R Ashwin: టీమిండియా స్టార్ స్పిన్నర్ ఇక సెలవు చెప్పేశాడు!
టీమిండియా స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన కెరీర్ కి గుడ్ బై చెప్పేశాడు. ఊహించినట్టుగా ఈసిరీస్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని భావిస్తే అందుకు భిన్నంగా మూడో టెస్ట్ ముగియగానే తన నిర్ణయాన్ని అశ్విన్ ప్రకటించాడు. బ్రిస్టేన్ టెస్ట్ తర్వాత అశ్విన్ రిటైర్ ప్రకటించడంతో టీమిండియాలో ఓ శకం ముగిసినట్టుగా భావించాలి.
గతంలో ధోనీ కూడా ఇదే రీతిలో సిరీస్ మధ్యలో తన రిటైర్మెంట్ ప్రకటించిన అనుభవం ఉంది. ఆసీస్ గడ్డ మీద బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మిగిలిన రెండు మ్యాచ్ ల అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు ప్రచారం సాగుతోంది. అశ్విన్ , రోహిత్ కి తోడుగా మరో ఒకరిద్దరు కూడా అదే బాట పట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
అశ్విన్ 1986, సెప్టెంబర్ 17న తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. ఇటీవల ఐపీఎల్ మెగా ఆక్షన్ లో సీఎస్కే జట్టు అతన్ని సొంతం చేసుకుంది. వచ్చే సీజన్ లో ఎల్లో ఆర్మీలో కనిపించబోతున్నాడు. అశ్విన్ బౌలింగ్ తో పాటుగా బ్యాటింగ్ లో సైతం విశేషంగా రాణించాడు. ఆఫ్ స్పిన్ బౌలింగ్ తో పాటుగా టెస్టుల్లో ఐదు సెంచరీలు కూడా సాధించి ఉత్తమ ఆల్ రౌండర్ గా నిలిచిన అనుభవం ఉంది.
అశ్విన్ 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి ప్రవేశించాడు. టెస్టుల్లో అతను భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. టీమిండియా తరుపున హయ్యస్ట్ వికెట్లు తీసిన బౌలర్ గా అనిల్ కుంబ్లే తర్వాత అశ్విన్ దే స్థానం. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టాప్ బౌలర్‌గా అనేకసార్లు నిలిచాడు. అతను 537 టెస్టు వికెట్లు సాధించి పలు మ్యాచులలో జట్టుకు విజయాలు అందించాడు. ఏకంగా 37 సార్లు ఇన్సింగ్స్ లలో 5 వికెట్లు చొప్పున పడగొట్టాడు. బ్యాటింగ్ లో 6సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి.
ఇటీవల క్రికెటర్ గానూ కాకుండా యూట్యూబ్ లో వ్యాఖ్యాతగా విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయిన అశ్విన్ ఇప్పటికే పొట్టి క్రికెట్ కి దూరమయ్యాడు. ఆస్ట్రేలియా గడ్డ మీద అంతర్జాతీయ క్రికెట్ ముగించడం విశేషం.