నితీశ్ కెరీర్ కి మీడియా హైప్ ముప్పుగా మారుతుందా?
టీమిండియా ఆటగాళ్ళను ఆకాశానికి ఎత్తడం, అంతలోనే పతనానికి పడేయడం చాలా సహజం. ఒక్క మ్యాచ్ లో లేదా ఒక సిరీస్ లో రాణించగానే అంతా, ఇంతా అంటూ కొనియాడడం, అంతలోనే కొన్ని ఫెయిల్యూర్స్ కి తీవ్రంగా నిందించడం అనేది అభిమానులకే కాదు మీడియాకు కూడా అలవాటు. తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఉదంతం చూస్తుంటే ఇలాంటి అనుమానాలు వస్తున్నాయి. మెల్బోర్న్ లో అద్భుతంగా రాణించిన ఆటగాడి పట్ల మీడియా స్పందించిన తీరు అతిగా ఉందనే వాదన వినిపిస్తోంది.
ఈ మీడియా ఎవరినైతే ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటుందో వాళ్లంతా కొద్దికాలానికే జట్టులో స్థానం కోసమే అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి ఉంటుంది. దానికి అనేక ఉదాహరణలున్నాయి. ఇటీవల కాలంలోనే ఇషాన్ కిషన్, శుభ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ వంటి వారు తిరుగులేని ఉదాహరణలు.
శుభ్ మన్ గిల్ కి మీడియా ఇచ్చినంత ప్రాధాన్యత దాదాపుగా ఇటీవల ఎవరికీ దక్కలేదు. పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. ఓ మూడు సెంచరీలు చేయగానే ప్రిన్స్ అంటూ బిరుదులు తగిలించి కొనియాడిన సందర్భాలు అనేకం. అంతేగాకుండా కాబోయే టీమిండియా కెప్టెన్ అంటూ ఆకాశానికెత్తేసిన సందర్భాలు అనేకం. అలాంటి గిల్ ఇప్పుడు జట్టులో చోటు కోసం అవస్థలు పడుతున్నాడు. ప్రస్తుతం స్టాండ్స్ కే పరిమితమయ్యాడు. జట్టులో చోటు దక్కించుకోవడం ఓ భాగమైతే, దానిని నిలబెట్టుకోవడం ఎంత కష్టమన్నది గిల్ అనుభవం చాటుతోంది.
అతడికి ముందు ఇషాన్ కిషన్ కూడా ఇదే తరహాలో. వన్డేలో డబుల్ సెంచరీ చేయగానే జూనియర్ సెహ్వాగ్ అంటూ కొనియాడిన సందర్భాలున్నాయి. ఇంకేముంది ఇషాన్ జమానా అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. చివరకు ఇప్పుడు ఒకటి రెండు సిరీస్ లలో వెలిగిపోయిన తర్వాత జట్టులో ఏ ఫార్మేట్ లోనూ చోటు దక్కని స్థితికి చేరింది. ఏకంగా ఐపీఎల్ లో కూడా సొంత ఫ్రాంచైజీ సైతం కాదు పొమ్మని చెప్పడంతో ఆఖరికి సన్ రైజర్స్ కి సొంతమయ్యాడు.
నాన్ ముంబైకర్లు మాత్రమే కాకుండా ముంబై పెద్దల అండదండలు పుష్కలంగా ఉన్న శ్రేయస్ అయ్యర్ చరిత్ర కూడా అంతే. వరల్డ్ నెంబర్ ఒన్ క్లాస్ ప్లేయర్, ద్రావిడ్ సచిన్ లక్ష్మణ్ ముగ్గురూ కలిస్తే ఒక అయ్యర్ అని అప్పట్లో కథనాలు. ఆఖరికి ఇప్పుడు అయ్యర్ ఏమయ్యాడో వెదుక్కోవాల్సి వస్తోంది. అటు పొట్టి ఫార్మేట్, ఇటు టెస్టుల్లో కూడా చోటు దక్కడం ఇక గగనమే అన్నట్టుగా మారింది. అదే సమయంలో వన్డేలలోనయినా అవకాశం వస్తుందా లేదా అన్నది సైతం సందేహమే.
యువ ఆటగాళ్లు మీడియా హైప్ చూసి భ్రమల్లో పడుతున్న తీరుని ఇది చాటుతోంది. ఇలాంటి ఆటగాళ్లంతా స్వల్పకాల మెరుపులకే పరిమితమవుతున్నట్టు కనిపిస్తోంది. దీర్ఘకాలం స్థిరంగా రాణించేదానికి బదులుగా, అరకొర విజయాలకు సంతృప్తి పడే దశకు చేరుతున్నట్టు స్పష్టమవుతోంది.
తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఉదంతం కూడా అదే పరంపరలో చేరడానికి అవకాశం ఉంది. ఇప్పటికే కపిల్ దేవ్ తో పోల్చే దానికి ప్రయత్నిస్తున్నారు కొందరు. అంతకుమించి మోత కనిపిస్తోంది. 8వ స్థానంలో వచ్చి రాణించడం ఆషామాషీ కాదు. అందులోనూ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు గట్టెక్కించడం చిన్న విషయం కాదు. కానీ ఓ సిరీస్, ఓ మ్యాచ్ విజయాలను పరిగణలోకి తీసుకుని ఆటగాడి మీద పూర్తి అంచనాకు రావడం సరైనది కాదనడానికి పైన ఉన్న ఉదాహరణలు ఓ సాక్ష్యం. వారి నుంచి పాఠాలు నేర్చుకుంటేనే నితీశ్ దీర్ఘకాలం నిలబడే అవకాశం ఉంటుందన్నది వాస్తవం.
నితీశ్ కుమార్ ఇప్పుడే తన కెరీర్ లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. చుట్టూ వినిపిస్తున్న పొగడ్తలు, ఎంసీజీలో లభించిన స్టాండింగ్ ఒవేషన్లకు ఒంగిపోకుండా నిలదొక్కుకునే ప్రయత్నం చేయాలి. చేసింది గోరింత అని గుర్తెరగాలి. చేయాల్సింది కొండంత ఉందన్నది గ్రహించాలి. మంచి క్రికెటర్ గా ఎదిగేందుకు ఇంకా అనేక మైళ్ల ప్రయాణానికి సిద్ధం కావాలి. లేదంటే తన చుట్టూ ఉన్న అనేక మంది యువ ఆటగాళ్ల మాదిరిగానే అయిపోయే ముప్పు ఉంటుంది. జరభద్రం బిడ్డా