దొమ్మరాజు గుకేశ్ విజయానికి మూలం కోహ్లీ ఫిట్ నెస్ మంత్రం అదే!
2011లో టీమిండియా చివరి సారిగా వన్డే వరల్డ్ కప్ గెలిచింది. ఆనాడు టీమిండియా విజయంలో తెరవెనుక కీలకపాత్రధారుల్లో ఆయన ఒకరు.
2024 పారిస్ ఒలింపిక్స్ లో టీమిండియా హాకీ మెడల్ సాధించింది. అప్పుడు కూడా టీమ్ సక్సెస్ లో ఆయన పాత్ర ఉంది.
తాజాగా గుకేశ్ వరల్డ్ ఛాంపియన్ షిప్ సాధించాడు. చిన్నవయసులోనే వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన ఆ చిన్నోడి విజయంలోనూ ఆయన పాత్ర ఉంది.
ఆటలు వేరు..ఆటగాళ్ళు వేరు. కానీ ఆయన విజేతలను తయారుచేయడంలో సిద్ధహస్తుడిగా పేరు గడించాడు. అందుకే పాడీ ఉప్టన్ పాపులారిటీ అలా పెరుగుతోంది. టాలెంటెడ్ కోచ్ గా , మోటివేషనల్ స్పీకర్ గా ఆటగాళ్ల మనోధైర్యాన్ని పెంపొందించడంలో ఆయనది పెద్ద పాత్ర. వారిని విజేతలుగా నిలపడంలో కీలక భూమిక.
వాస్తవానికి దక్షిణాఫ్రికాలో పుట్టిన పాడ్రిక్ ఆర్దర్ ఉప్టన్ తొలుత బీసీసీఐ కాంట్రాక్ట్ ద్వారా ఇండియాలో అడుగుపెట్టారు. టీమిండియా వెంబడి క్రికెట్ మెంటర్ గా వ్యవహరించారు. గ్యారీ కిరిస్టెన్ కోచ్ గా ఉండగా క్రియాశీలకంగా వ్యవహరించారు. అందుకు తగ్గట్టుగా పలితాలు కూడా సాధించారు.
స్పోర్ట్స్ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్, మరియు మానవ శాస్త్రాలపై పట్టున్న ఉప్టన్ ఆ తర్వాత సైకాలజీ కోచ్ గా ఎదిగారు. ఆటగాళ్ల మానసిక స్థైర్యాన్ని పెంచడం, ఒత్తిడిని సమర్థవంతంగా నిర్వహించడం, వారి ఉత్తమ ప్రదర్శనను వెలికితీసేందుకు తగ్గట్టుగా మోటివేట్ చేస్తూ ముందంజ వేస్తున్నారు.
2011 క్రికెట్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సైకాలజీ కోచ్‌గా పని చేశారు. అతని సహకారంతో భారత జట్టు 28 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. తదుపరి రాహుల్ ద్రావిడ్‌తో కలిసి ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) లో రాజస్తాన్ రాయల్స్ కోచింగ్ బృందంలో కీలక పాత్ర పోషించారు. కోహ్లీ ఫిట్ నెస్ విషయంలో కూడా అతడిది కీలకపాత్ర. పాడీ ప్రోత్సాహంతోనే కోహ్లీ ఫిట్ నెస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు గతంలోనే చెప్పడం విశేషం.
క్రికెట్ తో పాటుగా హాకీ, తాజాగా చెస్ లో ఇండియన్ ప్లేయర్లు రాణించేందుకు దోహదపడ్డారు. తద్వారా వివిధ వేదికల మీద త్రివర్ణ పతాకం ఎగురవేసేందుకు తగ్గట్టుగా ఆటగాళ్లకు తర్ఫీదునివ్వడంలో ఆయనది ప్రధాన పాత్రగా చెప్పవచ్చు.