అక్కడ అన్ని పార్టీలు ఒక్కటే, మరిక్కడ ఇలా కలిసెళ్లి విజయవాడ వరద సహాయం అడగలరా?
పైన ఫోటోలో కేంద్ర హోం శాఖ మంత్రికి వినతిపత్రం అందిస్తున్న నేతలంతా ఒక్క పార్టీ కాదు. కానీ ఒక్క రాష్ట్రం వారే. తమ రాష్ట్రానికి సంబంధించిన సమస్యల వరకూ తామంతే ఒకటేనని చాటుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని కేంద్రం మీద ఒత్తిడి పెంచుతున్నారు.
కేరళకి చెందిన ఎంపీలతో ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ సమావేశం నిర్వహించారు. అన్ని పార్టీల ఎంపీలు హాజరయ్యారు. తమ అభిప్రాయాలు వ్యక్త పరిచారు. ఉమ్మడిగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రయత్నించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎంపీలంతా కలిసి కేంద్ర హోం మంత్రిని కలిశారు. ఒక్క హోం మంత్రినే కాదు.. ఏ శాఖకు సంబంధించిన అంశాల మీద ఆయా మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ప్రస్తావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా సమిష్టి యత్నం సాగుతోంది.
ఏపీలో ఎంపీలంతా ఒకే తాటి మీదకు వచ్చిన సందర్భం చూడగలమా. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల విషయంలో సమిష్టిగా ప్రయత్నం ఆశించగలమా.. కనీసం ఎంపీలందరితో ఉమ్మడి సమావేశం నిర్వహించేటంత పెద్ద మనసు ఇక్కడ ముఖ్యమంత్రులుగా ఉన్న వారి నుంచి కోరుకోగలమా. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు అంటూ మాటలు చెప్పడమే కాదు, చేతల్లో చూపించేలా కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాల ప్రజా ప్రతినిధులు వ్యవహరిస్తుండగా అందుకు విరుద్ధంగా ఏపీ నేతలుంటారనడం నిస్సందేహం.
అందుకే ఏపీకి దక్కాల్సిన విభజన చట్టంలోని ప్రయోజనాలు, ఇతర హామీలన్నీ గాలికిపోతున్నాయి. ఎప్పుడయినా అరకొరగా నిధులు కేటాయించడం మినహా రాష్ట్రానికి రావాల్సిన నిధులు దూరమవుతున్నాయి. చివరకు విజయవాడ విపత్తుల్లో చిక్కుకుంటే కనీసం వరద సహాయం కింద ఒక్క పైసా కూడా కేంద్రం విదిల్చలేదంటే ఏపీ పరిస్థితి, ఇక్కడి నేతల వ్యవహారం చూడండి ఎంతటి దయనీయమో. మనం ఆ దక్షిణాది రాష్ట్రాల వారితో పోలిస్తే ఎంత దూరంలో ఉన్నామో.