ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్! చంద్రబాబు మళ్లీ వెనక్కి మళ్లుతున్నారా?
చంద్రబాబు పదే పదే టెక్నాలజీకి సంబంధించిన పదాలతో ప్రజలను ఆకట్టుకోవాలని చూడడం ఆశ్చర్యం ఏమీ కాదు. దశాబ్దాలుగా ఆయన పాలనా విధానంలో పెద్దగా మార్పు ఉండదు. కానీ ఆనాటికి టెక్ ఇండస్ట్రీలో మాట్లాడుకునే మాటలను ఆయన ఉపయోగిస్తూ ఉంటారు. అందరికీ గుర్తుండే ఉంటుంది..2019 కి పూర్వం ఆయన పదే పదే లాజిస్టిక్స్ హబ్ అంటూ చెప్పుకొచ్చేవారు. విశాఖను లాజిస్టిక్స్ హబ్ గా చేస్తానని కూడా ఆయన అన్నారు. మరి ఇప్పుడెందుకు ఆయన మాట మరచిపోయారు. ఇప్పుడెందుకు డీప్ టెక్ లాంటి పదాలను వాడుతున్నాంటే..ఆయనంతే మాటల్లో అప్ డేట్ అయిపోతూ ఉంటారు.
ఆ క్రమంలోనే ఏపీలో వాట్సాప్ గవర్నెన్స్ అంటూ చెప్పుకొస్తున్నారు. మెటా సంస్థతో ఎంవోయూ కూడా కుదుర్చుకున్నారు. 2024 అక్టోబర్ 2నే ఈ ఎంవోయూ అయ్యింది. పౌరుల సేవలన్నీ వాట్సాప్ లో అందించబోతున్నట్టు కలెక్టర్ల భేటీలో కూడా చెబుతున్నారు. ఇక రైతులకు అందించే వ్యవసాయ సమాచారం నుంచి టూరిజం వరకూ సర్వత్రా సమాచారమంతా వాట్సాప్ ద్వారానే అందిస్తారట. పన్నుల వసూళ్లు నుంచి ప్రజల సేవలు కూడా వాట్సాప్ లో అందిస్తారట. వాట్సాప్ ద్వారా ఏపీ ప్రభుత్వ సేవలు అందించేందుకు ఎంత చెల్లిస్తున్నారన్నది ఇప్పటి వరకూ అధికారికంగా వెల్లడించలేదు.
డేటా మెటా చేతుల్లో
అదే సమయంలో ప్రజలకు వివిధ కార్యాలయాల ద్వారా అందిస్తున్న సేవలను నేరుగా ఆన్ లైన్లో వాట్సాప్ ద్వారా అందించడం ఎంత శ్రేయస్కరం అన్నది ఓ ప్రధానాంశం. ప్రభుత్వానికి సంబంధించిన సకల సమాచారం వాట్సాప్ ద్వారా అందిస్తుంటే మెటా చేతుల్లో మెత్తం డేటా పెడుతున్నట్టే కదా. అంటే డేటా అత్యంత విలువైనదంటూ సీఎం చెబుతారు. అదే డేటాను ప్రైవేటు సంస్థల్లో పెడుతున్నట్టు అంగీకరిస్తారు. గవర్నమెంట్ స్కీముల నుంచి సేవల వరకూ సకలం వాట్సాప్ ద్వారానే అంటే అంతా తీసుకెళ్లి మెటా చేతుల్లో పెడుతున్నట్టే. 5 కోట్ల మంది మందికి సంబంధించిన వివరాలను మెటాకి అప్పగించడం ఎంత వరకూ సురక్షితం అన్నది ప్రభుత్వం ఆలోచించిందా అన్నది కీలకం.
అదే సమయంలో సేవలన్నీ అందిస్తున్న మెటా కి ప్రభుత్వం అందించేదెంత, ప్రజలు చెల్లించాల్సినదెంత అనేది కూడా ఓ ప్రశ్న. ఇప్పటికే అనేక సేవలకు యూజర్ ఛార్జీలున్నాయి. దానికి తోడుగా ప్రస్తుతం ప్రభుత్వం ప్రతీది పీపీపీ మోడల్ అంటోంది. దాంతో ఇక పౌరసేవలు కూడా పీపీపీ పద్ధతిలో వాట్సాప్ చేస్తే ప్రజలు కట్టాల్సిన మొత్తం ఎంత అనేది కూడా అత్యంత ముఖ్యం. క్రమంగా ప్రజలకు వాట్సాప్ ద్వారా సర్టిఫికెట్లు, ఇతర విషయాల అందించే అలవాటు చేసిన తర్వాత ఎంత మొత్తమయినా భరించాల్సిందేనన్నది ఇప్పటికే అలవాటు చేసిన అంశాలను బట్టి అర్థమవుతుంది. అది ప్రజలకు భారమయినప్పటికీ ప్రభుత్వాలకు పడుతున్న దాఖలాలు లేవు.
వాటికి తోడుగా సేవలను వాట్సాప్ అందిస్తే ఇక ప్రభుత్వం సిబ్బంది పాత్ర ఏమిటనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. 2003కి పూర్వమే ప్రభుత్వ ఉద్యోగుల మీద తన అసహనం చాటుకుని, మనసులో మాట ద్వారా ప్రభుత్వంలో సిబ్బంది సంఖ్య తగ్గించాలని ప్రతిపాదించిన చంద్రబాబు ఇక ఉద్యోగాలకు కూడా కోత పెట్టడం అనివార్యం అవుతుంది. అందులో ప్రధానంగా సచివాలయ సిబ్బంది మీద ఇప్పటికే పని ఒత్తిడి పెంచి పొమ్మనలేక పొగబెడుతున్న తరుణంలో వారందించే సేవలను వాట్సాప్ కి అప్పగించే ప్రయత్నంలో ఉన్నారా అన్న సందేహాలు రాక మానవు.
సొంతంగా యాప్ ఎందుకు
పౌరుల డేటా కి భద్రత లేదు. అవి ఎటు మళ్లుతాయో ఎవరికీ ఎరుకలేదు. అదే సమయంలో సేవలకు చెల్లించాల్సిన మొత్తం కూడా జనాలకు భారమయ్యే ప్రమాదం ఉంది. దానికి తోడు ప్రభుత్వ వ్యవహారాలు విదేశీ సంస్థకు అప్పగించడం వల్ల అనేక సమస్యలకు ఆస్కారమిచ్చినట్టవుతుంది. అలాంటి సమయంలో ఏపీలో పౌరులందరికీ సేవల కోసం ప్రభుత్వమే ఓ యాప్ రూపొందించి దానిని తప్పనిసరి చేయడం శ్రేయస్కరం కదా.
ఇప్పటికే దిశ యాప్ సహా వివిధ యాప్ లను ప్రజలందరి ఫోన్లలో ఎలా ఇన్ట్సాల్ చేయించారో మనందరికీ తెలుసు. కాబట్టి పౌరులందరికీ సార్వత్రిక వినియోగం అంటూ ఓ యాప్ ప్రభుత్వమే రూపొందించి, దాని నిర్వహణను ప్రభుత్వమే చూస్తూ ప్రజలకు సేవలందించడం కన్నా మెరుగైన విధానం ఏముంటుంది.ఇప్పుడు ప్రజాధనం మెటాకు చెల్లించాల్సిన అవసరం ఏమొచ్చింది. దాని వెనుక అసలు లక్ష్యాలేంటి. డేటా లీకయితే కలిగే నష్టమెంత. ఇలాంటి ముందుచూపు లేకుండా టెక్నాలజీ తనకు కొట్టిన పిండిగా చెప్పుకునే సీఎం ముందుకెళుతున్న తీరు ఆశ్చర్యంగా ఉంది.
రాజకీయ లక్ష్యమేనా
వాస్తవానికి వాట్సాప్ ఆధారంగా ప్రజలందరితో కాంట్రాక్ట్ పెట్టుకోవడం అత్యంత సులువు. అలాంటి వాట్సాప్ ఆధారంగా చేసుకునే 2019లో నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఓటర్లను ప్రసన్నం చేసుకోగలిగారు. 2014లో ఫేస్ బుక్ ను, 2019లో వాట్సాప్ ను సమర్థవంతంగా వినియోగించుకున్న బీజేపీ 2024లో యూట్యూబ్ ప్రభావం కారణంగా కొంత దెబ్బతిందన్నది గమనించాల్సిన అంశం. అలాంటి అనుభవాలు ఎదురుగా ఉండగా రాజకీయ అవసరాల నిమిత్తం ఇప్పుడు మెటాతో ఒప్పందం చేసుకుని 2019లో మోడీ మాదిరిగా వచ్చే ఎన్నికల్లో తాను ప్రజలందరికీ చేరువ కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారా అన్న ప్రశ్న కూడా ఉదయిస్తుంది.
అదే జరిగితే చంద్రబాబు విజన్ 2047 అంటూ ఆయన అడుగులు మాత్రం ఇంకా 2019లోనే ఉన్నాయోమోనని అనుమానించాల్సి ఉంటుంది. ఆయన మాటల్లో టెక్నాలజీ గురించి చెబుతూ చేతలు మాత్రం సంప్రదాయ రాజకీయాలకే పరిమితమని భావించాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల నాటికి డిజిటల్ వేదికల్లో ఎక్స్ లాంటి పలు సంస్థలు ప్రభావితం చేయబోతున్నాయనడం నిస్సందేహం. ఇన్ట్సాగ్రామ్ వంటివి కూడా జెన్ జెడ్ ను ఆకట్టుకున్న తరుణంలో అది కూడా కీలకం కాబోతోంది. అలాంటి దశలో చంద్రబాబు ఎప్పుడో మోదీకి ఉపయోగపడిన వాట్సాప్ సహాయంతో ప్రజలను ఆకట్టుకోవాలని ఆశిస్తే అది కాలం చెల్లిన ఆయుధం అవుతుందనడంలో సందేహం లేదు. అయినా చంద్రబాబు అటే అడుగులు వేస్తున్న తరుణంలో ఆయన రాజకీయ అవసరాలు ఎలా ఉన్నప్పటికీ ప్రజలు, ఏపీ అవసరాల నిమిత్తం అలాంటి యాప్స్ అంత ప్రయోజనం కాదని జనం చెప్పాల్సి ఉంటుంది.