ఈవీఎంల భాగోతం బయటపడుతున్నా, విపక్షాలు ఎందుకలా ఉంటున్నాయి?
పోలయిన ఓట్ల కన్నా ఎక్కువే లెక్కిస్తున్నారు
ఈవీఎం ఛార్జింగ్ ఎక్కడా తగ్గడం లేదు
వీవీ పాట్ల లెక్క తేల్చడం లేదు
ఈవీఎంలు ఓటేసిన వాళ్లే రోడ్డెక్కి ఆందోళనకు దిగుతున్నారు
దేశంలో ఎన్నికల వ్యవస్థ చుట్టూ సందేహాలు చెలరేగుతున్నాయి. ఈ అనుమానాలు రానురాను బలపడుతున్నాయి. ఇప్పటికప్పుడు అపోహలు తొలగించాల్సిన ఎన్నికల కమిషన్ వాటికి మరింత ఊతమిస్తోంది. ప్రజల్లోంచి వస్తున్న సందేహాలు తీర్చడానికి ససేమీరా అంటోంది. భవిష్యత్తులో ఇది పెను దుమారం దిశగా సాగుతోంది.
మహారాష్ట్రలో తాము ఓటేసిన పార్టీకి సున్నా ఓట్లు వచ్చి ప్రత్యర్థికి ఎలా ఓట్ల దక్కాయంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. రిటర్నింగ్ అధికారి కార్యాలయం ముట్టడించారు. ఏపీలో కూడా తక్కువేం కాదు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం 28వ పోలింగ్ బూత్ లో వైఎస్సార్సీపీ అభ్యర్థికి వచ్చిన ఓట్లతో పోలిస్తే అదే పోలింగ్ బూత్ లో ఎంపీ అభ్యర్థికి 435 ఓట్లు అధికంగా రావడం విస్మయకరంగా లేదా. ఇలాంటి ఒక్కటి కాదు..వందల ఉదాహరణలు. హర్యానాలో పోస్టల్ బ్యాలెట్లలో రెండింట మూడొంతుల మెజార్టీ సాధించిన కాంగ్రెస్ ఈవీఎంల ముందు బోల్తా పడిన మాట వాస్తవం కాదా.
ఓవైపు పోలింగ్ ముగిసే సమయంలో ప్రకటించిన ఓట్ల శాతం మరునాడు వెల్లడించే సంఖ్యతో ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం 6 గంటల సమయంలోనూ, రాత్రి 12 తర్వాత ప్రకటించిన పోలింగ్ పర్సంటేజ్ లెక్కల్లో పెద్దగా తేడా లేని చోట బీజేపీ ఖంగుతింటోంది. కానీ ఆ లెక్కల్లో వైరుధ్యం ఉన్న నియోజకవర్గాల్లో గెలుస్తోందని జార్ఖండ్ లో రెండు దశల పోలింగ్ శాతం పరిశీలించిన పరకాల ప్రభాకర్ వంటి వాళ్లు లెక్కలు తేల్చారు.
మహారాష్ట్రలో పోలైన ఓట్లకూ, లెక్కించిన ఓట్లకూ 5 లక్షల ఓట్ల తేడా దేనికి సంకేతం. ఏపీలో ఇది 19లక్షల వరకూ ఉండడం మరో విశేషం.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన లెక్కల ప్రకారం మహారాష్ట్రలో తుది ఓటింగ్ శాతం 66.05. మొత్తం పోలైన ఓట్లు 64,088,195.ఇందులో 30,649,318 స్త్రీలు, 33,437,057 పురుషులు ఉన్నారు. అలాగే ఇతరులు 1820 కూడా ఉన్నారు. అయితే కౌంటింగ్ చేసిన మొత్తం ఓట్లు మాత్రం 64,592,508. పోలైన మొత్తం ఓట్లతో పోలిస్తే ఇది 504,313 ఓట్లు ఎక్కువ. పోలైన ఓట్ల కంటే కౌంట్ చేసిన ఓట్లు 5 లక్షలకు పైగా ఉన్నాయి.
అదే సమయంలో రాష్ట్రంలోని ఎనిమిది నియోజకవర్గాల్లో పోలైన ఓట్ల కంటే తక్కువగా ఓట్లు లెక్కించినట్లు తాజా గణాంకాలు చెప్తున్నాయి.
అలాగే మిగిలిన 280 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లకు మించి ఓట్లు లెక్కించారు. పోలైన ఓట్ల కంటే 4,538 ఓట్లు ఎక్కువగా లెక్కించబడిన అష్టి నియోజకవర్గంలో, ఉస్మానాబాద్ నియోజకవర్గంలో 4,155 ఓట్ల తేడా నమోదైంది. ఇలాంటి సవాలక్ష చిక్కులు అధికారిక లెక్కల్లోనే కనిపిస్తున్న తరుణంలో ఓటర్లకు ఎన్నికల వ్యవస్థ మీద విశ్వసనీయత ఏలా. రాజ్యాంగ దినోత్సవం అంటూ ఉపన్యాసాలు దంచుతున్న నేతలు ఎన్నికల్లో పారదర్శకతకు పాతరేసి తమకు నచ్చిన రీతిలో వ్యవహరించే ఎన్నికల వ్యవస్థతో ఉద్దరించడం ఏలా అన్నది ప్రశ్నార్థకం.
ఏపీ, ఒడిశా, హర్యానా, తాజాగా మహారాష్ట్ర ఇలా కేవలం బీజేపీ గెలిచిన రాష్ట్రాల్లోనే ఇంత వైరుధ్యం ఉండడం కొసమెరుపు. పోలింగ్ శాతంలో గానీ, ఈవీఎంల విషయంలో గానీ అభ్యంతరాలు రాని చోట్ల బీజేపీ ఓటమి పాలవుతుండగా, ఎన్నికల విధానంలో అస్పష్టత దోబూచులాడుతున్న చోట బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షాల విజయం కారణంగా ఈవీఎంల మీద అనుమానాలు బలపరుస్తోంది. మిషన్ల చుట్టూ ఇంత గందరగోళం ఎదురవుతున్న తరుణంలో ఈవీఎంల మీద పలువురు స్వరం పెంచుతున్నారు. కానీ తగిన పోరాటం చేసే దిశలో విపక్షాలు సిద్ధం కాకపోవడమే పాలక పక్ష బలంగా కనిపిస్తోంది. తనకు 100 శాతం ఓట్లు దక్కినా తాను ఈవీఎంలను అనుమానిస్తానంటూ స్పష్టంగా చెప్పేసిన అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్లయినా నడుంకట్టి ఈవీఎం వ్యతిరేకత ఉద్యమం మొదలెడితే తప్ప దేశానికి మోక్షం ఉండదనే అభిప్రాయం బలపడుతోంది. ఎక్స్ లో ఈవీఎంల మీద పోస్టులు పెట్టే వైఎస్ జగన్ నేరుగా దాని మీద పోరాడే దశలో లేకపోవడం , ఇతర నేతలు తమకు నష్టంజరుగుతున్నా పూర్తిగా స్పందించలేకపోవడం ఇండియన్ ఎలక్షన్ విధానం అవస్థలకు కారణంగా చెప్పవచ్చు.