ఆడబిడ్డల భద్రతే మొదటి ప్రాధాన్యం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం కొలువు తీరి కేవలం నాలుగైదు మాసాలే అయింది. ఈ సమయంలోనే ఏదో జరిగిపోయినట్లు వైసీపీ నాయకులు,వారి మద్దతుదారులు సోషల్ మీడియాలో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారం చేసే వారిని ఇకపై ఉపేక్షించేది లేదని ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు, మద్దతుదారులు ఘోరమైన ఓటమి తర్వాత కూడా సోషల్ మీడియాలో మహిళలపై ఇష్టానుసారం మాట్లాడుతూ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారన్నారు. మహిళలపై ఎవరు అసభ్య దూషణలు చేసినా ఊరుకొనేది లేదని, అలాంటి వారి సోషల్ మీడియా హ్యాండిల్స్ పై నిఘా ఉంటుందని హెచ్చరించారు.శుక్రవారం ఏలూరు జిల్లా, గోపాలపురం నియోజకవర్గం, ద్వారకా తిరుమల మడలం, ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో దీపం -2 పథకంలో భాగంగా ఏడాదికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసే కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. లబ్ధిదారులైన మహిళలకు గ్యాస్ సిలిండర్లను పవన్ కళ్యాణ్ స్వయంగా అందజేశారు. ఉచిత సిలిండర్లు తీసుకెళ్తున్న ఆటోకు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ “ఆడపిల్లల భద్రతకు కూటమి ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తుందని హామి ఇచ్చారు. ఇంట్లోకి వచ్చి ఆడపిల్లలపై అత్యాచారం చేస్తాం.. దాడులు చేస్తాం.. కిడ్నాప్ చేస్తాం అంటూ మాట్లాడే వారు ఎవరినైనా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. మహిళలపై ఇష్టానుసారం మాట్లాడే వారికి ప్రస్తుతం ఉన్న చట్టాల్లోని శిక్షలు సరిపోవనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు. గత ప్రభుత్వం కంటే సంక్షేమాన్ని అత్యుత్తమంగా అందిస్తామని హామీ ఇచ్చినట్లుగానే ముందుకు వెళ్తున్నాం. రాష్ట్ర ప్రజలకు మేలు చేసేందుకు దీపం-2 పథకం ఓ ముందడుగు అని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1,08,39,286 మంది అర్హులైన లబ్ధిదారులకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నాం. దీనికోసం ఏడాదికి రూ.2,684 కోట్లు వ్యయం అవుతుంది. అయిదేళ్లకు రూ.13,425 కోట్ల వ్యయాన్ని ప్రభుత్వం భరిస్తూ ప్రజలకు మెరుగైన సంక్షేమాన్ని అందిస్తున్నాం అని వెల్లడించారు.

మంచి ప్రభుత్వమే… మెతక ప్రభుత్వం కాదు

వైసీపీ నాయకులను ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వారి నోళ్లు ఆగడం లేదు. వారికి అవి కూడా రాకుండా భవిష్యత్తులో చేస్తే తప్ప వారు మళ్లీ మారరు. నన్ను విమర్శించే వాళ్లకు నేను చెప్పేది ఒక్కటే. నేను త్రికరణ శుద్ధిగా ప్రజల కోసం పని చేస్తున్నాను. నన్ను ఏ కారణం లేకుండా తిట్టేవారికి, నన్ను అకారణంగా నోటికొచ్చినట్లు విమర్శించే వారికి చెప్పేదొక్కటే. స్వామి వారి మీద ఆన… నేను మిమ్మల్ని చూసుకుంటాను. నాకు సద్విమర్శలు అంటే ఇష్టం. ఓ వ్యక్తి మీద చేసే విమర్శ – హుందాగా స్వీకరించేంత గొప్పగా ఉండాలి. కానీ వైసీపీ నాయకులు మాత్రం నోటికి ఎంత మాటొస్తే అంత మాట మాట్లాడుతున్నారు. మాది మంచి ప్రభుత్వం కానీ మెతక ప్రభుత్వం కాదు.. ఎక్కువతక్కువ మాట్లాడితే తొక్కి పట్టి నార తీస్తాం జాగ్రత్త అని హెచ్చరించారు. నేను ముందుగా చెప్పినట్లుగా మీకు యుద్ధం కావాలంటే యుద్ధమే ఇస్తాం.. గొడవ కావాలంటే గొడవే ఇస్తాం. అయితే ఆ గొడవ అభివృద్ధికి ముందడుగు కావాలి.. ఆ యుద్ధం రాష్ట్ర క్షేమం కోసం కావాలన్నదే నా అభిమతం అని అన్నారు.

త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్

ఆడబిడ్డలపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఆడబిడ్డల మీద దారుణాలపై వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియాలో ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. సాంకేతికత పెరుగుతోంది కానీ… దానికి తగినట్లుగా సోషల్ మీడియాను ఉపయోగించుకొని తప్పులు చేస్తున్న వారికి తగిన శిక్షలు పెరగాలి. త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ రాబోతోంది. అయితే దానికంటే ముందే తగిన కఠిన శిక్షలు పడాలన్నది నా ఆకాంక్ష. ఎవరు తప్పు చేసినా ఊరుకోవద్దు. ప్రతి నేరం రికార్డు అవ్వాలి. అలాంటి వారికి తగిన శిక్ష పడాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశం. అలాకాదు.. తప్పు చేసినా మా వాళ్లను ఏ అనకూడదు అని వైసీపీ వాళ్లు పోరాటాలు చేస్తాం.. చట్టం నుంచి మీరు తప్పించుకోలేరు. మేం ఆడబిడ్డల రక్షణ కోసం బలంగా నిలబడతాం. కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు వైయస్ షర్మిల రక్షణ కోరుతున్నారు. ఓ మహిళగా, ఓ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలిగా ఆమెకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు. ఆమె తన భద్రతపై ప్రభుత్వానికి తగిన అర్జి పెట్టుకుంటే, దానికి అనుగుణంగా ఆమె రక్షణను కల్పించే బాధ్యతను తీసుకుంటాం అని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, చిర్రి బాలరాజు, బొమ్మిడి నాయకర్, పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్ తోట సుధీర్, పౌర సరఫరా సంస్థ ఎండీ మంజీర్ జిలానీ సమన్, పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, జడ్పీ ఛైర్మన్ శ్రీమతి ఘంటా పద్మశ్రీ, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్, జేసీ శ్రీమతి ధాత్రిరెడ్డి, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *