జగన్ పుంజుకుంటున్నాడంటున్న ఏబీఎన్ ఆర్కే, ఎందుకలా?

ఏబీఎన్ రాధాకృష్ణ ఆందోళన చెందుతున్నాడా.. చంద్రబాబు పాలనా తీరుతో అసంతృప్తిగా ఉన్నారా.. బాబు విధానాల కారణంగా మళ్లీ వైఎస్ జగన్ కి ఆదరణ పెరుగుతోందని కలత చెందుతున్నారా. తాజాగా ఆయన రాతలు అందుకు సాక్ష్యంగా ఉన్నాయి. వైఎస్ జగన్ పుంజుకుంటున్నారని ఆందోళన చెందుతున్నట్టు చాటుతున్నాయి.

జగన్ మోహన్ రెడ్డి బలపడుతున్న అంశాన్ని వేమూరి రాధాకృష్ణ తన వీకెంట్ కామెంట్ లో పరోక్షంగా చెప్పేశారు. చంద్రబాబుని హెచ్చరిస్తూ ఈ విషయాన్ని వెల్లడించేశారు. సీఎంగా అద్భుత పనితీరు అంటే విజన్ తో పాలించడం మాత్రమే కాదని, ప్రత్యర్థిని కట్టడి చేసే రాజకీయ వ్యూహాలు కూడా ఉండాలని కూడా హెచ్చరించారు. రాజకీయ ప్రత్యర్థిని బలహీనపరచడంలో వెనుకబడితే అది చారిత్రక తప్పిదం అవుతుందంటూ ఆందోళన వ్యక్తపరిచారు.

జగన్ మోహన్ రెడ్డి మళ్లీ బలపడి, అధికారం చేపట్టే పరిస్థితి వస్తే అది చంద్రబాబు తప్పిదమే అవుతుందంటూ ఏబీఎన్ ఆర్కే రాసిన రాతల సారాంశం చూస్తుంటే ఏపీలో విపక్షం పుంజుకున్న విషయాన్ని అంగీకరించినట్టు కనిపిస్తోంది. తన కోసం కాకపోయినా రాష్ట్రం కోసమయినా జగన్ రెడ్డి బలపడకుండా చూడాలంటూ రాధాకృష్ణ ప్రస్తావించడం అందుకు సాక్షంగా ఉంది.

ఆరు నెలలు పూర్తవుతున్న వేళ కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో సంతృప్తి లేదంటూ ఆర్కే వ్యాఖ్యానించారు. అదే సమయంలో అసంతృప్తి కూడా కనిపించడం లేదంటూ సర్ధి చెప్పారు. ఇక నుంచి ప్రభుత్వ పనితీరు, ఎమ్మెల్యేల వ్యవహారశైలితో ప్రజల అభిప్రాయం మారుతుందంటూ హెచ్చరించారు. జగన్ మోహన్ రెడ్డిని ఓడించడం కోసమే ప్రజలు పోలింగ్ బూత్ లకు క్యూ కట్టిన విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుంచుకోవాలని ఆర్కే సూచించారు.

వాస్తవానికి అత్యంత ఘోర పరాభవంతో కుదేలయిన వైఎస్సార్సీపీలో ఉత్సాహాన్ని నింపుతోంది చంద్రబాబు పాలనా విధానమేనన్న విషయాన్ని ఆర్కే గుర్తించినట్టు కనిపిస్తోంది. అధికారం కోల్పోయిన ఆరు నెలలకే వైఎస్సార్సీపీ రైతు సమస్యల పేరుతో కదం తొక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. అనేక జిల్లాల్లో భారీ సంఖ్యలో తరలివచ్చిన శ్రేణులతో ఆందోళన అదిరింది. అదే సమయంలో వైఎస్ జగన్ మరోసారి జనంలోకి వెళ్తే పరిస్థితి మరింత మారిపోయే ప్రమాదం ఉంటుందని ఆర్కే ఆందోళన చెందుతున్నట్టు కనిపిస్తోంది. కానీ నిజానికి జగన్ కి ఇలాంటి అవకాశం ఇస్తున్నది చంద్రబాబు పాలనా విధానమేనన్నది సుస్పష్టం. బాబు సీఎంగా ప్రజలకు పెన్షన్లు పెంచడం మినహా చేసింది లేదు. ఎన్నికల హామీలు అమలుకాలేదు. మరోవైపు ధరల భారం జనాలకు కూటమికి దూరం చేసేలా ఉంది. ఇవన్నీ జగన్ కి ప్రాణం పోస్తుంటే కూటమికి ప్రమాదాన్ని తెచ్చిపడుతున్నాయన్నది రాధాకృష్ణ మాట. మరి ఇక నుంచైనా చంద్రబాబు తన తీరు మార్చుకునే ప్రయత్నం చేస్తారా లేక జగన్ ను కట్టడి చేయడం మీద దృష్టి పెట్టి జనాలకు దూరమవుతారా చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *