అదీ పవన్.. అదే రూటు! పిఠాపురంలో పట్టు సడలకూడదంటే..!

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గడిచిన ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలో దిగి గెలిచారు. అంతకుముందు గాజువాక, భీమవరం ఓటర్లు ఆయన్ని ఓడిస్తే పిఠాపురం ప్రజలు మాత్రం ఆదరించారు. అసెంబ్లీలో అడుగుపెట్టాలన్న ఆయన కోరిక తీర్చారు. దాంతో ఆయన ఇచ్చిన హామీల అమలు మీద దృష్టి పెట్టాలని ఓటర్లంతా కోరుకుంటున్నారు.

అందుకు తగ్గట్టుగానే ఇటీవల పిఠాపురం పట్టణ అభివృద్ధికి సంబంధించి పవన్ కళ్యాణ్ రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తొలుత పిఠాపురం అర్బన్ అథారిటీ డెవలప్మెంట్ ఏర్పాటునకు ఆమోదం తెలిపారు. దాంతోపాటుగా పిఠాపురంలో ఉన్న ఆస్పత్రిని 100 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు అనుగుణంగా అధికారిక ప్రకటన వెలువడింది. ఈ రెండూ పిఠాపురం అభివృద్ధికి దోహదపడే అంశాలు. ప్రజల దీర్ఘకాల సమస్యలకు పరిష్కారం చూపే అవకాశం కూడా ఉంది.

పిఠాపురం ఆస్పత్రి అప్ గ్రేడ్ చేస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా 66 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. వైద్యుల నియామకం, వారికి తగిన వసతులు పూర్తయితే పిఠాపురం ఆస్పత్రికి కొత్త శోభ దక్కుతుంది. పిఠాపురం తాలూకా ప్రజలకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ప్రతీ చిన్న సమస్యకు కాకినాడ పరుగులు పెట్టాల్సి రావడం, అది జనరల్ ఆస్పత్రి కావడంతో సేవల కోసం ఎక్కువ సమయం వేచి చూడాల్సి రావడంతో సామాన్యులు కూడా అప్పులు చేసి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. తాజాగా పవన్ చొరవతో తీసుకున్న ఆస్పత్రి అభివృద్ధి నిర్ణయం ఆ ప్రాంత వాసులకు మేలు చేస్తుంది.

వాటితో పాటుగా కీలకమైన ఏలేరు ఆధునీకరణ, కాళింగలు, లాకులు పునర్నిర్మాణం సహా ఇతర రైతాంగ సమస్యలు కూడా పరిష్కారమయితే పిఠాపురం అభివృద్ధి పరుగులు పెడుతుంది. పవన్ కళ్యాణ్‌ ఎన్నికల హామీలు అమలవుతున్నట్టు ప్రజలు విశ్వసిస్తారు. రాజకీయంగా జనసేనానికి అది ఎంతో మేలుచేస్తుంది. జన విశ్వాసం పొందితే దీర్ఘకాలం ఆయనకు పిఠాపురం ప్రజలు తోడుగా నిలిచే అవకాశం కూడా ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *