గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ: అమరావతి కన్నా ముందుగా కట్టిన నవరాయ్‌పూర్ నేర్పుతున్న పాఠమేంటి?
దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న గురజాడ మాటలు గుర్తురాక తప్పదు. ఎందుకంటే రాజధాని అంటే అందమైన భవనాలు, అదిరిపోయే రోడ్లు, ఆకట్టుకునే నిర్మాణాలు మాత్రమే కాదని..అక్కడ నివశించే జనాలని పాలకులకు అర్థమయ్యేలా చెబుతున్న పాఠం ఇది. ఎంత అందంగా డిజైన్ చేశామో, ఎంత అద్భుతంగా నిర్మించామో, ఎంత పెద్దమొత్తంలో ఖర్చు చేశామో అన్నది ఏ నగరానికి కొలబద్ధ కాదనే వాస్తవాన్ని చాటుతున్న విషయమిది.
దేశంలోనే తొలి గ్రీన్‌ఫీల్డ్ క్యాపిటల్ సిటీ నిర్మాణానికి చత్తీస్‌ఘడ్ శ్రీకారం చుట్టింది. 2 దశాబ్దాలు దాటింది. కానీ ఇంకా కొత్త నగరం పూర్తిరూపు దాల్చలేదు. నయా రాయ్‌పూర్ పేరుతో మొదలై ప్రస్తుతం నవరాయ్‌పూర్ అటల్ నగర్ గా పేరు మార్చుకున్న రాజధాని నగరానికి దశ, దిశ ఎన్నటికోననే స్పష్టత లేదు. సర్వహంగులు సిద్ధం చేస్తున్నా, జనాలు అటువైపు మొగ్గుచూపడం లేదు. దాంతో రాజధాని వెలవెలబోతోంది. సెలవు రోజులయితే నిర్మానుష్యంగా మారుతోంది. ఏపీలో అమరావతి పేరుతో రాజధాని నగర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టి పుష్కరకాలమవుతోంది. ఈ తరుణంలో అమరావతికి ముందుగా పట్టాలెక్కిన రాజధాని ప్రాజెక్ట్ అనుభవం పరిశీలించాల్సిన అవసరముంది. అందుకే ద న్యూస్ తెలుగు టీమ్ నాలుగు రోజుల పాటు పాత, కొత్త రాయ్‌పూర్ ని సందర్శించింది. అక్కడి పరిస్థితి పరిశీలించింది. పలు ప్రాజెక్టుల స్థితిగతులను పరిగణలోకి తీసుకుని ఈ రిపోర్ట్ అందిస్తోంది.

చత్తీస్‌ఘడ్ రాజధాని నవరాయ్‌పూర్ అటల్‌నగర్ విధానసభ ప్రాంతం
రోజువారీ రాకపోకలే..
2000 సంవత్సరంలో అప్పటి ఎన్డీయే ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన మూడు రాష్ట్రాల్లో చత్తీస్‌ఘడ్ ఒకటి. 36 కోటలున్న ప్రాంతంగా పిలుచుకునే రాష్ట్రానికి తొలుత రాయ్‌పూర్ రాజధానిగా ఏర్పాటయ్యింది. కానీ రెండేళ్లు తిరిగే సరికే అప్పటి సీఎం అజిత్ జోగి ప్రతిపాదనలతో కొత్త నగరం అంశం తెరమీదకు వచ్చింది. కాంగ్రెస్ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా అడుగులు వేసింది. 2006లో నయా రాయ్‌పూర్ డెవలప్‌మెంట్ అథారిటీ(ఎన్‌ఆర్‌డీఏ) ఏర్పాటయ్యింది. కొత్త నగర నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టినట్టయ్యింది.
20 ఏళ్ల తర్వాత కూడా ప్రస్తుతం ఎన్‌ఆర్‌డీఏ ప్రాంతం రాజధాని కాదు కదా.. కనీసం ఓ పట్టణస్థాయిని కూడా చేరలేదు. ప్రస్తుత అంచనాల ప్రకారం నిండా 70వేల మంది జనాభా కూడా ఈ ప్రాంతంలో నివశిస్తున్న వారు కనిపించరు. వివిధ కార్యాలయాల సిబ్బంది, ముఖ్య నేతలు, ఇతర అవసరం ఉన్న వారంతా రోజువారీ రాకపోకలే. పాత నగరానికి 20 కిలోమీటర్ల దూరంలోనే ఉండడం, రాకపోకలకు సదుపాయాలు అందుబాటులో ఉండడంతో ఇది నిత్యకృత్యమన్నట్టు సాగుతోంది. పొద్దున్న ఆఫీసు సమయానికి రావడం, సాయంత్రానికి మళ్లీ పాత రాయ్‌పూర్ కి పయనమైపోవడం. ఆఫీసు సమయాలు ముగిసిన తర్వాత, సెలవు రోజుల్లో పూర్తిగా ఖాళీ అన్నట్టు. కనీసం మనుషులు కూడా కనిపించడం కూడా గగనమే.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆఫీసులన్నీ..
2006లో ఆ ప్రాంతంలోని 41 గ్రామాలకు చెందిన రైతుల నుంచి భూసేకరణ చేశారు. మెట్ట వ్యవసాయం సాగిస్తున్న ప్రాంతంలో నష్టపరిహారం కూడా పెద్ద మొత్తంలో చెల్లించిన దాఖలాలు లేవు. దాదాపు 5వేల మంది భూములిచ్చిన రైతులున్నారు. ఆ తర్వాత నిర్మాణ పనులు ప్రారంభించి క్రమంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి చేస్తూ వచ్చారు. ప్రస్తుతం విశాల రోడ్లు, ప్రభుత్వ కార్యకలాపాలకు అవసరమైన భవనాలు కనిపిస్తున్నాయి. మహారాజ కోటను తలపించేలా సచివాలయం నిర్మించారు. దానికి మహానది పేరు పెట్టారు. దానిని ఆనుకుని హెచ్‌ఓడీలకు భవనం ఉంది. దానికి మరో నది ఇంద్రావతి పేరు ఉంది. చేరువలోనే విధానసభ భవనం కూడా గత ఏడాది ప్రారంభించారు. దాంతో సచివాలయం, అసెంబ్లీ సహా రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలన్నింటికీ కేంద్రస్థానంగా నవరాయ్‌పూర్ అటల్ నగర్ మారింది.
చత్తీస్‌ఘడ్ ప్రభుత్వంతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా అందుబాటులోకి వచ్చాయి. ఆర్బీఐ, ఎన్ఐఏ, ఎన్టీపీసీ వంటి సంస్థలే కాకుండా యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి వివిధ బ్యాంకింగ్ సంస్థలు కూడా భారీ భవంతులు నిర్మించాయి. సెంట్రల్ సెక్రటేరియేట్ నుంచి కూడా కార్యకలాపాలు సాగుతున్నాయి. దాదాపుగా 26 కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలన్నీ అక్కడి నుంచే సాగుతున్నాయి. అయినా ఆయా సంస్థల సిబ్బంది కూడా వచ్చి, పోవడమే తప్ప నవరాయ్‌పూర్ లో నివశించడానికి మొగ్గు చూపడం లేదు.

విల్లాల నుంచి విశాల అపార్ట్‌మెంట్స్ వరకూ..
మొత్తం 19,800 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ గ్రీన్‌ఫీల్డ్ సిటీలో నివాసాలకు కూడా సకల సదుపాయాలున్నాయి. అత్యంత ఖరీదైన విల్లాలున్నాయి. సీఎం, మంత్రుల నివాసాలున్నాయి. సీఎం నివాసం సుమారు 3 ఎకరాల విస్తీర్ణంలో ఉంటే, ఒక్కో మంత్రికి దాదాపు ఎకరం స్థలంలో విశాలమైన భవనాలు సిద్ధం చేశారు. ఇక ప్రభుత్వ సిబ్బందికి అనుగుణంగా ఉన్నతాధికారుల నుంచి కింద స్థాయి సిబ్బందికి తగ్గట్టుగా భవనాలున్నాయి. చత్తీస్‌ఘడ్ హౌసింగ్ బోర్డ్ ఆధ్వర్యంలో నిర్మించిన భవనాలు కొన్ని ప్రైవేట్ వ్యక్తులకు సైతం అందుబాటులో ఉన్నాయి.
అయినా గానీ అత్యంత ఖరీదైన భవంతులు సైతం ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అక్కడక్కడా కొద్దిమంది మినహా ఎవరూ కనిపించరు. చివరకు సీఎం కూడా గెస్ట్ గా వచ్చిపోతుంటారు. మంత్రులు సైతం అరుదుగా కనిపిస్తారు. ఎమ్మెల్యేలు, ఇతర ఉన్నతాధికారుల భవనాలు కూడా అంతే. చివరకు నవ్రాయ్పూర్ లో ఉన్న వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల ఫ్యాకల్టీలో అత్యధికులు సైతం పాతరాయ్‌పూర్ నుంచి వచ్చిపోతుంటారంటే చూడొచ్చు కొత్త నగరం ప్రభావం ఏపాటిదో.
ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు..
నవరాయ్‌పూర్ ప్రస్తుతం ఓ టూరిజం ఎట్రాక్షన్ గా మారుతోంది. దేశంలోనే అతి పెద్ద మానవ నిర్మిత జంగిల్ సఫారీ కూడా ఇక్కడే అందుబాటులో ఉంది. అదే సమయంలో అప్పుడప్పుడూ వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు రాజధాని నిర్మాణాలను, ప్లాన్ చూసుకుంటూ సరదాగా గడిపి వెళ్తున్న వారే ఎక్కువ. అందుబాటులోకి పలు ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలు వచ్చాయి. అందులో ప్రతిష్టాత్మక ఐఐఎం రాయ్‌పూర్, ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిఫుల్ ఐటీ) వంటివి ఉన్నాయి. కళింగ యూనివర్సిటీ, దిల్లీ పబ్లిక్ స్కూల్ సహా పలు ఇంటర్నేషనల్ ఇనిస్టిట్యూషన్స్ అందుబాటులో ఉన్నాయి. కానీ అక్కడికి కూడా స్టూడెంట్స్ పాత రాయ్‌పూర్ నుంచే ఎక్కువగా వస్తున్నారు.
మరో ఆసక్తికర విషయమేమంటే కేవలం 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఎన్ఐటీ రాయ్‌పూర్ నిర్మాణం కోసమంటూ నవరాయ్‌పూర్ లో ఏకంగా 200 ఎకరాల స్థలం కేటాయించారు. కానీ ఇరుకుగా ఉన్నప్పటికీ, పాత భవనాల్లోనే ఎన్ఐటీ కొనసాగిస్తున్నారే తప్ప కొత్త రాజధానికి మళ్లడం లేదు. కేంద్రం నిధులు ఇచ్చినప్పటికీ అటు వెళ్లేందుకు ఫ్యాకల్టీ ససేమీరా అనడంతోనే పాతనగరంలో కొనసాగిస్తున్నారంటే నవరాయ్‌పూర్ ఎంతమేరకు అక్కరకొచ్చిందన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
బస్తీ వాసులే ఎక్కువ, రైతుల్లో అసహనం
నవరాయ్‌పూర్ ప్రస్తుతం జనాభా 70వేలుంటుందని భావిస్తుంటే అందులో అత్యధికులు గతంలో భూములిచ్చిన 41 గ్రామాలకు చెందిన వారే ఎక్కువ. ఆ పాతబస్తీలన్నీ మధ్యమధ్యలో మనకి కనిపిస్తాయి. విధాన సభ ఎదురుగా ఉన్న బస్తీలో సైతం రోడ్లు, మంచినీటి సదుపాయాలు కనిపించవు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు వచ్చినప్పుడే తాగునీటి అవసరాలు తీర్చుకోవాలి. మట్టిరోడ్లతో ఆ బస్తీ అంతా ఉంది. భూములిచ్చిన రైతుల పరిహారం ఇప్పటికే ఖర్చయిపోగా చాలామంది తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. రాజధాని కోసం భూములు తీసుకున్న నాడు చెప్పిన హామీలు మరచిపోయారని వారంతా వాపోయారు. యువతకు ఉపాధి అవకాశాలు లేకపోవడంతో కొందరు వలసలు పోయారు.
కూలీలు, కొందరు రైతులు అక్కడ కార్మికులుగా పనిచేస్తున్నారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ విభాగాల్లో పనిచేస్తున్నారు. ఉదయాన్న వారందరినీ వ్యాన్ల ద్వారా ఆయా ఆఫీసులకు తీసుకెళ్లే కాంట్రాక్ట్ సంస్థలున్నాయి. రైతు కుటుంబాలకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలుకాలేదని విధానసభలో పనిచేస్తున్న పుణ్యశీల యాదవ్ అనే మహిళ ద న్యూస్ తెలుగుతో తన అభిప్రాయాన్ని పంచుకుంది. భూమి చేతిలో ఉన్నప్పుడు ఏదోటి సాగు చేసుకుని నిశ్చితంగా సాగిపోయామని, ఇప్పుడు నెలకు రూ. 9,500 ఇస్తుంటే కాలం నెట్టుకొస్తున్నట్టు ఆమె వివరించింది.

రవాణా ఏర్పాట్లు కూడా..
రెండు జాతీయ రహదారులను ఆనుకుని నవరాయ్‌పూర్ నగరం నిర్మించారు. ఎన్‌హెచ్ 43, ఎన్‌హెచ్ 53 కూడా రాజధానికి సమీపాన ఉన్నాయి. రైల్వే లైన్ నిర్మాణం కూడా ఇటీవల పూర్తయ్యింది. కానీ ఎక్కువ మంది పాతరాయ్‌పూర్ జంక్షన్ రైల్వేస్టేషన్ మీదనే ఆధారపడుతున్నారు. పాత, కొత్త రాయ్‌పూర్ నగరాల నడుమ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి చేశారు.
నవరాయ్‌పూర్ నగరంలో ప్రయాణాలకు ప్రభుత్వం ప్రత్యేక బస్సులు నడుపుతోంది. బస్ స్టేషన్లు కూడా ఆధునిక పద్ధతిలో నిర్మించారు. ఎక్కడా ట్రాఫిక్ కి ఆటంకం కలగకుండా రోడ్లు, ఐల్యాండ్స్ , బస్ బేలు వంటివి కనిపిస్తాయి. ప్రైవేటు వాహనాల మీద వచ్చి వెళ్తున్న వారే ఎక్కువగా ఉన్నారు.
అంతా ప్లాన్డ్ గానే.. అప్పుల్లేకుండా
పక్కా ప్లాన్డ్ సిటీగా చెప్చొచ్చు. ఆధునిక హంగులు కూడా ఉన్నాయి. అందులో భాగంగానే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ కేబుల్స్ వంటివి సిద్ధం చేశారు. మొత్తం నగరమంతా ఎక్కడా ఒక్క కేబుల్ లైన్ కూడా బయటకు కనిపించదు.
మొత్తం అభివృద్ధి కోసమంటూ ఇప్పటికి సుమారు రూ. 9వేల కోట్లు వెచ్చించారు. అందులో దాదాపుగా ప్రభుత్వ బడ్జెట్ నుంచి కేటాయించిన నిధులే. హంగులు, ఆర్భాటాల పేరుతో భారీ అప్పులు చేసే ప్రయత్నానికి పోలేదు. సుమారు 17 వందల కోట్ల రూపాయల అప్పులు చేయగా, వాటిని 2025లో పూర్తిగా చెల్లించి, అప్పుల్లేని నగరంగా చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం ప్రకటించింది. ఇంకా మరికొన్ని రోడ్లు విస్తరణ పనులు సాగుతున్నాయి. నగరం పచ్చదనంతో పరిఢవిల్లిలా గ్రీనరీ నిర్వహణ ఉంది. పెద్ద పెద్ద కూడళ్లలో మినీ పార్కులను తలపించేలా ఏర్పాటు ఉంది. సెంట్రల్ పార్క్ కూడా సిద్ధమయ్యింది. నిర్వహణలో సిబ్బంది నిత్యం కనిపిస్తారు.

ప్రైవేట్ హోటల్స్, రిసార్ట్స్ సైతం
నవరాయ్‌పూర్ లో ప్రభుత్వం పలు ప్రైవేటు సంస్థలకు భూములు కేటాయించింది. కొన్ని సంస్థలు నిర్మాణాలు చేపట్టాయి. అందులో రిసార్ట్స్, గోల్ఫ్‌కోర్స్ వంటివి కూడా ఉన్నాయి. కానీ ఖరీదైన విల్లాలు కూడా నిర్మించిన తర్వాత బోసిపోయి కనిపిస్తున్నాయి. ప్రారంభానికి నోచుకోని స్థితిలో ఉన్నాయి. ఇంకొన్ని అర్థాంతరంగా ఆగిపోయాయి. గోల్ఫ్ కోర్స్ విల్లాలు సైతం 20 శాతం కూడా ఇప్పటి వరకూ అందుబాటులోకి తీసుకురాలేకపోయారు. కోట్లాది రూపాయల ఖరీదైన వాటిని కొనుగోలుచేసిన వాళ్ళు సైతం అటు మళ్లడం లేదు.
ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం సిద్ధమయ్యింది. ఇటీవల రెండు మ్యాచ్ లు కూడా నిర్వహించారు. స్టేడియం పరిసరాలు కూడా ఖాళీగా దర్శనమిస్తాయి. మ్యాచ్ జరిగే సందర్భాల్లో తప్ప మిగిలిన రోజుల్లో అటు చూసే వాళ్లే కరువు. ఇండోర్ స్టేడియం అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగించుకునే వాళ్ల సంఖ్య చాలా స్వల్పం.
ఇంకెన్నాళ్లు ఈ పరిస్థితి?
20 ఏళ్ల తర్వాత కూడా నవరాయ్‌పూర్ అటల్ నగర్ వైపు స్థానికులు మొగ్గు చూపడం లేదు. ఓవైపు రాయ్‌పూర్ జనాభా శివారు ప్రాంతాలతో కలిపి 20లక్షలకి చేరుకుంది. ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటోంది. అయినా గానీ కొత్త నగరం వైపు వెళ్లేందుకు జనం సిద్ధంకావడం లేదు. నవరాయ్‌పూర్ లో సైతం షాపింగ్ కాంప్లెక్స్ వంటివి నిర్మాణంలో ఉన్నాయి. కానీ జనం అటు మొగ్గుచూపకపోతే మల్టీఫ్లెక్స్ వంటివి రెడీ చేసినా ఏం చేయాలన్నది అంతుబట్టడం లేదని నిర్మాణదారులు చెప్పారు.
చత్తీస్‌ఘడ్ రాష్ట్ర కేంద్రంలో పనిచేసే మొత్తం ఉద్యోగుల సంఖ్య 7100 మంది. అన్ని శాఖలు అటు మళ్లినా రాజధాని కళ సంతరించుకోవడం కష్టమే. అందులోనూ వ్యాపారకేంద్రంగా ఉండే రాయ్‌పూర్ వ్యాపార, వాణిజ్య వర్గాలకు నవరాయ్‌పూర్ ఓ ఫామ్ హౌస్ కేంద్రంగా ఉందే తప్ప రెగ్యులర్ వ్యవహారాలకు సరిపోదనే అభిప్రాయం ఉంది.

ఇటీవల అక్కడి ప్రభుత్వం పలు ఐటీ సంస్థల కోసం ప్రయత్నిస్తోంది. స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తోంది. ఒకటి రెండు సంస్థలు వచ్చినప్పటికీ దాని ప్రభావం కూడా అంతంతమాత్రమే. ఇంకెన్నేళ్లు నవరాయ్‌పూర్ ఇలా ఉంటాన్నదే ఎవరికీ అంతుబట్టని వ్యవహారంలా మారింది.
అమరావతి కూడా అంతేనా..!
రైతుల నుంచి భూములు తీసుకున్నారు. వ్యవసాయ భూముల్లోనే నగర నిర్మాణానికి పూనుకున్నారు. అనేక ఆటంకాలతో పనులు నడుస్తున్నాయి. అమరావతిలో కూడా అటు గుంటూరు, ఇటు విజయవాడకు చేరువలో రాజధాని నిర్మాణం చేపట్టారు. దాంతో భవిష్యత్ లో ఎమ్మెల్యే క్వార్టర్స్, ఐఏఎస్ అధికారుల నివాసాలు వంటివి సిద్ధం చేసినా, ఎన్ని ఆధునిక భవనాలు సిద్ధం చేసినా, రోడ్లు ఎంత అద్భుతంగా తీర్చిదిద్దినా, వాటర్ ఫ్రంట్ వంటివి ఎన్ని సోయగాలు అద్దినా గానీ అక్కడ నివశించేదెవరూ అన్న ప్రశ్నకు రాయ్‌పూర్ అనుభవం ఆస్కారమిస్తోంది.
ఈ తరుణంలో అమరావతికి, నవరాయ్‌పూర్ కి పోలికలేంటి, భిన్నమైన పరిస్థితులేంటన్నది సమగ్రంగా తదుపరి కథనంలో చదవండి.
- శంకర్,
ఫౌండర్, ద న్యూస్ తెలుగు - ఫోటోలు: చరణ్ జవ్వాది
Wonderful Analasis… Great Hard work… Great effort…
అక్కడ ఖర్చు తక్కువే… కానీ ఇక్కడ లక్షల కోట్ల రూపాయలు అంటున్నారు… ఎన్ని తరాలు నష్టపోతారో….
అందులో రాజధాని అమరావతి పరిస్థితి కూడా ఇదే జరుగుతుంది ఏదైనా అభివృద్ధి చెందిన నగరాన్ని రాజధానిగా ప్రకటిస్తే బాగుంటుంది తప్పితే ఒక కొత్త భూభాగాన్ని రాజధానిగా తయారు చేయడం చాలా సవాళ్లు అక్కడి ప్రజలు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కొంటారని నవరాయపూర్ ఉదాంతం తెలుపుతూనే తెలుస్తుంది
కనువిప్పు కలిగించే సమాచారం