విరాట్ వైఫల్యం టీమిండియాకు శాపంగా మారుతోందా? సీనియర్లే టీమ్ కి భారమా?
టీమిండియా తీవ్రంగా సతమతమవుతోంది. ముఖ్యంగా టెస్టుల్లో జట్టు కుదురుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గడిచిన ఐదు టెస్టుల్లో కేవలం ఒక్కటి మాత్రమే గెలిచింది. నాలుగు టెస్టుల్లో ఓటమి పాలయ్యింది. బ్రిస్బేన్ లో వర్షం ఆపకపోతే ఐదో టెస్ట్ ఓటమి అంచున ఉంది. ఆస్ట్రేలియాకు సిరీస్ అప్పగించే పనిలో కనిపిస్తోంది.
జట్టులో ఆటగాళ్లు ఒకరిద్దరు మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. బౌలింగ్ లో బుమ్రా, బ్యాటింగ్ లో కొంత మేర కేఎల్ రాహుల్ మినహా మిగిలిన వాళ్లంతా తమ స్థాయికి తగ్గట్టుగా ఆడలేకపోతున్నారు. అడపాదడపా కొత్త ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డి కొంతమేర ప్రభావం చూపే ప్రయత్నంలో ఉన్నాడు.
ముఖ్యంగా సీనియర్ల పరిస్థితి అత్యంత దయనీయం. అందులోనూ జట్టుని ముందుండి నడిపించాల్సిన రోహిత్, విరాట్ వైఫల్యం టీమిండియాకు శాపంగా మారుతోంది. విరాట్ అయతే గడిచిన ఐదేళ్ల టెస్ట్ కెరీర్ చూస్తే అత్యంత దయనీయంగా కనిపిస్తోంది. తన తోటి పోటీ పడిన జో రూట్, స్టీవెన్ స్మిత్, కేన్ విలియమ్స్ వంటి వాళ్లు టెస్టుల్లో తమ క్లాస్ ఆటతో కదం తొక్కుతుంటే కోహ్లీ ఘోరంగా విఫలమవుతున్నాడు. గడిచిన ఐదేళ్లలో కోహ్లీ జట్టుకి అవసరమైన సందర్భాల్లో ఆదుకున్నది లేదు. మూడు సెంచరీలు చేయగా ఆ మూడు కూడా జట్టు పటిష్ట స్థితిలో వచ్చి బ్యాటింగ్ చేసినవే. మొన్నటి పెర్త్ టెస్టులో కూడా జట్టు స్కోర్ 275కి చేరిన తర్వాత క్రీజ్ లోకి వచ్చి సెంచరీ చేశాడు.
ఆ మూడు సెంచరీలు మినహాయిస్తే 62 ఇన్సింగ్సులకు గానూ కోహ్లీ చేసిన రన్స్ కేవలం 1557 మాత్రమే. సగటు 26లోపు. ఎంత పేలవంగా ఉందో చూడండి. మిడిలార్డర్ లో జట్టుని నడిపించాల్సిన విరాట్ కోహ్లీ ఊరికే ఐదారు స్టంప్ ల ఆవల పోతున్న బాల్స్ కెలుక్కుని అవుట్ అవుతున్న తీరు ఆందోళనకరంగా ఉంది. ఈ సిరీస్ లో 4 సార్లు అదే రీతిన పెవిలియన్ బాట పట్టాడు. దాంతో కోహ్లీ కారణంగా టీమిండియా ఘోర పరాభవాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. కుర్రాళ్లలో స్ఫూర్తి నింపేలా పోరాడాల్సిన సీనియర్లు ఇట్టే బ్యాట్లు ఎత్తేసి వెనక్కి బయలుదేరడం జట్టుని వేధిస్తోంది. అనేక మంది కుర్రాళ్లు డొమెస్టిక్ సీజన్లలో సత్తా చాటుతుంటే సీనియర్లు టీమ్ లో తమ ప్లేస్ స్థిరం చేసుకుని ఈ రీతిన టీమిండియా పరువు తీస్తున్న తీరు మీద క్రికెట్ అభిమానులు కలత చెందుతున్నారు.
అడిలైడ్ లో ఘోర పరాజయం, బ్రిస్బేన్ లో అలాంటి ఆటతీరునే పునరవృతం చేసిన తరుణంలో టీమిండియా మేనేజ్మెంట్ పునరాలోచన చేస్తుందా లేదా అన్నది కీలకం. జట్టుని పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమయ్యిందనే అబిప్రాయం బలపడుతోంది.