జమిలీ ఖాయమే కానీ, ఇప్పుడే కాదంటున్న చంద్రబాబు!

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆసక్తికర కామెంట్స్ చేశారు. జమిలీ ఎన్నికలు జరగబోతున్నట్టు పరోక్షంగా అంగీకరించారు. కానీ షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయన్న ధీమా వ్యక్తం చేశారు. మీడియాతో చిట్ ఛాట్ గా మాట్లాడిన ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.

జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనే అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించామన్నారు. 2027లోనే ఎన్నికలు ఖాయమంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ వైసీపీ పబ్బం గడుపుకోవడానికి ఏదిపడితే అది మాట్లాడుతోందన్నారు. వైసీపీ నేతలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయారని, ఆపార్టీ తీరు చూసి జనం నవ్వుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందన్న ధీమా వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందున్నారు. వర్సిటీలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతిచోటా చర్చ జరగాలన్నారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాల్సి ఉందన్నారు.2047లోనూ ఇదే పునరావృతం అవుతుందంటూ చంద్రబాబు అభిప్రాయపడ్డారు.

స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ కార్యరూపం దాల్చడానికి, భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నంలో అందరు భాగస్వామ్యం కావాలంటూ పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే విజన్ 2047 అని తెలిపారు. సాగునీటి సంఘాలు, సహకార, ఇతరత్రా ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుపుతున్నామన్నారు. తదుపరి కలెక్టర్ల సదస్సులో ఎన్నో మార్పులు తీసుకొస్తామన్నారు. సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా చూస్తామన్నారు. ప్రశ్న- సమాధానాల రూపంలో సమావేశాలుంటాయన్నారు. ముందుగానే కలెక్టర్లు, ఎస్పీలకు చర్చకు సంబంధించిన అంశాలు పంపి సమాధానాలు కోరతామన్నారు.

మంత్రులు, అధికారుల మధ్య సమన్వయం పెరగాలన్నారు. ఆస్పత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. ఏపీ అభివృధ్దికి అద్వానీ సహకారం ఎంతో ఉందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *