షర్మిల రాజకీయ సలహాదారుగా ఏబీఎన్ ఆర్కే..!జగన్ ఆస్తుల తగాదా ఇప్పట్లో చల్లారదా?
ఏబీఎన్ రాధాకృష్ణ ఆసక్తికర పాత్ర పోషిస్తున్నారు. కొంతకాలంగా ఆయన రెండు పడవల మీద కాలేశారు. ఓవైపు టీడీపీని ఉద్దరించడమే లక్ష్యంగా చేసుకున్న ఆయన అదే సమయంలో షర్మిలకు చేదోడుగా నిలవాలని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ కుమార్తె వైఎస్ షర్మిలను రాజకీయంగా ఎదగించేందుకు ఆర్కే తపన పడడమే ఆసక్తికరం.
ఏబీఎన్ రాధాకృష్ణకు వైఎస్సార్ అంటే అసలు గిట్టదు. ఆయన సీఎంగా ఉన్న సయమంలోనూ ఆంధ్రజ్యోతి రెచ్చిపోయింది. ఆరెండు పత్రికలూ అంటూ ఈనాడుతో కలిపి జ్యోతిని వైఎస్సార్ నిందించాల్సి వచ్చేది. అంతేగాకుండా వైఎస్సార్ సీఎంగా ఉండగా రాధాకృష్ణ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఏబీఎన్ చానెల్ కి లైసెన్స్ రాకుండా చానాళ్ల పాటు వైఎస్ అడ్డుపడ్డారు. చివరకు ఆయన మరణం తర్వాతనే ఏబీఎన్ కి మోక్షం కలిగింది.
అంతేగాకుండా ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన ఓ కథనం కారణంగా ఏకంగా ఎడిటర్ నే అరెస్ట్ చేయించేటంత వరకూ వ్యవహారం ముదిరింది. అప్పట్లోనే ఇరువురి మధ్య మాటల యుద్ధం సాగేది. ఆ తర్వాత అది జగన్ మీదకు మళ్లింది. జగన్ ని ఏబీఎన్ ఆర్కే చేసినంత మానసిక అత్యాచారం మరెవ్వరూ చేసి ఉండరనే చెప్పాలి. కానీ హఠాత్తుగా వైఎస్ షర్మిల మీద ఎందుకింత ప్రేమ అన్నది ఆసక్తికరం. వైఎస్ ను ఆయన తనయుడిని వెంటాడిన రాధాకృష్ణకు అదే కుటుంబానికి చెందిన కూతురి మీద అపారమైన అభిమానం ఉంచడానికి కారణం కూడా కీలకమైన వ్యవహారమే.
ఇదంతా వైఎస్ షర్మిల మీద అభిమానమో, ఆమెను రాజకీయంగా ఎదిగేందుకు తోడ్పడాలన్న తపనో కాదని కేవలం షర్మిలను అడ్డంపెట్టుకుని వైఎస్ జగన్ ను బద్నాం చేసే ప్రక్రియేనని అందరూ దాదాపుగా అంగీకరించే సత్యం. వైఎస్ ఇంట్లో విబేధాలను ఆసరగా చేసుకుని, వారి ఆస్తి గొడవలను మరింత రాజేయాలన్న లక్ష్యంతో రాధాకృష్ణ ఉన్నట్టు కనిపిస్తోంది. వారి మధ్య విబేధాలు ఎంతగా పెరిగితే తమకు అంత శ్రేయస్కరమన్న లక్ష్యం చంద్రబాబుతో పాటుగా రాధాకృష్ణలోనూ కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగా షర్మిల పక్షాన వకాల్తా పుచుకున్నట్టు స్పష్టమవుతోంది.
వైఎస్ జగన్, షర్మిల మధ్య ఉన్న ఆస్తి తగాదాలు వారి వ్యక్తిగతం. కానీ అందులో దూరి దానిని మరింత ఎగదోయాలన్న సంకల్పంతో టీడీపీ శిబిరం ఉందన్నది అందరికీ అర్థమవుతోంది. ఆర్కే అయితే మరో అడుగువేసి తానే షర్మిలకు సలహాదారుడిగా సాగుతున్నారు. రాజకీయ నిర్ణయాల నుంచి ఆస్తుల వివాదం వరకూ ఇప్పుడు ఏబీఎన్ ఆర్కే మాటను షర్మిల జవదాటడం లేదు. ఆయన ఆదేశాలను తూచా పాటిస్తూ ఇప్పటికే జగన్ కి చికాకు పుట్టిస్తోంది. చేయాల్సినంత నష్టం చేసింది. అయినా అది చాలదన్నట్టు మరికొంత కాలం పాటు జగన్ ను వేధించే ప్రయత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారు. సన్నిహితుల సూచనతో ఇటీవల పులివెందుల తమ కుటుంబీకుల ఇళ్లకు వెళ్లి మరీకలిశారు. షర్మిలకు నచ్చజెప్పి ఈ రాద్ధాంతం ముగించాలని ఆయన ఆశిస్తున్నారు. రాజకీయంగా తనకు డ్యామేజ్ చేసే ప్రక్రియకు ముగింపు పలకాలని ఆశిస్తున్నారు. కానీ షర్మిల, ఆమెకు దాదాపుగా సలహాదారుపాత్రలో ఉన్న ఏబీఎన్ ఆర్కేకి అది రుచించే అవకాశం లేదు. తమను ఇన్నాళ్లుగా వేధించిన జగన్ కి బుద్ధి చెప్పే వరకూ విశ్రమించకూడదని షర్మిల భావిస్తోంది. ఆ కుటుంబంలో విబేధాలు కొనసాగితేనే తమకు రాజకీయంగానూ ఉపయోగం ఉంటుందన్న అభిప్రాయంతో ఆర్కే ఉన్నారు. దాంతో జగన్, షర్మిల వ్యవహారం ఇప్పుడిప్పుడే ముగిసే అవకాశం సమీపదూరంలో కనిపించడం లేదు.