అమరావతి – నవారాయ్‌పూర్ రెండు నగరాల అనుకూల, ప్రతికూలతలేంటి?
ప్రపంచవ్యాప్తంగా గ్రీన్‌ఫీల్డ్ నగరాల అభివృద్ధి విషయంలో భిన్నమైన అనుభవాలున్నాయి. అభివృద్ధి విషయంలోనే భిన్న పాఠాలున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోనే చూస్తే విజయవాడ వంటి నగరాలను తోసిరాజని విశాఖపట్నం దూసుకుపోయిన తీరు అందుకు ఓ కొలమానం. దేశవ్యాప్తంగా గాంధీనగర్, నవా రాయ్‌పూర్ అనుభవాలున్న సమయంలోనే నోయిడా లాంటివి కూడా మనకి కనిపిస్తాయి. ఇలాంటి అనేక నగరాలను పరిశీలిస్తే అర్థమవుతున్న అంశం ఒక్కటే. ఉపాధి కల్పన, సామాన్యులకు నివాసయోగ్యంగా ఉండే ప్రాంతాలు మాత్రమే అభివృద్ది అయ్యాయి. మిగిలిన ప్రాజెక్టులన్నీ కునారిల్లిపోతున్నాయి.
హైదరాబాద్ కి తోడుగా సైబరాబాద్, ఇప్పటి ఏపీలో వైజాగ్ అభివృద్ధి వెనుక ఇండస్ట్రీస్ పాత్ర అత్యంత కీలకం. అది విస్మరించి ఎన్ని వాదనలు చేసినా ఒట్టి విన్యాసాలుగానే మిగులుతాయి. ఐటీ విస్తృతమవుతున్న దశలో హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేక వాతావరణం, భౌగోళిక పరిస్థితులు వంటివి అనుకూలాంశాలుగా కలిసివచ్చి సైబరాబాద్ వేగంగా విస్తరించింది. వైజాగ్ లో 1980 దశకం తర్వాత స్టీల్ ప్లాంట్ అందుబాటులోకి రావడం ఆ నగరాన్ని ఆమూలాగ్రం మార్చేసింది. ఇప్పుడు హైదరాబాద్, విశాఖ మహానగరాలుగా మారడంలో కీలకపాత్ర పోషించిన రెండు రకాల పెట్టుబడులు మన కళ్లెదురుగా కనిపిస్తున్నాయి. వాటికి అనుబంధంగా వచ్చిన పరిశ్రమలతో కళకళలాడుతున్న తీరు కొట్టొచ్చినట్టు చాటుతోంది. అందుకు తోడుగా అత్యంత సామాన్యులకు సైతం ఆయా నగరాలు నివాసయోగ్యత కల్పించాయి. అదే అభివృద్దికి ఆలవాలమయ్యింది.
ఇలాంటి పరిస్థితుల్లోనే నవా రాయ్‌పూర్, అమరావతి నగరాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. రెండు నగరాల మధ్య ఉన్న పోలికలను గమనించాల్సి ఉంటుంది. అభివృద్ధికి ఉన్న అవకాశాలు, అవరోధాలు అవగతం చేసుకోవాల్సి ఉంటుంది.

అమరావతికి అనుకూలతలు
నవా రాయ్‌పూర్‌తో పోలిస్తే అమరావతికి కొన్ని సానుకూలతలున్నాయి. అందులో ప్రధానమైనది రాష్ట్ర విభజన తర్వాత ఏడాది తిరిగే సరికే అమరావతి రాజధాని నగరంగా నిర్ణయించారు. ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ, మధ్యలో రాజకీయ కారణాలతో మూడు రాజధానుల ప్రతిపాదనలు వచ్చినప్పటికీ పాలనా కేంద్రంగా అమరావతి కొనసాగింది. తద్వారా రాష్ట్ర ప్రజలు మానసికంగా అమరావతిని రాజధానిగా పేర్కొనాల్సి వచ్చింది. అవసరం ఉన్నవారంతా అమరావతికే వస్తూ, పోతూ ఉన్నారు. 2017 నుంచే సచివాలయం, 2019 నాటికి ఏపీ హైకోర్ట్ తాత్కాలిక భవనాల్లోనయినా సిద్ధం కావడంతో అనివార్యంగా అమరావతి రాజధాని అనేది జనం మదిలో నిర్ధారణయ్యింది.
విజయవాడ, గుంటూరు పెద్ద నగరాల నుంచి నిత్యం అమరావతికి బస్ సదుపాయం ఉండడంతో రాకపోకలు సాగుతున్నాయి. రాష్ట్ర కేంద్రంలో అవసరం ఉన్న వారంతా అమరావతికి వెళ్లి రాక తప్పని పరిస్థితికి అలవాటుపడ్డారు.
కానీ నవా రాయ్‌పూర్ అందుకు పూర్తి విరుద్ధం. తొలుత పాలనా కేంద్రంగా రాయ్‌పూర్ నిర్ణయించారు. అక్కడి నుంచే పరిపాలన చేపట్టారు. అవసరాల రీత్యా ఆ తర్వాత నవా రాయ్‌పూర్ ప్రతిపాదన ముందుకొచ్చింది. దాంతో రాయ్‌పూర్ నుంచి కొత్త నగరం వైపు మళ్లడం అంత సులువుగా సాగడం లేదు. మానసికంగా అత్యధికులకు అది నేటికీ సాధ్యం కావడం లేదు. 20 ఏళ్ల తర్వాత కూడా ఆ నగరం పూర్తిరూపు సంతరించుకోవడం సాధ్యం కావడం లేదు. ఇప్పుడెలా ఉందన్నది ఈ సిరీస్ మొదటి భాగంలో ఉంది. చదవండి.https://teluguheadlines.com/impressive-infrastructure-is-one-thing-but-without-people-who-will-call-it-capital-city/
అమరావతి నగరానికి మరో అనుకూలాంశం భూములిచ్చిన రైతులు. నవా రాయ్‌పూర్ లో భూసేకరణ జరిగింది. దానివల్ల భూములు ప్రభుత్వం చేతుల్లోకి వచ్చాయి. దాంతో రైతులు నష్టపరిహారం అందుకుని భూమితో బంధాన్ని తెంచేసుకున్నారు. కానీ అమరావతిలో అలా కాదు. భూసమీకరణ కారణంగా రైతులు ప్రాజెక్టులో భాగస్వాములు. రాజధాని అభివృద్ధితోనే వాళ్ల ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయి. రాజధాని ప్రాజెక్ట్ విఫలమయితే ఏకంగా 29వేల మంది రైతులు కూడా ఏదో మేర నష్టపోక తప్పని పరిస్థితి ఉంటుంది.
అదే ప్రతికూలతగానూ మారుతోందా..
అమరావతికి భూములిచ్చిన రైతులందరికీ ప్రభుత్వం ఏటా కౌలు చెల్లించాల్సి వస్తోంది. రాజధాని ప్రాంత కూలీలకు పెన్షన్లు ఇస్తున్నారు. ఇది రెండోవైపు ప్రతికూలాంశంగానే తయారవుతోంది. ముఖ్యంగా ప్రాజెక్ట్ కి అదనపు భారం అవుతోంది. ఏటా సుమారుగా రూ. 350 కోట్లను చెల్లించాల్సి వస్తోంది. ఇప్పటికే కౌలు అందుకుంటున్న వారి సంఖ్యలో 2వేల మంది వరకూ తగ్గారు. అయినా 10ఏళ్ల కాలంలో ఇలా రైతులకు ఇవ్వాల్సి వచ్చిందే దాదాపు రూ. 3వేల కోట్లు దాటిపోయింది. రాజధాని ఫ్లాట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యే వరకూ చెల్లించాల్సి ఉంటుందని భావిస్తే మరికొన్నేళ్లు ఇలానే ఇస్తుంటే అది రూ. 5 నుంచి 6వేల కోట్లు దాటిపోయినా ఆశ్చర్యం లేదు.
అంటే మొత్తం నవా రాయ్‌పూర్ ప్రాజెక్ట్ కోసం 20 ఏళ్లలో ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తం రూ. 10వేల కోట్లు లోపుంటే అమరావతి రైతులకు చెల్లించే పరిహారం, కూలీల పెన్షన్ల భారం కలిపి అంతే మొత్తం చేరిపోయినా ఆశ్చర్యం లేదు. వాటికి తోడుగా రైతులను సింగపూర్ తీసుకెళ్లిన ఖర్చులు, భూములిచ్చిన వారి కోసం చేపట్టిన వివిధ కార్యక్రమాల ఖర్చు అంతా కలిపితే అమరావతి ప్రాజెక్ట్ వ్యయం ఏ స్థాయికి చేరుతుందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఓవైపు సానుకూల అంశంగా చూసినా భూసమీకరణ అమరావతికి పెనుభారంగా మారేందుకు కూడా కారణమవుతోందనే వాదన ఉంది.

నవా రాయ్‌పూర్ నగరంలో ఓ ప్రధాన రోడ్డు
నవా రాయ్‌పూర్ కి కలిసొచ్చిందదే..
చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కొత్త రాజధాని నిర్మించాలని భావించిన తర్వాత ఆడంబరాలకు పోకుండా వాస్తవానికి దగ్గరగా వ్యవహరించింది. అంతర్జాతీయ నగరం అంటూ హంగామా చేయకుండా తమ స్థాయికి తగ్గట్టుగా సాగింది. అందుకే 20వేల ఎకరాల్లో ప్రాజెక్ట్ చేపట్టింది. 2013 భూసేకరణ చట్టం రాకముందే భూములు తీసుకోవడం వల్ల ఆ ఖర్చు కూడా మొత్తం ప్రాజెక్టులో చిన్నభాగమే. 5వేల మంది రైతులకు ఆర్ అండ్ ఆర్ కోసం చేసిన ఖర్చు రూ.1500 కోట్లు సుమారుగా ఎన్ఆర్డీయే అధికారులు చెప్పారు.
ప్రాజెక్ట్ వ్యయం తక్కువ కావడం ఆ నగరానికి కలిసొచ్చే అంశం. పైగా మొత్తం ప్రాజెక్టులో చత్తీస్‌ఘడ్ ప్రభుత్వం కేవలం 15శాతం మాత్రమే అప్పులు చేసింది. మిగిలిన మొత్తాన్ని బడ్జెట్ నుంచి కేటాయించింది. కేంద్రం నుంచి నిధులుగా రాబట్టింది. ఆర్థిక సంఘాల నిధులు వినియోగించింది. దానివల్ల ప్రభుత్వానికి భారం లేకుండా ప్రాజెక్ట్ సాగింది. ఇటీవల ప్రభుత్వం ఆ రూ. 1700 కోట్ల బకాయిలు కూడా తీర్చేసి అప్పుల్లేని స్మార్ట్ సిటీగా పేర్కొనేందుకు అవకాశం దక్కించుకుంది.
గ్రీన్‌ఫీల్డ్ సిటీని కూడా చాలా తక్కువ ఖర్చుతో ప్లాన్డ్ గా చేసిన మూలంగా ఆర్థికభారం ప్రభుత్వానికి లేకుండా చేశారు. చత్తీస్‌ఘడ్ ప్రభుత్వాలు చూపిన ఈ చొరవ ప్రజలకు శాపంగా మారకుండా నిలువరించింది. ఏపీలో మాత్రం అందుకు పూర్తి విరుద్ధం. సొంత ఆదాయం కన్నా అప్పులే ప్రధానం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా భారం. భవిష్యత్తులో అప్పులకు వడ్డీలే పెద్ద సమస్యగా మారేందుకు ఆస్కారం కనిపిస్తోంది.
భూస్వభావం కూడా ఏపీకి సవాల్
అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి ఎంచుకున్న ప్రాంతం కూడా ఏపీకి సవాల్ గా తయారయ్యింది. నవా రాయ్‌పూర్ నేల స్వభావం రీత్యా నిర్మాణ వ్యయం తక్కువ. పైగా 15 ఏళ్ల నాడు నిర్మించిన రోడ్లు కూడా చెక్కు చెదరకుండా ఉన్నాయి. నిర్మాణం, నిర్వహణ వ్యయం తక్కువగా ఉండడంతోనే అద్భుత భవనాలను అతి తక్కువ ఖర్చుతో అక్కడి ప్రభుత్వం పూర్తి చేసింది. ప్రభుత్వ కార్యకలాపాలు, సీఎం, మంత్రులందరికీ అవసరమైన భవనాలను సిద్ధం చేసింది. మహానదికి చేరువలో నిర్మించినప్పటికీ వరదలు, ఇతర సమస్యలు లేని ప్రాంతాన్ని ఎంపిక చేసుకోవడం కలిసివచ్చిన అంశం.
ఏపీ అందుకు పూర్తి విరుద్ధం. అమరావతిలో నిర్మాణాల పటిష్టత కోసం పెద్దమొత్తం ఖర్చు చేయాల్సి ఉంటుంది. పైగా వరదల నివారణ కోసమే వేల కోట్లు ఖర్చు చేయక తప్పని పరిస్థితి వెంటాడుతోంది. దానివల్ల ప్రభుత్వానికి నిర్మాణాల వ్యయం తడిసిమోపెడవుతోంది. 2014లో రాజధానిగా నిర్ణయించిన తర్వాత పుష్కర కాలం గడిచిపోగా దాదాపు రూ. 21వేల కోట్లను వెచ్చించారు. కానీ ఇప్పటి వరకూ కేవలం ఒక్క సీఆర్డీయే భవనం మినహా ఒక్క శాశ్వత భవనం కూడా సిద్ధం చేసుకోలేని స్థితి ఉంది. అంటే నవా రాయ్‌పూర్ మొత్తం నగర నిర్మాణానికి చేసిన ఖర్చు కన్నా రెట్టింపు వెచ్చించినా ఇంకా అతీగతీ లేదు. భవిష్యత్ లో ఆయా భవనాలు, వరద నిర్వహణ కోసం కూడా చాలా పెద్ద మొత్తం భరించక తప్పని పరిస్థితి ఉంటుంది.
రాజకీయ విబేధాలు..
చత్తీస్‌ఘడ్ లో నవా రాయ్‌పూర్ నగర నిర్మాణ ప్రతిపాదన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అన్ని పక్షాలతో చర్చించి నిర్ణయించింది. ఆ తర్వాత బీజేపీ ప్రభుత్వం దానిని కొనసాగించింది. ప్రభుత్వాలు మారినప్పటికీ రాజకీయ విబేధాలకు తావులేకుండా వ్యవహరించారు. కొందరు ముఖ్యమంత్రులు ఎక్కువ ప్రాధాన్యతనివ్వడం, ప్రాజెక్ట్ ను వేగంగా కదిలించడం వంటివి చేశారే తప్ప మొత్తం ప్రాజెక్ట్ నిలుపదల చేసిన దాఖలాలు లేవు. ఇలాంటి రాజకీయ విధానపరమైన ఐక్యత, సమిష్టితత్వం నయా రాయ్‌పూర్ కి అడ్వాంటేజ్.
అమరావతిలో అదో అతి పెద్ద సమస్య. అమరావతి అంశాన్ని ఆఖరి వరకూ గోప్యంగా ఉంచి, ఏకపక్షంగా నిర్ణయించిన తీరు మీద తీవ్ర విమర్శలున్నాయి. రాజధానికి సంబందించి పలు కమిటీల రిపోర్టులను కూడా ఖాతరుచేయలేదన్న వాదనలున్నాయి. ఇలాంటి స్థితిలో ప్రధాన పక్షాల మధ్య సఖ్యత లేదు. రాజకీయ పార్టీల విధానాల్లో కూడా స్పష్టత లేదు. అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి వైఎస్సార్సీపీ, జనసేన వంటి పార్టీలు భిన్నమైన వాదనలు వినిపించిన చరిత్ర ఉంది. ఇది అమరావతికి ప్రధాన అవరోధం. ప్రాజెక్ట్ ముందుకు సాగడమే ప్రశ్నార్థకంగా మార్చేసిన అనుభవం కూడా ఉంది. రాష్ట్రస్థాయిలోనే కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా రాజధాని రాష్ట్రాల పరిధిలో అంశమంటూ కోర్టుల ముందు అఫిడవిట్లు సమర్పించి, ఆ తర్వాత చట్ట సవరణ ద్వారా రాజధానిగా గుర్తించేటంత వరకూ వెళ్లిన వైనం రాజకీయ అవకాశవాదాన్ని చాటుతోంది. ఇలా ప్రధాన పార్టీల విధానాలు అమరావతి వంటి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు పెద్ద శాపంగా చెప్పాల్సి ఉంటుంది.
ఉపాధి మార్గాలు కానరావడం లేదు
తొలుత చెప్పుకున్నట్టుగా నగరాభివృద్ధిలో కీలకం ఉపాధి అవకాశాలు. చైనాలో కొత్త గ్రీన్‌ఫీల్డ్ సిటీలు అభివృద్ధి కావడం బర్మా వంటి దేశాల్లో ఘోస్ట్ సిటీలుగా మిగిలిపోవడం అన్నింటికీ మూలం ఉపాధి. అందుకు తగ్గట్టుగా పరిశ్రమల ఏర్పాటు. వర్తమానంలో తయారీరంగం మీద శ్రద్ధలేని ప్రభుత్వాలు సర్వీస్ రంగం చుట్టూ ప్రదిక్షణలు చేస్తున్నాయి. అలాంటి సమయంలో ఐటీ వంటివి అభివృద్ధి కావడం కీలకం. కానీ అటు నవా రాయ్‌పూర్ గానీ ఇటు అమరావతి గానీ ఐటీకి ఎంతమేరకు అనుకూలం అనేది ప్రశ్న. 20 ఏళ్లలో నవా రాయ్‌పూర్ కి వచ్చిన ఐటీ సెక్టార్ ఇండస్ట్రీస్ అంతంతే. అమరావతి వైపు మొగ్గుచూపే సంస్థలయితే ఇప్పటి వరకూ కానరావడం లేదు. మరి కొత్తగా పరిశ్రమలు లేక, ఐటీ వంటివి అగుపించక ఇక నగరాభివృద్ధి ఎలా సాధ్యం.
ప్రభుత్వ కార్యాలయాలు సిద్ధం చేసి, విశాల రోడ్లు నిర్మించి, రైతాంగానికి ఫ్లాట్లు అభివృద్ధి చేసి రియల్ ఎస్టేట్ ద్వారా రాజధాని రూపాన్ని అందుకోవచ్చని అశించడం సాధ్యమేనా. నవా రాయ్‌పూర్ లానే అమరావతిలో కూడా సాయంత్రం కాగానే బోసిగా దర్శనమిచ్చే సెక్రటేరియేట్, సెలవురోజుల్లో బిక్కుబిక్కుమంటూ ఉండే హైకోర్ట్ ప్రాంగణం వంటివి చెబుతున్న వాస్తవం ప్రకారం ఉద్యోగులంతా విజయవాడ, గుంటూరు కి రాకపోకలు సాగించే పనిలో ఉన్నారు. 30 నిమిషాల్లో ఇంటికి చేరకునే అవకాశం ఉండగా ఇక అమరావతి ప్రాంతంలో కొత్తగా నిర్మాణాలు చేసి, నివశించాలని కోరుకునే వారెవరుంటారనే ప్రశ్న కూడా ఉంది.

రియల్ ఎస్టేట్ ద్వారా రాబడి సాధ్యమేనా?
సెల్ఫ్‌సస్టెయిన్డ్ అంటూ అమరావతి గురించి చేస్తున్న ప్రచారం ఆచరణ సాధ్యమేనా అనేది అసలైన ప్రశ్న. అమరావతిలో ప్రస్తుతం ఎకరా రూ. 50లక్షలకి, కోటి రూపాయలకి వివిధ సంస్థలకు ఇచ్చారు. ఇప్పటి వరకూ భూములు దక్కించుకున్న వాటిలో విద్యాసంస్థలు, హోటల్స్, కొన్ని వైద్యసంస్థలు, ఒకటి రెండు క్రీడా సంస్థలున్నాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటికి తోడు. అవి పూర్తి కావాలన్నా ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో ఉన్న మొత్తం జనాభా 1.5 లక్షలకు మించదు. ఎమ్మెల్యే క్వార్టర్స్, ప్రభుత్వ సిబ్బంది భవనాలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా జనాభా పెరిగే అవకాశాలు నామమాత్రం. విల్లాలు, ఫ్లాట్లు దక్కించుకున్న వాళ్లలో అక్కడే స్థిరంగా ఉండేదెంత మందనే సందేహాలు సైతం వెంటాడుతున్నాయి.
అలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తన దగ్గర మిగిలిన దాదాపు 4-5వేల ఎకరాల భూమి అమ్మాలంటే కొనేదెవరు, అంత పెద్ద మొత్తంలో కొనాలంటే ఇక పరిశ్రమలు పెట్టేదెవరు, రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తే ఆ భూమి ఎంతకు అమ్మాలనే ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇవన్నీ దీర్ఘకాలం పాటు వెంటాడే అంశాలు. నవా రాయ్‌పూర్ లో ప్రభుత్వమే చత్తీస్‌ఘడ్ హౌసింగ్ బోర్డ్ ద్వారా నివాసాలకు అనుకూలంగా ఫ్లాట్లు , విల్లాలు సిద్ధం చేసింది. అయినా కొనేవాళ్లే లేరు. మరి ప్రైవేటు వెంచర్ల ద్వారా అమరావతి ప్రాంతంలో రియల్ ఎస్టేట్ సాగడం సాధ్యమేనా అన్నది కీలకాంశం.
సామాన్య ప్రజలకు అమరావతిలో నివాసించే అవకాశం దక్కేనా అనేది ప్రశ్న. చంద్రబాబు ప్రభుత్వ ప్రతిపాదించినట్టు నవ నగరాలు నిర్మించే ప్రయత్నమే గానీ అందులో ఎక్కడా మధ్య తరగతికి నివాసాలకు కూడా వీలు కల్పించడం లేదు. నవా రాయ్‌పూర్ మాదిరిగా హౌసింగ్ బోర్డ్ నిర్మాణ ప్రతిపాదనలు కూడా లేవు. దాంతో భవిష్యత్ లో అంత భారీ ప్రాజెక్టుకి బయటి నుంచి వ్యక్తులు వచ్చి, జీవించే వెసులుబాటు లేకుండా మనుగడ ఎలా అన్నది కూడా ముఖ్యమైన ప్రశ్నగా ఉంది.

శంకర్
ఫౌండర్, ద న్యూస్ తెలుగు