పాకిస్తాన్ కి అదే బలం! మోదీ అంచనా అందుకే తప్పిందా?

ఒక్కో దేశానికి ఒక్కో బలం ఉంటుంది. పాకిస్తాన్ బలం మాత్రం భౌగోళిక స్వరూపమే. అందులోనూ కీలక దేశాలకు నడుమ ఉండడమే. ఓవైపు ఇండియా, రెండోవైపు చైనా, ఇంకో వైపు ఇరాన్, వాటికి తోడు పూర్వపు సోవియట్ రష్యా కూడా సమీపంలోనే ఉండేది. కనుకనే అమెరికా కన్నేసింది. పాకిస్తాన్ ను ఉపయోగించుకుంది. రష్యాని బెదిరించేందుకు, ఇండియాను కట్టడిచేసేందుకు పాకిస్తాన్ ను వినియోగించుకుది. చివరకు ఇరాన్, ఆప్ఘనిస్తాన్ వంటి దేశాల్లో ప్రజాస్వామ్య పాలకులను గద్దెదించేందుకు పాకిస్తాన్ కేంద్రంగానే పావులు కదిపింది. కొన్ని విజయాలు కూడా దక్కించుకుంది.
కానీ సోవియట్ పతనం తర్వాత పాకిస్తాన్ అవసరం తగ్గింది. కేవలం ఇండియాను నియంత్రించేందుకు మాత్రమే పాకిస్తాన్ అన్నట్టుగా మారింది. దానికి తగ్గట్టుగానే పాకిస్తాన్ కి అమెరికా సాయం అందింది. కానీ చైనా క్రమంగా బలపడుతూ వస్తున్న క్రమంలో మళ్లీ అమెరికాకి పాకిస్తాన్ చేరువ కాకూడదని చైనా ఆశించింది. తన భూభాగానికి చెంతనే అమెరికా కనుసన్నల్లో సాగే ప్రభుత్వాలు ప్రమాదకరమని అంచనా వేసింది. ఓవైపు దక్షిణా కొరియా, జపాన్ వంటి దేశాలకు తోడుగా మరోవైపు పాకిస్తాన్ కూడా అమెరికా ఆడింది ఆట అన్నట్టుగా సాగకూడదని లెక్కలేసింది.
అదే సమయంలో తమ మార్కెట్ అవసరాలు, మధ్య ఆసియా దేశాలతో సంబంధాలకు కీలకం కాబట్టి పాకిస్తాన్ మీద అమెరికా మోజు తగ్గగానే చైనా సీన్ లోకి వచ్చింది. అంటే దాదాపు ఐదు దశాబ్దాల పాటు అమెరికాను పిండుకున్న పాకిస్తాన్ పాలకులు, రెండు దశాబ్దాలుగా చైనా సహాయాన్ని సొమ్ము చేసుకునే పనిలో ఉన్నారు. ఇదంతా ఆ దేశాన్ని ఏలిన వాళ్లకు మాత్రమే ఉపయోగపడింది. వారే అన్ని రకాలుగా బలపడ్డారు. ఒకవేళ పాకిస్తాన్ లో ఏదయినా తేడా వస్తే లండన్ పారిపోయి తలదాచుకునేందుకు తగ్గట్టుగా పోగేసుకోవడానికి అలవాటుపడ్డారు.

ప్రజలను పాలకులు వదిలేసిన తర్వాత దానిని మతోన్మాదులు సొమ్ము చేసుకున్నారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతను ఇండియా మీదకు మళ్లించారు. పాకిస్తాన్ లో ప్రతీ సమస్యకు ఇండియన్స్ కారణమన్నట్టుగా చిత్రీకరించారు. కొంతకాలానికి జనాలకు కూడా ఈ నినాదం విసుగుతెచ్చింది. అదే సమయంలో ఉగ్రవాదానికి తల్లిలాంటి సీఐఏ క్రమంగా తప్పుకునే ప్రయత్నం చేసింది. అమెరికా ఆదేశాలను తోసిపుచ్చి బిన్ లాడెన్ కి ఆశ్రయం ఇవ్వడం వంటివి అందుకు కారణంగా కూడా ఉన్నాయి. ఇది పాకిస్తాన్ లో ఉగ్రమూకల విస్తరణకు ఆటంకమయ్యింది. కానీ ఆర్మీ అండదండలు పుష్కలమయ్యాయి. నేరుగా పాకిస్తాన్ రక్షణదళ అధికారులే ఉగ్రవాదానికి చేదోడుగా నిలవడం మొదలయ్యింది. అభివృద్ధి పేరుతో చైనా అందిస్తున్న సహాయం ఆర్మీ ద్వారా ఉగ్ర క్యాంపులకు చేరడం మొదలైంది. చైనా సైతం తన జోలికి రాకుండా ఉన్నంత కాలం ఇండియాను ఇబ్బంది పెట్టే మూకల వల్ల మేలుగానే భావిస్తోంది.

ఇలా అనేక సంక్లిష్ట సంబంధాలతో ముడిపడిన ఉగ్రవాదం తుంచడానికి బదులుగా తోక తొక్కే యత్నానికి మోదీ ప్రభుత్వం పూనుకుంది. పాక్ ఉగ్రమూలాలు తెంచడానికి బదులుగా దేశంలో ఉద్వేగాలు చల్లార్చేస్తే చాలన్నట్టుగా మోదీ ప్రభుత్వం వ్యవహరించింది. తగిన ముందస్తు చర్యలు లేకుండా ముందుకెళ్లింది. దౌత్యపరంగా పాకిస్తాన్ ను ఏకాకి చేసేందుకు అవకాశం ఉన్నప్పటికీ వినియోగించుకోలేక పోయింది. అక్కడే వ్యూహం బెడిసికొట్టింది. రష్యా, ఇరాన్ వంటి మిత్రదేశాలను ఉసిగొల్పి అన్ని వైపుల నుంచి పాకిస్తాన్ మీద ఒత్తిడికి తీసుకురావాల్సిన దశలో తప్పటడుగు వేసింది. యుక్రెయిన్ కి సహకరిస్తున్నారనే కారణంగా పుతిన్ కూడా పాకిస్తాన్ మీద గుర్రుగా ఉన్నా గానీ ఈ అంశాన్ని ఉపయోగించుకోవడానికి సిద్ధం కాలేదు. అటు అమెరికాకు ఆగ్రహం కలిగించకూడదు, ఇటు పాకిస్తాన్ పనయిపోవాలని తొందరపడింది. చివరకు సైనిక చర్య వరకూ వెళ్లి ఏం సాధించగలిగామననది స్పష్టత లేని దశలో కూరుకుపోయింది. చివరకు మోదీ ప్రకటనలో కూడా అస్పస్టత కనిపించింది.
ఇటీవల చైనా కనుసన్నల్లో సాగుతున్న పాకిస్తాన్ అవసరం అమెరికాకి ఏర్పడింది. చైనాతో టారిఫ్ వైరం ముదురుతున్న దశలో పాకిస్తాన్ వంటి ఉగ్ర శిబిరాలకు కేంద్రంగా ఉన్న దేశం ద్వారా ఇటు ఇండియా అటు చైనాని కూడా చికాకు పరచవచ్చని భావిస్తోంది. అందుకు అనుగుణంగా ఐఎంఎఫ్ అప్పులు నుంచి ఆయుధాల వరకూ అనేకం అందించడానికి సిద్ఢపడుతోంది. తద్వారా ఇప్పుడు పాకిస్తాన్ అనే దేశాన్ని అటు అమెరికా, ఇటు చైనా తమ అవసరాలకు తగ్గట్టుగా మలచుకునే ప్రయత్నంలో ఉన్నారు. దానిని గమనంలో ఉంచుకుండా ముందుకు ఉరికితే ఏమవుతుందో మోదీకి ఇప్పటికే బోధపడి ఉంటుంది. ఇప్పుడు తగిలిన ఎదురుదెబ్బల తర్వాతైన భారత్ పాఠాలు నేర్చుకుంటేనే ఫలితాలు ఉంటాయి.