ఇల్లు కడుతున్నారా? మంచి సిమెంట్ ఎంపిక చేసుకోవడం ఎలా? పూర్తి వివరాలతో!
ఎంతో మంది ఇళ్లు లేదా భవన నిర్మాణాలు చేపడుతుంటారు.కాని అందులో కొందరికి మాత్రమే ఆయా నిర్మాణాలలో ఏ రకమైన “సిమెంట్” వాడాలో తెలిసి ఉంటుంది. ఆ విషయాలు తెలియని వారు అటువంటి విలువైన సాంకేతిక సమాచారం కోసం చదవ వచ్చు..
“ఇల్లు కట్టి చూడు, పెళ్ళి చేసి చూడు” అంటుంటారు పెద్దలు.చాలామందికి సొంతిల్లు సమకూర్చుకోవడం ఒక కల. దాన్ని సాకారం చేసుకోవడానికి వారు పడే కష్టం వర్ణనాతీతం.అలాంటి ఇల్లు మూడు తరాల పాటు నిక్షేపంగా నిలవాలంటే దాని నిర్మాణంలో అత్యంత కీలకమైన “సిమెంట్”వినియోగంపై అవగాహన అవసరం.
ముందుగా ఎన్ని రకాల సిమెంట్ లు ఉన్నాయో చూడండి
1. Ordinary Portland Cement 33 grade (OPC 33) (IS: 269-2015) ఈ సిమెంట్ ప్రస్తుతం మార్కెట్లో దొరకడం లేదు
2. Ordinary Portland Cement 43 grade (OPC 43) (IS: 269-2015)
3. Ordinary Portland Cement 53 grade (OPC 53) (IS: 269-2015)
4. Ordinary Portland Cement 53S grade (OPC 53S) (IS: 269-2015)
5. Portland Slag Cement (IS 455:2015)
6. Portland Pozzolana Cement (IS 1489 (Part-1): 2015
7. Composite Cement (IS 16415: 2015) 8. Portland Calcined Clay Limestone Cement (IS 18189: 2023) ఈ సిమెంట్ ఇంకా మార్కెట్లోకి రాలేదు ఇవి కాక కొన్ని ప్రత్యేక రకాల సిమెంట్ లు ఉన్నా అవి సాధారణ వినియోగానికి కావు కనుక ఇక్కడ ప్రస్తావించడం లేదు.
ఈ పైన వివరించిన వివిధ రకాల సిమెంట్లలో నిర్మాణ దారులు ఎక్కువగా వాడేది OPC 53 grade. కాని చేదు వాస్తవం ఏంటంటే ఈ OPC 53 grade cement ను ఎట్టి పరిస్థితుల్లోను వాడ కూడదు. ఐతే ఎటువంటి సాంకేతిక జ్ఞానం లేని వారు ఈ OPC 53 వాడితే ఎక్కువ ‘స్ట్రెంగ్త్’ వస్తుందనే అపోహలో ఉన్నారు.
కాని అది పూర్తిగా తప్పు అని గ్రహించాలి.ఇది వాడితే అల్టిమేట్ గాఎక్కువ స్ట్రెంగ్త్ ఏమీ వచ్చేయదు.పైగా ఈ OPC 53 వాడితే నిర్మాణానికి దారుణమైన ప్రతికూలతలు ఉన్నాయని బిల్డర్స్ గ్రహించాలి.ఈసిమెంట్ లో ఉన్న అధిక Tricalcium సిలికేట్ కారణంగా కాంక్రీట్ లో ఉష్ణోగ్రత పెరిగి పగ్గుళ్లకు దారితీయడమేకాక,మిగతా గ్రేడ్ ల కంటే ఎక్కువ కాల్షియమ్ హైడ్రాక్సైడ్ బయటకు కక్కి కాంక్రీట్ లో మైక్రో ఖాళీలు ఏర్పడి కాంక్రీట్ పటిష్టత తీవ్రంగా దెబ్బతింటుంది. హీట్ ఆఫ్ హైడ్రేషన్ ఎక్కువగా ఉండటం వల్ల కాంక్రీట్ లో రసాయనిక చర్యలు జరిగేందుకు కావలసిన నీరు అవిరై స్ట్రెంగ్త్ లభించేందుకు అవసరమైన పరిస్థితులను కోల్పోతుంది. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ OPC 53 ను వినియోగించకండి. మరైతే ఈ సిమెంట్ ను ఎక్కడ వాడాలి అంటే
-ప్రీకాస్ట్ సిమెంట్ ఆర్టికల్స్ లో వాడొచ్చు. ఎందుకంటే వాటిని తయారు చేసిన వెంటనే moist room లో పెట్టి తగిన ఎన్విరాన్మెంట్ లో ఉంచుతారు కాబట్టి. -ఈ OPC 53 లో తగినంత మేర స్లాగ్ కానీ (GGBS) లేదా Flyash కాని లేదా ఈ రెండూ కాని కలిపి వాడినప్పుడు కూడా OPC 53 ను నిక్షేపంగా వినియోగించ వచ్చు. అంతే కాని సాధారణ నిర్మాణాలకు ఈ OPC 53 వాడితే మాత్రం వాటి డ్యూరబిలిటీ మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది.
మరైతే ఏ సిమెంట్ వాడాలి? సమాజంలో అన్నీ మంచి బుద్ధులున్న వాడిని వాడు ‘బంగారం’ అంటాం కదా. ఆవిధంగా చెప్పాలంటే Portland Slag Cement (IS455) ‘బంగారం’ లాంటిదన్న మాట. పైగా అన్ని రకాల సిమెంట్ల కంటే చౌకైనది.కాని కట్టడాల పటిష్టతకు మాత్రం అత్యంత మేలైనది.ఎందుకంటే ఈ సిమెంట్ లో సుమారు 50% స్లాగ్ (Ground Granulated Blast Furnace Slag) ను కలుపుతారు. దీనివల్ల Heat of Hydration తగ్గుతుంది. కాంక్రీట్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. కాల్షియమ్ హైడ్రాక్సైడ్ లీచ్ అవడం తగ్గుతుంది. ఫలితంగాకాంక్రీట్ లో మైక్రో వాయిడ్స్ తగ్గి నిర్మాణం పటిష్టంగా తయారవుతుంది.అంతే కాక నిర్మాణం యొక్క స్ట్రెంగ్త్ చాలా ఏళ్ల వరకు పెరుగుతూనే ఉంటుంది.పైగా ఈసిమెంట్ (PSC ) వాడిన కట్టడాలపై వాతావరణం నుండి క్లోరైడ్స్ మరియు సల్ఫేట్స్ దాడి తక్కువగా ఉండటం వల్ల తీర ప్రాంతంలోఈ స్లాగ్ సిమెంట్ అన్ని సిమెంట్ల కంటే అత్యంత అనుకూలమైనదని నిర్మాణదారులు గ్రహించాలి.
ఐతే దేశంలో అన్ని చోట్ల PSC లభ్యం కాకపోవచ్చు.ఎందుకంటే ఈ సిమెంట్ తయారీకి స్టీల్ ప్లాంట్ లో బ్లాస్ట్ ఫర్నేస్ ప్రాసెస్ లో వ్యర్ధంగా మిగిలే ‘ బ్లాస్ట్ ఫర్నేస్ స్లాగ్’ కావాలి. ఒక వేళ PSC దొరక్కపోతే నెక్స్ట్ బెస్ట్ Portland Pozzolana Cement (PPC). ఈ సిమెంట్ తయారీలో 35% మించకుండా థర్మల్ పవర్ స్టేషన్ లలో లభించే తగిన “ఫ్లై యాష్” ను కలుపుతారు. ఇలా కలపడం వల్ల కాంక్రీట్లో నీరు తగిలితే కరిగిపోయి బయటకి కారి పోయే కాల్షియం హైడ్రాక్సైడ్ తో ఈ ఫ్లై ఆష్ జరిపే pozzolanic యాక్షన్ వల్ల అదనపు dicalcium సిలికేట్ రూపొంది కాంక్రీట్ మరింత పటిష్టంగా మారడమే కాక కాంక్రీట్ లో మైక్రో వాయిడ్స్ తగ్గుతాయి. అంతేకాక కాంక్రీట్ యొక్క స్ట్రెంగ్త్ చాలా ఏళ్ల వరకు పెరుగుతూనే ఉంటుంది.పైగా ఈసిమెంట్ (PPC) వాడిన కట్టడాలపై వాతావరణం నుండి క్లోరైడ్స్ మరియు సల్ఫేట్స్ దాడి తక్కువగా ఉండటం వల్ల PPC సిమెంట్ కూడా తీర ప్రాంతాల్లో నిర్మాణాలకు మంచి.
అందువల్ల ఏ కారణం చేతనైనా ఈ PSC లేదా PPC లు మీ నిర్మాణాల్లో వాడే అవకాశం లేకపోతే మీ నెక్స్ట్ ఆప్షన్ OPC 43 కావాలి కాని OPC 53 మాత్రం కాకూడదు. OPC సిమెంట్ లు ఎక్కువ స్ట్రెంగ్త్ ఇస్తాయన్నది అపోహ మాత్రమే. OPC లో ఇనీషియల్ స్ట్రెంగ్త్ ఎక్కువ.అల్టిమేట్ స్ట్రెంగ్త్ తక్కువ నిర్మాణం తర్వాత 3 నెలల్లో ఈ PSC మరియు PPC ల స్ట్రెంగ్త్ లు OPC స్ట్రెంగ్త్ ల కంటే చాల ఎక్కువగా ఉంటాయి.అందువల్ల OPC కంటే బ్లెండెడ్ సిమెంట్స్ అయిన PSC , PPC లనే మీ నిర్మాణాల కోసం ఎన్నుకోవడం చాల ఉత్తమమైన మార్గం. సిమెంట్ ను కొన్నపుడు మాత్రం తాజా సిమెంట్ ను ఎంచుకోండి.
ప్రతి సిమెంట్ బస్తా పై అది తయారైన బ్యాచ్ నెంబర్ ప్రింట్ చేసి ఉంటుంది. సంవత్సరం లో 52 బ్యాచ్ లు అంటే వారానికి ఒక ‘బ్యాచ్’ గా సిమెంట్ తయారై మార్కెట్లోకి వస్తుంది. ఐతే మార్కెట్లో ఒకే కంపెనీ రకరకాల బ్రాండ్ లతో సిమెంట్ మార్కెట్ చేస్తుంది. అందువల్ల అది ఏ సిమెంటో క్లియర్ గా తెలుసుకోవడానికి సిమెంట్ బస్తా మీద ప్రింట్ అయిన ISI నెంబర్ చూసి పైన ఉదహరించిన IS నెంబర్ ను బట్టి PSC యా, PPC యా, OPC యా అన్నది నిర్దారించుకోండి. ప్రతి బస్తా మీద ISI నంబర్లు ప్రింటై ఉంటాయి. ఎందుకంటే భారత దేశంలో సిమెంట్ అనేది ‘తప్పనిసరిగా’ బ్యూరో అఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS ) నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం తయారు చేసి మాత్రమే మార్కెట్ చేయాలి తప్ప, ISI మార్కులేకుండా సిమెంట్ అమ్మటానికి వీలు లేదు. మీరు కొనే బస్తా నెట్ వెయిట్ 50 kg లు ఉండాలని గ్రహించండి. మీరు కొనే సిమెంట్ తో పాటు దాని ‘టెస్ట్ రిపోర్ట్’ అడిగితే అమ్మకం దారుడు దాన్ని ఇవ్వడం తప్పనిసరి అని గుర్తించండి. ఈ పైన చెప్పిన ఉన్నతమైన ప్రయోజనాలతో పాటు, PSC , PPC సిమెంట్ లు మీ నిర్మాణాల్లో వాడటం వల్ల కలిగే మరిన్ని ప్రయోజనాలు
-వీటిల్లో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ల లో వ్యర్దాలుగా మిగిలిపోయే స్లాగ్ కన్స్యూమ్ అవుతుంది. వీటిల్లో థర్మల్ పవర్ స్టేషన్ లలో వ్యర్ధంగా విపరీతంగా పేరుకుపోయే ‘fly ash’ కన్స్యూమ్ అవుతుంది
-తద్వారా OPC తయారీలో వినియోగించే లైం స్టోన్ తదితర ముడి ఖనిజాలు ఆదా అవుతాయి — వీటి వాడకం వల్ల కట్టడాలు పటిష్టంగా ఎక్కువ కాలం మనగలుగుతాయి కనుక ప్రకృతి సిద్ధమైన ఇసుక, రాయి, మట్టి లాంటి కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ యొక్క వినియోగం తగ్గి సహజ వనరులు ఆదా అయి పర్యావరణానికి ఎనలేని మేలు జరుగుతుంది. చివరిగా ఏ కంపెనీ సిమెంట్ మంచిది, ఏ బ్రాండ్ కొనాలి అనే సందేహం రావచ్చు. అయితే దాదాపు మార్కెట్లో లభించే 90% కంపెనీల సిమెంట్ లు క్వాలిటీ గానే ఉండటం ఒక మంచి పరిణామం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా మందికి ఓ జీవితకాల లక్ష్యంగా ఉండే “సొంతిల్లు” నిర్మాణాన్ని పటిష్ఠంగా అమలు చేసుకుంటారని ఆశిద్దాం.
- Dr. Srinivasa Varma K ఇంజనీరింగ్ నిపుణుల సౌజన్యంతో
..