సిబిల్ స్కోర్ వ్యవస్థకు చెక్ పడుతుందా? సామాన్యులకు ఊరట దక్కుతుందా?

బ్యాంక్ లోన్ కావాలంటే సిబిల్ స్కోర్, ఏదయినా ఫైనాన్స్ వ్యవహారం చక్కదిద్దాలంటే సిబిల్ స్కోర్. ఇలా ప్రతీదానికి సిబిల్ స్కోర్ తో ముడిపెట్టి చాలామందిని వేధిస్తున్న పరిస్థితి కొంతకాలంగా తీవ్రమవుతోంది. సిబిల్ స్కోర్ పడిపోతుందన్న ఆందోళనతో సతమతమయ్యే మధ్యతరగతి సంఖ్య పెరుగుతోంది. దాంతో ఈ వ్యవహారం మీద తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది.

తాజాగా సిబిల్ స్కోర్ విషయమై వివాదం ఏకంగా సుప్రీంకోర్టుకి చేరింది. ఈ విధానం వల్ల ఈ దేశ బ్యాంకు అకౌంట్ హోల్డర్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలుగుతుందని సుప్రీంకోర్టు గుర్తించింది. సిబిల్ స్కోరు అనేది చట్టవిరుద్ధమైన వ్యవహారమంటూ ఆరోపణలున్నాయి. ఏ బ్యాంకు చట్టంలోనూ, రిజర్వు బ్యాంకు చట్టంలోనూ సిబిల్ స్కోరు తప్పనిసరి అని లేదన్న విషయాన్ని పలువురు నిపుణులు ప్రస్తావిస్తున్నారు.

కోర్టులు కూడా ఎక్కడా సిబిల్ స్కోరును లోను ఇవ్వడానికి ఒక షరతుగా చెప్పలేదంటూ గుర్తు చేస్తున్నారు. ఈ సిబిల్ స్కోరును చెక్ బౌన్సులకు ముడిపెట్టి ఎంతోమందికి వేదన, కష్టం కలిగించారంటూ ఫిర్యాదులు రావడంతో సుప్రీంకోర్టు స్పందించింది. చివరికి రైతు రుణాలకు కూడా సిబిల్ స్కోరు అడగటం వల్ల రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారన్న అంశం కోర్టు దృష్టికి సాగింది. మరోవైపు ప్రభుత్వ సిబ్బందికి సైతం ఇటీవల జీతాలు ప్రతి నెలా ఒకటో తారీఖున ప్రభుత్వం ఇవ్వడం లేదన్న అంశాన్ని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగులు ఏదోఒక లోను తీసుకుంటే, చెక్ బౌన్సుల వల్ల సిబిల్ స్కోరు జీరో గా మారి, లోను తీసుకోవడానికి అర్హతను కోల్పోతున్నారనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈపరిస్థితులలో సుప్రీంకోర్టు ప్రజా ప్రయోజన వాజ్యం స్వీకరించింది. అమికస్ క్యూరీ ని ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుండి అఫిడవిటును సమర్పించాలని ఆదేశించింది. సిబిల్ స్కోరు పేరుతో విదేశీ ప్రయివేటు క్రెడిట్ స్కోరింగ్ సంస్థలు వేలాది కోట్లు కొల్లగొట్టాయన్న ఆరోపణలపై నివేదిక కోరింది. కోట్లాదిమంది కస్టమర్ల డాటాను అమ్ముకున్నాయన్న విమర్శల నేపథ్యంలో సుప్రీంకోర్టు నిర్ణయం కీలకం కాబోతోంది. సిబిల్ స్కోర్ వ్యవహారానికి చెక్ పడే అవకాశం ఉందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. నిజంగా దానికి, రుణాలకు ముడిపెట్టే విధానానికి ముగింపు పలికితే చాలామందికి ఊరట అవుతుందని చెప్పవచ్చు. కానీ ఫైనాన్స్ సంస్థలు తాము తాము అప్పులు ఇచ్చేందుకు ఏదో ఒక గీటురాయి ఉండాలని కోరుతున్న నేపథ్యంలో ఆర్బీఐ, ఆర్థిక శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయన్నది ప్రధానం కాబోతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *