Allu Arjun Arrest: కేసుని వైఎస్సార్సీపీ వాదిస్తోందా?
అల్లు అర్జున్ అరెస్ట్ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి అడ్వకేట్ గా ఉండడం విస్తృతంగా చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే ఆపార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి కూడా స్పందించారు. తొక్కిసలాట పేరుతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తే పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటలో చంద్రబాబుని ఎన్నిమార్లు అరెస్ట్ చేయాలంటూ ప్రశ్నించారు.
అదే సమయంలో ఎంపీ నిరంజన్ రెడ్డి ఈ అరెస్ట్ కేసుని డీల్ చేయడం ఆసక్తిగా మారింది. వైఎస్సార్సీపీ నేత స్వయంగా రంగంలో దిగి అల్లు అర్జున్ కి అండగా నిలుస్తున్నారంటూ కొందరు వాదిస్తున్నారు. కానీ వాస్తవానికి అల్లు అర్జున్ తో నిరంజన్ రెడ్డి బంధం ఈనాటిది కాదు. అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డితో నిరంజన్ రెడ్డికి చాలాకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ వ్యవహారాలకు న్యాయ సలహాదారుడికి నిరంజన్ రెడ్డి ఉన్నారు.
ఆ క్రమంలోనే గతంలో చంద్రశేఖర్ రెడ్డి మీద పలు ఫిర్యాదులు కేసుల వరకూ వెళ్లిన సమయంలో కూడా నిరంజన్ న్యాయపరంగా క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలోనూ ఆయన అదే రీతిలో స్పందించారు. ఆ కుటుంబ సన్నిహితుడిగా, అల్లు అర్జున్ అత్తారింటికి దూరపు బంధువుగా నిరంజన్ రెడ్డి సీన్ లోకి వచ్చారు. కానీ దానిని కొందరు రాజకీయాలకు ముడిపెడుతుండడం విశేషం.
నిరంజన్ రెడ్డి రాజకీయ నాయకుడిగా, ఎంపీగా మారకముందే పేరున్న అడ్వకేట్. న్యాయవాద వృత్తిలో భాగంగానే ఆయన వైఎస్ జగన్ కి పరిచమయ్యారు. ఆ స్నేహమే ఆయనకు రాజ్యసభ వరకూ వెళ్లేందుకు దోహదపడింది. అలాంటి తన వృత్తి వ్యవహారాల్లో అల్లు అర్జున్ కి అండగా నిలిచిన నిరంజన్ రెడ్డి రాజకీయాలకు ముడిపెట్టి వైఎస్సార్సీపీకి అల్లు అర్జున్ మరింత సన్నిహితంగా మెలుగుతున్నారనే సంకేతాలు పంపించే ప్రయత్నంలో ఓ సెక్షన్ మీడియా కనిపిస్తోంది.