రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి కారకులెవరు? పవన్ కి ఇది అర్థమయితేనే!

సమస్య మూలాల నుంచి పరిష్కరించాలి. పైపై పూతలు కొంతకాలమే ఫలిస్తాయి. మళ్లీ మళ్లీ వ్యాధి లక్షణాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. సరిగ్గా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో అదే జరుగుతుంది. ఎవరైనా అధికారి లేదా ఇంకో నాయకుడు సందడి చేసిన సమయంలో ఓ వారం సర్ధుమణగడం, మళ్లీ చెలరేగిపోవడం అన్నది ఆనవాయితీగా మారుతోంది. మొన్నటి జూన్ లో ఇదే జరిగింది. సివిల్ సప్లైస్ శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించగానే కాకినాడ వెళ్లారు. కలియ తిరిగారు. ఇంకేముందు అందరినీ కట్టడి చేస్తున్నామన్నారు. పీడీ యాక్ట్ కూడా పెడుతున్నామన్నారు. ఒక్క గింజ కూడా బయటకి పోదన్నారు.

ఆరు నెలలు గడిచే సరికి కథ ఏమీ మారలేదని అదే జనసేన అధినేత అంటున్నారు. రేషన్ బియ్యం మాఫియాను అడ్డుకోలేకపోతున్నారని ఆగ్రహిస్తున్నారు. డిప్యూటీ సీఎం కన్నెర్ర చేయడంతో హుటాహుటీన కాకినాడ సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజర్ ను మార్చేశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకి తాను లేఖ రాస్తానని పవన్ ప్రకటించారు. ఏ వ్యక్తి గురించో కాదని, వ్యవస్థను మార్చే ప్రయత్నంలో ఉన్నామని చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్ కి తెలియని విషయమేమంటే ప్రజలకు కేంద్రం ఉచితంగా పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం జనం తినడం లేదు. దానిని మళ్ళీ దళారులకే కట్టబెడుతున్నారు. దళారులు దాన్ని ఎగుమతి దారులకు అమ్ముకుంటున్నారు. ఎగుమతిదారులు ఎక్కువధరకు విదేశాలకు తరలిస్తున్నారు. ఇదో సైకిల్ సిస్టమ్ లా ఉంది. నిజంగా ఉపముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే రేషన్ బియ్యం అక్రమ రవాణా అడ్డుకోవాలంటే జనాలకు అమ్ముకోవడానికి ఉపయోగపడే బియ్యం కాకుండా ఉపయోగపడే బియ్యం పంపిణీ చేయించాలి. జనం తినగలిగే బియ్యం సరఫరా చేస్తే ఎవరూ వాటిని అమ్ముకునే ఆస్కారం ఉండదు. జనం బియ్యం అమ్మనప్పుడు అక్రమ రవాణాకి అవకాశం కలగదు. అయినా కొందరు అనర్హులకు రేషన్ కార్డులున్నాయి కాబట్టి వాళ్లు అమ్ముతుంటే కార్డులు రద్దు చేయవచ్చు.

ప్రభుత్వాలు దుడ్డు బియ్యం స్థానంలో సన్నబియ్యం పంపిణీ చేయాలంటే కిలోకి అదనంగా రూ. 20వరకూ వెచ్చించాలి. ఒక్కో రేషన్ కార్డు మీద 20 కిలోల బియ్యం అనుకుంటే నెలకు రూ. 400 ఖర్చు చేయాలి. ఏడాదికి రూ. 5వేలు ఒక్కో కార్డు మీద అదనపు భారం అవుతుంది. ఇది ప్రభుత్వానికి పెద్ద ఖర్చేమీ కాదు. అయినా గానీ పేదలకు సన్నబియ్యం ఉచితంగా అందిస్తే ఇక బియ్యం వ్యాపారుల దగ్గర ఎక్కువ ధరకు కొనేదెవరు. కాబట్టి ప్రజలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయడం లేదు. బియ్యం ధరలు పెరిగిపోతున్నా ముక్కుతూ, మూలుగుతూ ఖరీదైన బియ్యమే కొని తింటున్న జనాలు ఎందుకు దుడ్డు బియ్యం వాడడం లేదన్నది పవన్ కళ్యాణ్ గ్రహిస్తే కాకినాడ పోర్టులో చిందులు వేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ ఉండదని అర్థమవుతుంది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌ ఆశిస్తున్న కాకినాడ పోర్ట్ నుంచి బియ్యం అక్రమ రవాణా అడ్డుకున్నప్పటికీ ఆ బియ్యం ఏదో పోర్టు నుంచి పరాయి దేశాలకు వెళ్లాల్సిందే. ఎందుకంటే ప్రభుత్వం పనికిరాని బియ్యం ఇస్తోంది. పైగా ఫ్రీ కాబట్టి పబ్లిక్ ప్రతీ నెలా తీసుకుంటున్నారు. తీసుకున్నవి దళారుల పాలుజేస్తున్నారు. దళారులు తమ లాభాలు చూసుకుని ఎగుమతిదారులకు అందిస్తున్నారు. వాళ్లు అందమైన ప్యాకింగ్ చేసి కాకినాడ కాకపోతే మరో పోర్ట్ ను ఆశ్రయించి ఎగుమతి చేయడం మినహా మరో దారి లేదు. ఇక్కడెవరికీ పనికిరాని బియ్యం అందిస్తూ వాటిని ఎక్కడికీ పంపించకూడదని అడ్డుకుంటే ఏం కావాలి ఆ బియ్యమంతా. మాఫియాగా మారిన బియ్యం ఎగుమతిదారులు ఒక దారి మూస్తే మరో అడ్డదారిని ఆశ్రయించైనా రేషన్ మాఫియా కొనసాగిస్తున్న తీరు చూసి పవన్ కి అర్థం కావాలి మరి.

అధికారంలోకి వచ్చి 6 నెలల తర్వాత కూడా డిసీఎం సొంత జిల్లాలో, ఆయన పార్టీకి చెందిన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలో, తనే ఏరికోరి సివిల్ సప్లయిస్ చైర్మన్ చేసిన నాయకుడి సొంత ప్రాంతంలో దందా సాగుతుంటే దేనికి సంకేతం. ఎవరి పాత్ర ఎంతన్నది ఎవరు చెబుతారు. కాకినాడ పోర్టులో రక్షణ సరిగా లేదంటున్న పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించడం లేదన్నది చెప్పదలచుకున్నారు. కసబ్ లాంటి వాళ్లు వచ్చే ప్రమాదం ఉన్నప్పటికీ మోదీ ప్రభుత్వం స్పందించడం లేదని చాటదలచుకున్నారు. కాకినాడ డ్రగ్స్ అడ్డాగా మారినా అడ్డుకోలేని కేంద్రం తీరుని తప్పుబడుతున్నారా. కారణమేదయినా ఉపముఖ్యమంత్రి కాకినాడ పోర్టులో చేసిన హడావిడి అందరినీ ఆకర్షించింది. కానీ రేషన్ మాఫియాను నియంత్రించగలిగితేనే ఆయన మీద నమ్మకం కలుగుతుంది.

కేవలం హంగామా చేసి అక్కడ సరిపెట్టుకుంటే ఆయనకు ఒరిగేదేమీ ఉండదు. రాష్ట్ర ప్రజలకు ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి కేవలం చిన్న చిన్న అధికారుల మీద చిందులు వేసి సమస్య కప్పిపుచ్చే ప్రయత్నం కన్నా మూలాలను వెదికి, కారకులను నియంత్రించి, సమస్య పరిష్కరించగలిగితే పవన్ కళ్యాణ్‌ ఆవేశానికి, ఆవేదనకు అర్థం ఉంటుంది. ప్రజల ఆదరణ దక్కుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *