భారతదేశ గౌరవం మంటగలిగారు. మన సమస్య మీద అమెరికా ప్రకటన చేయాల్సి వచ్చిందంటేనే మనమెంత బలహీనులమో అందరికీ చాటింది. ఇది దేశానికి శ్రేయస్కరం కాదు. నాయకత్వ వైఫల్యం మూలంగా ఎదురయ్యే నష్టం అంతా ఇంతా కాదు.