బ్యాటర్ల తీరు మారకుంటే సిరీస్ గోవిందా! షమీ ఎప్పుడొస్తాడు?
ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టులో సాధించిన రికార్డ్ విజయం మరచిపోకముందే పింక్ బాల్ టెస్టులో ఓటమి పాలయ్యింది. బుమ్రా నాయకత్వంలో గెలిచిన టీమిండియా రోహిత్ శర్మ కెప్టెన్సీలో అడిలైడ్ లో పరాభవం ఎదుర్కొంది. అందుకు ప్రధాన కారణం బ్యాటర్ల వైఫల్యమే. టీమిండియా బ్యాటింగ్ పేలవ ప్రదర్శనతో రెండో టెస్టులో ఓటమి పాలయ్యింది. ఇండియా ఆస్ట్రేలియా జట్ల మధ్య టెస్ట్ సిరీస్ లో చరిత్రలో వేగంగా ముగిసిన టెస్ట్ గా ఈ మ్యాచ్ మిగిలిపోయింది.
టీమిండియా బ్యాటర్లలో ముఖ్యంగా సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి వారు కీలకంగా వ్యవహరించాల్సి ఉంది. ఈ ఇద్దరిలో ఒక్కరైనా ముందుండి జట్టుని నడిపించాలి. సరిగ్గా పెర్త్ లో అదే జరిగింది. కోహ్లీ సెంచరీ కారణంగా జట్టు గెలిచింది. అడిలైడ్ లో వరుస సెంచరీల స్థాయి కాకపోయినా రెండు ఇన్నింగ్సులలో ఏదో ఓ సమయంలో రాణించాల్సి ఉంది. కనీస రన్స్ సాధించి, పార్టనర్ షిప్ నెలకొల్పాల్సి ఉంది. కానీ కోహ్లీ అది చేయలేకపోయాడు.
ఓపెనింగ్ స్లాట్ రాహుల్ కి త్యాగం చేసి మిడిలార్డర్ లో వచ్చిన రోహిత్ అయితే మరింత పేలవ ప్రదర్శన. రెండు ఇన్సింగ్సులలో కలిపి కూడా అతని స్కోర్ డబుల్ ఫిగర్ కి చేరలేదు. గడిచిన 6 టెస్టుల్లో కలిపి కేవలం 142 రన్స్ మాత్రమే సాధించడం చూస్తుంటే రోహిత్ శర్మ ఎంత పేలవ ఫామ్ లో ఉన్నాడో అర్థమవుతోంది. ఇక రిషబ్ పంత్ మీద ఆస్ట్రేలియా సిరీస్ వరకూ చాలా ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆశించినట్టుగా రాణించలేకపోతున్నాడు. రెండు టెస్టులలోని నాలుగు ఇన్నింగ్సులలో కూడా అదే పరిస్థితి.
పెర్త్ లో సత్తా చాటిన ఓపెనింగ్ జోడి అడిలైడ్ లో చేతులెత్తేసింది. శుభ్ మన్ గిల్ కూడా మంచిగా ప్రారంభించినా ఇన్నింగ్స్ కొనసాగించలేకపోయాడు. ఇలా బ్యాటర్లంతా వరుసగా ఫెయిల్ కావడంతో రెండు ఇన్నింగ్సులలోనూ జట్టు ఆశలు నిలుపుకోలేకపోయింది. కేవలం నితీశ్ కుమార్ రెడ్డి మినహా మిగిలినవారంతా విఫలమయ్యారు. కేవలం నితీశ్ కారణంగానే జట్టు ఇన్నింగ్స్ ఓటమి తప్పించుకోగలిగింది.
బ్రిస్బేన్ లో జరగబోయే మూడో టెస్ట్ మ్యాచ్ కి బౌలింగ్ విభాగంలో కొన్ని మార్పులు అనివార్యంగా కనిపిస్తున్నాయి. హర్షిత్ రాణా స్థానం అనుమానమే. నాలుగు, ఐదు టెస్టుల నాటికి షమీ జట్టులో చేరబోతున్న తరుణంలో బౌలింగ్ విభాగంలో బుమ్రా కి తగిన జోడీ అవుతాడు. కానీ బ్యాటింగ్ విభాగం బలపడితే మాత్రమే ఈ సిరీస్ మీద ఆశలు, ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్స్ లక్ష్యం నెరవేరుతుంది. లేదంటే ఇక అంతే.