రేషన్ బియ్యం మాఫియాపై రంగంలోకి పవన్ కళ్యాణ్, అధికారులపై సీరియస్
కాకినాడ నుంచి పోర్ట్ నుంచి అక్రమంగా తరలిపోతున్న బియ్యం వ్యవహారం దుమరం రేపుతోంది. రేషన్ బియ్యం మాఫియా యధేశ్ఛగా బియ్యం తరలింపు సాగిస్తున్న తరుణంలో నేరుగా డిప్యూటీ సీఎం రంగంలో దిగడం ఆసక్తిగా మారింది. కాకినాడ పోర్ట్ నుంచి పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పవన్ వెంట ఉన్నారు. కాకినాడ పోర్టు నుంచి బియ్యం అక్రమ రవాణా వివరాలను డీసీఎంకి మంత్రి వివరించారు.
రెండు రోజుల క్రితం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ ఆధ్వర్యంలో సముద్రం లోపల సుమారు 9 నాటికల్ మైళ్ళ దూరంలో రవాణా కు సిద్ధమై వెళుతున్న స్టెల్లా ఎల్ పనామా షిప్ లో పట్టుబడిన 640 టన్నుల బియ్యం వివరాలను పవన్ తెలుసుకున్నారు. స్వయంగా సముద్రంలోకి వెళ్లి పరిశీలించారు.
కాకినాడ పోర్ట్ నుంచి ఇంత భారీగా బియ్యం రవాణా అవుతుంటే ఏం చేస్తున్నారని అధికారులపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అక్రమ రేషన్ బియ్యం యదేచ్చగా షిప్ నుంచి తరలిపోతుంటే ఏం చేస్తున్నారని జిల్లా అధికారులను, పోర్టు సిబ్బందిని పవన్ ప్రశ్నించారు. ప్రతిసారి ప్రజాప్రతినిధులు నాయకులు వచ్చి బియ్యం అక్రమ రవాణా ఆపితేగాని ఆపలేరా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బియ్యం అక్రమ రవాణాలో ఎవరు ఉన్నా, రేషన్ బియ్యం ఇష్టానుసారం బయటకు తరలిస్తున్న వారు ఎంత వారైనా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.