జమ్మలమడుగు ఆదినారాయణ సంగతి చూస్తామంటున్న జేసీ ప్రభాకర్ రెడ్డి

జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారం రచ్చకు దారితీస్తోంది. ఇప్పటికే అదానీ సంస్థల కాంట్రాక్ట్ తీసుకున్న సీఎం రమేశ్ తో తగాదా ఏకంగా ఆస్తుల ధ్వంసం వరకూ వెళ్లింది. తాజాగా తాడిపత్రి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు అడ్డుకునే వరకూ సాగుతోంది. దీని మీద జేసీ ఘాటుగా స్పందించారు.

కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఫ్లైయాష్‌ తరలిస్తున్న జేసీకి చెందిన వాహనాలను ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. తమ పరిధిలోని ప్లాంట్ మీద జేసీ పెత్తనమేమంటూ వారు నిలదీశారు. దీని మీద జేసీ నేరుగా జిల్లా ఎస్పీకి లేఖ రాశారు. తమ వాహనాలు అడ్డుకుంటే చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరించారు.

కడపలో ఫ్లైయాష్ తరలించుకుండా మా వాహనాలు అడ్డుకుంటే, మేము కడపకు సిమెంట్, ఇనుము తరలించకుండా వాహనాలు అడ్డుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. ఈ మేరకు కడప జిల్లా ఎస్పీకి నేరగా లేఖ రాశారు. మా వాహనాలు అడ్డుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదేనంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు.

దాంతో వ్యవహారం జమ్మలమడుగు వర్సెస్ తాడిపత్రి అన్నట్టుగా మారుతోంది. ఇప్పటికే సీఎం రమేశ్ తో ఆదినారాయణ రెడ్డి వివాదం సీఎం వరకూ వెళ్లింది. సర్ధిచెప్పే ప్రయత్నం సాగుతోంది. సబ్ కాంట్రాక్టుల్లో ఆదినారాయణరెడ్డికి కూడా భాగస్వామ్యం కట్టబెట్టేలా ఒప్పందం చేసుకోబోతున్నట్టు ప్రచారంలో ఉంది. అదే సమయంలో ఫ్లైయాష్ కోసం జేసీ ప్రభాకర్ రెడ్డితో ఆదినారాయణరెడ్డి కయ్యానికి దిగడం కలకలం రేపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *