పులివెందుల ఫలితాల వెనుక అసలేం జరిగింది? ఓటర్ల మనోగతమేంటి? Exclusive Ground Report

“Public opinion is everything. With public sentiment, nothing can fail; without it nothing can succeed.” ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలని అంతా అంగీకరిస్తారు. కానీ జనాభిప్రాయానికి విలువనివ్వకపోతే ఏమీ సాధించలేమన్న అబ్రహం లింకన్ చెప్పిన మాటలను అధికారం దక్కగానే విస్మరిస్తారు.
ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తోందంటే ఇటీవల జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ప్రత్యేకమైనవి. ఏడాది పాలనకి గడువు ఉండగా నిర్వహించిన చిన్న ఎన్నికే అయినప్పటికీ దాని ప్రభావం దీర్ఘకాలం ఉంటుందనే అంచనా సర్వత్రా ఉంది. అందుకే పులివెందులలో మొన్నటి ఎన్నికలు జరిగిన 6 పంచాయతీలో ద న్యూస్ తెలుగు టీమ్ పర్యటించింది. ఫలితాలు వెలువడిన తర్వాత పరిస్థితులు, ప్రజల మనోభావాలు తెలుసుకునే ప్రయత్నం చేసింది.
దాదాపు 10.6 వేల మంది ఓటర్లకు గానూ 76.44 శాతం పోలింగ్ జరిగినట్టు వెల్లడించారు. ఫలితాలను బట్టి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి 6,716 ఓట్లతో విజయం సాధించారు. తర్వాత స్థానంలో వైఎస్సార్సీపీ తరుపున బరిలో దిగిన తుమ్మల హేమంత్ రెడ్డి 683 ఓట్లకు పరిమితమయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థికి 101 ఓట్లు రాగా ఇండిపెండెంట్ అభ్యర్థుల్లో ఒకరికి సున్నా, మరొకరికి ఒకటి, 2,3,4 ఓట్లు చొప్పున మరో ముగ్గురు సాధించారు. నోటాకి 11 ఓట్లు రాగా..మొత్తం 7794 ఓట్లకు గానూ 7638 ఓట్లు చెల్లుబాటయినట్టు అధికారికంగా ప్రకటించారు. పోస్టల్ బ్యాలెట్లలోనే చదువుకున్న వారు వేసిన ఓట్లలో చెల్లుబాటు కానివి ఇంతకన్నా ఎక్కువే ఉంటాయి. అయినా సాధారణ పల్లె ఓటర్ల బ్యాలెట్ పేపర్ ఎన్నికల్లో చెల్లని ఓట్ల సంఖ్య చాలా నామమాత్రంగా ఉందన్నది గమనార్హం.

చరిత్ర ఏం చెబుతోంది..
పులివెందుల జెడ్పీటీసీ స్థానానికి ఇంతకుముందు 5 దఫాలు ఎన్నికలు జరిగాయి. తొలుత 1995, 2001 ఎన్నికలు టీడీపీ పాలనా కాలంలోనే జరిగాయి. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉండగా 2006లో, ఆ తర్వాత 2013, చివరిగా 2021లో ఎన్నికలు నిర్వహించారు. కానీ ప్రతీసారి పోలింగ్ అవసరం రాకుండా ఏకగ్రీవమయ్యాయి. మొదట వైఎస్సార్, ఆ తర్వాత వైఎస్ జగన్ ప్రాతినిథ్యం వహించిన నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులను పెట్టలేదు. అందులో మళ్లీ మూడుసార్లు వైఎస్ కుటుంబం విపక్షంలో ఉండగానే ఎన్నికలు జరగ్గా, ఆనాడు కూడా పోటీకి ఎవరూ ముందుకు రాలేదు. దాంతో వైఎస్ కుటుంబం బలపరిచిన వారే గెలుస్తూ వచ్చారు.
తొలిసారిగా 2025 ఆగస్టులోనే జెడ్పీటీసీ సీటు కోసం పోలింగ్ జరిగింది. ఉప ఎన్నికలయినప్పటికీ 11 మంది అభ్యర్థులు పోటీలో ఉండడంతో పోలింగ్ అనివార్యమయ్యింది. మూడు పార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి. మిగిలిన వారు ఇండిపెండెంట్లు. టీడీపీ తొలిసారిగా పోటీ చేసింది. కానీ అభ్యర్థి పక్క మండలం నుంచి వచ్చి బరిలో దిగారు. టీడీపీ తరుపున 2024 సాధారణ ఎన్నికల బరిలో దిగిన బీటెక్ రవి తన భార్యనే ఈసారి పోటీలో పెట్టారు. దాంతో పోటీ ఆసక్తిగా మారింది. ఫలితం అంత పెద్ద చర్చకు ఆస్కారమిచ్చింది.
ఎన్నికలు జరిగిన తీరు..
2024 సాధారణ ఎన్నికల్లో కూడా పులివెందుల స్థానం జగన్ నిలబెట్టుకున్నప్పుడు ఈ మండలంలో టీడీపీ అభ్యర్థికి దాదాపుగా రెండున్నర వేల ఓట్లు దక్కాయి. అంటే రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి పూర్తి సానుకూలత ఉన్న సందర్భంలో సైతం పులివెందులలో మండలంలో ఆపార్టీ పావు వంతు ఓట్లకే పరిమితమయ్యింది. కానీ ఏడాది తిరిగేసరికి ఫలితాలు పూర్తిగా తలకిందులయ్యాయి. వైఎస్ జగన్ కి కంచుకోట అనుకున్న మండలంలో ఆపార్టీ ఘోరంగా ఓడిపోయింది. ఓటమి కన్నా కుదేలయ్యిందంటే బాగుంటుంది. దాంతో ఇక వైఎస్ జగన్ సొంత గూట్లోనే ఓటర్లు తిరస్కరించారని, వైనాట్ పులివెందుల అని చెబుతున్న మాట నిజమయ్యిందని, జగన్ ఇక పులివెందుల పులి కాదనే మాటలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో ఇలాంటి అనూహ్య ఫలితాలను ఊహించని వాళ్ల వాదన భిన్నంగా ఉంది. అది అసలు ఎన్నికే కాదని, పూర్తి ఏకపక్షంగా ఓట్లు గుద్దుకున్నారని, అధికార బలాన్ని ఉపయోగించుకుని నడిపిన తంతు అంటూ చెబుతున్నారు. అందుకే పులివెందుల ఫలితాల గురించి క్షేత్రస్థాయిలో ఓటర్ల మనోభావాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాము. విస్మయం కలిగించే అంశాలు వెల్లడయ్యాయి. ఈ ఫలితాల మీద అసలైన ఓటర్ల అభిప్రాయాలు ఆసక్తిని కలిగించాయి.

ఓటు వేసింది పావు వంతు మాత్రమేనా..
పులివెందుల మండలంలో ఓటు ఉన్న వారిలో ఎంతమంది చేతికి ఇంకా ఓటేసినప్పుడు వేలికి వేసే ఇంక్ ఉందనే అంశాన్ని ఆరా తీశాము. కానీ మేము కలిసిన 126 మందిలో ఆరుగురు మాత్రమే వేలికి ముద్రలున్నట్టు చూపించారు. మరో 18 మంది ఓటేశామే గానీ వేలి ఇంకు చెరిగిపోయిందని చెప్పారు. మూడు రోజుల్లోనే ఎలా చెరిగిందంటే కొందరు సమాధానం చెప్పలేదు. ఇంకొందరు అదంతే అన్నట్టుగా చెప్పారు. వారితో పాటుగా ఓ 10 మంది తాము చెప్పలేమంటూ, అడుగుతున్నప్పటికీ సమాధానం చెప్పకుండా వెళ్లిపోయారు. మిగిలిన 92 మంది తమ ఓటు తాము వేయలేదని చెప్పారు. కొందరు వేయనివ్వలేదన్నారు. ఇంకొందరు తాము ఓటేయడానికి వెళ్లలేదన్నారు. కొందరు వెళ్లే ప్రయత్నం చేశామే గానీ పోలీసులు ఆపేశారంటూ ఆరోపించారు.
పోలింగ్ నిర్వహణ సజావుగా సాగించడానికి విధుల్లో ఉన్న పోలీసులు ఓటు హక్కు ఉన్న వారిని పోలింగ్ బూత్ ల వరకూ రానివ్వలేదంటూ విపక్షం కూడా విమర్శించింది. స్థానికుల్లో మూడొంతుల మంది అదే మాట చెప్పారు. వైఎస్సార్సీపీ జెడ్పీ అభ్యర్థి సొంతగ్రామం తుమ్మలపల్లెలో భూషమ్మ అనే మహిళ వేలికి ఓటు ఇంక్ ఉంది. కానీ తన ఓటు తాను వేయలేదని చెప్పారు. ఇంక్ వేసి పంపించేశారని ఆమె చెప్పడం విస్మయకరంగా కనిపించింది. ఇలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. కానీ వేలికి ఓటు ఇంక్ ఆనవాళ్లు లేనివాళ్లే 80 శాతం మంది వరకూ ఉన్నారంటే ఆశ్చర్యకరం. ఓటింగ్ జరిగిన తీరుకి తార్కణంగా భావించాలి.
అభ్యర్థి కూడా ఓటేయలేదు..
తన తండ్రి మరణంతో ఎన్నికల్లో పోటీ కోసం బరిలో దిగిన వైఎస్సార్సీపీ అభ్యర్థి తుమ్మల హేమంత్ రెడ్డి కూడా ఓటు హక్కు వినియోగించుకోలేదు. ఆయన బంధువులు, వారి మద్ధతుదారులు ఎవరినీ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్ వరకూ వచ్చేందుకు అడ్డుచెప్పడంతోనే ఓటు వేసేందుకు తాను వెళ్లలేదని ఆ తర్వాత హేమంత్ రెడ్డి తెలిపారు.
అదే గ్రామంలో ఓ దివ్యాంగురాలు శాంతమ్మతో ద న్యూస్ తెలుగు మాట్లాడింది. “మొన్నటి సీఎం ఎన్నికల్లో ఓటు వేశాము. కానీ ఈసారి మమ్మల్ని పోనివ్వలేదు. రావద్దని చెప్పారు. నేను అక్కడి వరకూ వెళ్లేందుకు కూడా ప్రయత్నించలేదు. మా ఊరిలో ఎప్పుడూ ఇలా జరగలేదు”. అంటూ ఆమె వివరించింది.
ఆగష్ట్ 12నాడు పోలింగ్ నిర్వహించిన స్కూల్ ప్రహారీ గోడ మీద కూర్చున్న 64 ఏళ్ల వృద్ధుడిని కూడా పలకరించాం. అవన్నీ మాకు తెలియదంటూనే ఎవరినీ ఓటు వేయనివ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అటువైపు గొర్రెలు మేపేందుకు వెళ్తున్న జంటను కూడా పలకరించాం. ఇద్దరి వేళ్లకు ఎటువంటి ఇంకు ఆనవాళ్లే లేవు. అయినా భర్త ‘మేము వేసేశాం. మమ్మల్ని అడగొద్దు’ అంటూ వెళ్లిపోయారు. ఆయన భార్య మాత్రం ‘మేము ఓట్లు వేయకుండా కర్రలతో కాపలా ఉండడం’తో అటు వెళ్లలేకపోయామని చెప్పారు.

ఊర్లో ఎవరూ ఓటేయలేదు..కానీ పోలింగ్ శాతమే
ఎర్రిపల్లె అనే గ్రామంలో 600 పైబడిన ఓట్లు ఉంటే అధికారుల లెక్కల ప్రకారం 520 వరకూ పోలయ్యాయి. కానీ ఈ ఊరిలో ఎవరినడిగినా ఓటేయలేదనే చెప్పారు. ఆశ్చర్యం ఏమంటే పోలింగ్ నిర్వహించిన స్కూల్ భవనానికి ఎదురింట్లో నివశించే వాళ్లను కూడా ఆ రోజు బయటకు రానివ్వలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు.
“స్కూల్లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. మా గుమ్మం నుంచే కనిపిస్తోంది. నా కొడుకు కూడా వచ్చాడు ఓటేయడానికి. వెళ్దామనుకుంటే పోలీసులు కొట్టారు. దాంతో మేము వెళ్లలేకపోయాము. మా ఊరిలో నూటికి 90 మంది ఓటేయడానికి వీలు లేకుండా చేశారు. పోలింగ్ ఏజెంట్ గా వెళ్లిన సర్పంచ్ భార్య జాకెట్ కూడా చింపేశారు. ఈడ్చుకుని వచ్చి కొట్టారు. ఎక్కువ మంది భయపడి వెళ్లలేదు. వెళ్లాలనుకున్న వారిని బయటి నుంచి వచ్చిన వారితో కలిసి, పోలీసులు తరిమేశారు. ఓట్లన్నీ వాళ్లే వేసుకున్నారంటూ” వాపోయారు.
ఆమె చేతికి కూడా ఎటువంటి ఇంకు చుక్క వేసిన ఆనవాలు కూడా కనిపించలేదు.

మహాభారతంలో ఏం చెప్పారంటే..
యర్రబల్లె కి వెళ్లే దారిలో ఓ చెట్టుకింద మహాభారత పఠనం జరుగుతోంది. చంద్రయ్య అనే 70 ఏళ్ల పైబడిన వయసులో ఉన్న పెద్దాయన మహాభారతం చదువుతూ ఎదురుగా కూర్చున్న వారికి వివరిస్తున్నారు. ఆయన్ని కలిసి మీరు ఓటేశారా అని అడిగితే వేసేశా అని చెప్పారు. వేలికి ఇంకు ముద్ర ఉందా అంటే చెరిగిపోయిందన్నారు. అదేంటి అలా చెబుతున్నారని ప్రశ్నిస్తే ఆయన ఆసక్తిగా సమాధానమిచ్చారు.
“మహాభారతంలో ఏముందో తెలుసా.. బలం ఉందని విర్రవీగకూడదు. కానీ ఇప్పుడు ఎవరికి అధికారం ఉంటే వాళ్లు నచ్చినట్టుగా సాగుతున్నారు. ఇలాంటివి ఎక్కువ కాలం సాగవు. భారతమే అందుకు సాక్ష్యం. ధర్మ పాలనలో మరచిపోతున్నారంటూ” అధికార పార్టీ ఇష్టానుసారం సాగుతుందన్న మాటను పరోక్షంగా చెప్పారు.
“లెక్క ఇచ్చారు..ఓటుకి రావద్దని..”
కనంపల్లిలో మరో మహిళ సమాధానం కూడా అంతే ఆశ్చర్యం కలిగింది. తమకు పోలింగ్ కి ముందు లెక్క అందించారని ఆమె తెలిపింది. కానీ ఆ విషయం కెమెరా ముందు చెప్పడానికి నిరాకరించింది.
“లెక్క అందింది. రూ. 5వేలు చొప్పున టీడీపీ వాళ్లు ఇచ్చారు. ఒక్కో మహిళకి ఒక్కో చీర కూడా అందించారు. వైఎస్సార్సీపీ వాళ్లు కూడా ఇచ్చారు. అది కొందరికే అందింది. టీడీపీ మాత్రం అందరికీ ఇచ్చారు. తెల్లారి ఓటేయడానికి పోతే అవసరం లేదన్నారు. లెక్క ఇచ్చారు కదా ఓటేద్దామని అనుకుంటే ఓటు అవసరం లేదనే మీకు లెక్క అందించామని పార్టీ వాళ్లు చెప్పినట్టు” ఆమె మాకు వివరించిన తీరు ఆశ్చర్యం కలిగించింది.
అంటే ఇన్నాళ్లుగా తమకే ఓటు వేయమని డబ్బులిచ్చిన దశ నుంచి తొలిసారిగా మీరు ఓటేయడానికి రావాల్సిన అవసరం లేదని కూడా డబ్బులు పంచినట్టు అర్థమయ్యింది.

“కుప్పం వెళ్లి అడగాల్సింది..”
చాలామందిని అడిగే ప్రయత్నంలో చంద్రగిరి గ్రామంలో టీడీపీ కార్యకర్తలను కలిశాము. మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు ఎవరు ఇక్కడికొచ్చి అడుగుతున్నారని నిలదీశారు. మేము సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తుండగా కుప్పం, మంగళగిరి పోయి అండగండి అంటూ ప్రశ్నించారు.
“కుప్పంలో పెద్దిరెడ్డి ఏం చేశాడో తెలీదా. తమిళనాడు నుంచి ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించింది మీకు తెలియదా. ఇక్కడికొచ్చి ఎందుకడుగుతున్నారు. వాళ్లు చేసినప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదంటూ” మా మీద దూకుడుగా వచ్చే ప్రయత్నం చేశారు. కెమెరా ఆఫ్ చేయమని బెదరించారు. కెమెరా ముందు ఇదే మాట చెప్పండి..మేము టెలికాస్ట్ చేస్తామని అడిగినా ఖాతరు చేయలేదు.
అప్పుడు వాళ్లు చేసిందే, ఇక్కడ మేము చేశామని సమర్థించుకునే ప్రయత్నం చేయడం విశేషం.
ఓటు వేయకపోతే చనిపోయినట్టే కదా..
“నేను పుట్టి 57 ఏళ్లు. 15 సార్లు ఓటేసి ఉంటా. ఏనాడూ ఇలా జరగలేదు. ఇదే మొదటిది. మా ఊరిలో తెలుగుదేశం వాళ్లకు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం. అనుమానం ఉన్నోళ్లని రానివ్వలేదు. పోలింగ్ బూత్ దగ్గర గొడవలయ్యాయి. పోలీసులు, జమ్మలమడుగు నుంచి వచ్చిన వాళ్లదే హవా. వారి మాటే నడిచింది. మా ఊరిలో బయటి నుంచి వచ్చిన వాళ్ల పెత్తనమే సాగింది. అయినా ఓటరు స్లిప్ ఇచ్చిన తర్వాత మేము ఓటేయకపోతే చచ్చిపోయినట్టే కదా. ఇలా ఎందుకు చేయాలి” అంటూ నల్లగొండవారిపల్లె కి చెందిన రామచంద్రారెడ్డి నిలదీశారు.
తాను కూడా 2024లోనూ టీడీపీకి ఓటు వేసిన వాడిననే కానీ ఈసారి మాత్రం తనకు అవకాశం రాలేదని ఆయన చెప్పారు.

Image Courtesy: Eenaduepaper.com
పోలింగ్ కథనాలపై ఈనాడు తీరు ఓ నిదర్శనం..
చిన్నదైనా, పెద్దదైనా ఎన్నికలు జరిగితే పోలింగ్ దృశ్యాలు మీడియాలో కథనాలుగా వస్తాయి. ముఖ్యంగా వేలికి ఉన్న ముద్రలను ఓటర్లు చూపిస్తుంటే వాటిని వీడియోలు, ఫోటోలుగా ప్రచురిస్తారు. కానీ ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి పత్రికల్లో పోలింగ్ మరునాడు ఒక్కటి కూడా అలాంటి ఫోటో కనిపించలేదు. పులివెందుల మండలంలో 76 శాతం పైగా పోలింగ్ జరిగితే బారులు తీరిన ఓటర్ల ఫోటోలు గానీ, చూపుడు వేలు చూపించే దృశ్యాలు గానీ ఆయా మీడియా సంస్థలు ప్రసారం చేసిన దాఖలాలు లేవు. కనీసం ఫోటోలుగా ప్రచురించిన ఆనవాళ్లు కూడా లేవు.
ఒంటిమిట్ట మండలంలో జరిగిన పోలింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు ఈనాడు జిల్లా ఎడిషన్ లో ప్రచురించారు. కానీ పులివెందులకి సంబంధించినంత వరకూ ఒక్క ఫోటో వేస్తే ఒట్టు. మరో విచిత్రం ఏమంటే అదే పత్రిక జిల్లా ఎడిషన్ లోపలి పేజీలో వేసిన ఫోటోలు ఎక్కడివి, ఏ పోలింగ్ బూత్ అనే వివరాలు కూడా లేకుండా ప్రచురించడం చూస్తే పోలింగ్ తీరు మీద మరిన్ని సందేహాలకు ఆస్కారమిచ్చేలా ఉంది. స్థానికుల చెబుతున్న అభిప్రాయాలకు తగ్గట్టుగా టీడీపీ అనుకూల మీడియా స్పందన ఉన్నట్టు అర్థమవుతోంది.
ఇంకా పోలీస్ పహారా మధ్యనే..
దాదాపుగా అన్ని ప్రధాన పల్లెల్లో ఇంకా పోలీస్ పహారా కొనసాగుతోంది. మేము పర్యటించిన సమయంలో కూడా పోలీసులు పర్యవేక్షించారు. ఎవరు మీడియాతో మాట్లాడుతున్నారనే అంశాలను గమనించే ప్రయత్నం చేశారు. దాంతో చాలామంది మాట్లాడేందుకు నిరాకరించారు. వివరాలు వెల్లడించడానికి ససేమీరా అన్నారు. కొందరు కెమెరా లేకుండా మాట్లాడేందుకు మాత్రమే సిద్ధమయ్యారు. అంటే పులివెందుల వాసుల్లో ఉన్న అభద్రత అర్థమవుతోంది. ఏమో..ఏం చెబితే ఎవరితో సమస్య అవుతుందోననే రీతిలో అత్యధికులుండడం విశేషం.
అదే సమయంలో పోలింగ్ తీరు గురించి మీడియాతో మాట్లాడిన కొందరి మీద దాడి జరిగినట్టు తుమ్మలపల్లె వాసులు తెలియజేశారు. తమను ఓటు వేయనివ్వలేదని సాక్షికి చెప్పినందుకు ఎస్సీ మహిళ ఒకరిని ఇంట్లోంచి ఈడ్చుకుంటూ వచ్చి కొట్టారని అదే గ్రామంలోని ఆదర్శకాలనీకి చెందిన వారు తెలిపారు. ‘తాము ఓసీలం కాబట్టి కొంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నామే గానీ లేదంటే మాకు కూడా భయమేనని’ వివరించారు.
విపక్ష వ్యూహాత్మక వైఫల్యమా?
సాధారణ ఎన్నికల పోలింగ్ ను వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. మరి పులివెందుల ఉప ఎన్నికల తీరు మీద అన్ని సందేహాలున్నప్పటికీ వెబ్ కాస్టింగ్ లైవ్ ఎందుకు లేదనే అంశాన్ని విపక్షం ప్రశ్నించాల్సింది. దాని కోసం పట్టుబట్టాల్సింది. అందుకు తగ్గట్టుగా న్యాయస్థానాల ముందు వాదించాల్సింది. ప్రజాస్వామ్యంలో పారదర్శకత కోసం పట్టుబడితే కాదనగలిగే అవకాశం లేదు. అయినా వైఎస్సార్సీపీ ఆ దిశలో గట్టి ప్రయత్నాలు చేయలేకపోయింది.
అదే సమయంలో స్థానికంగా పులివెందుల వైఎస్సార్సీపీ నాయకత్వానికి తగిన వ్యూహం ఉన్నట్టు కనిపించలేదు. తొలుత ఏకగ్రీవం అవుతుందని భావించారు. కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కూడా సులువుగానే గట్టెక్కగలమనే అతి విశ్వాసంతో సాగారు. చివరి నిమషం వరకూ ఊగిసలాటలో ఉన్న టీడీపీ తెరమీదకు వచ్చిన తర్వాత తగినంత సన్నద్ధత లేదు. చివరకు పోలింగ్ బహిష్కరించాలా లేదా అన్నదాని మీద సతమతమయ్యారు. ఆఖరిలో ముఖ్యమైన మండల స్థాయి నాయకత్వాన్ని బైండోవర్ చేసిన తర్వాత పోలింగ్ బూత్ ల వరకూ వెళ్లి, నిలదీసే శక్తిని కూడా ఆపార్టీ కోల్పోయింది.
పైగా వైఎస్సార్సీపీలో కొందరు దిగువ శ్రేణి కార్యకర్తలు ఈ ఎన్నికల గొడవలు తమకెందుకులే అని దాటవేత ధోరణిలో సాగారు. స్థానిక నాయకత్వం మీద కొంత అసంతృప్తి కూడా వారిలో కనిపిస్తోంది. అన్నీ కలిసి గట్టిపట్టున్న నియోజకవర్గంలో కళ్లెదురుగా ఇంత జరుగుతున్నా వైఎస్సార్సీపీ చేతులెత్తేయాల్సి వచ్చింది. చివరకు రీ పోలింగ్, కౌంటింగ్ మాత్రం బహిష్కరించడంతో సరిపెట్టుకుంది. ఫలితాల తర్వాత పలు డిమాండ్లు చేస్తోంది.

దొంగ ఓట్లు వాస్తవమే గానీ అసలు ఓటర్లను అడ్డుకోవడమే..
పులివెందుల ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేసిన అంశం రుజువయ్యింది. స్వయంగా కలెక్టర్ సమక్షంలోనే ఇద్దరు దొంగ ఓట్లు వేస్తున్న తీరుని వైఎస్సార్సీపీ అధారాలతో వెల్లడించింది. పైగా అధికారికంగా ఐ అండ్ పీఆర్ విడుదల చేసిన ఫోటోల ఆధారంగా ఓట్లేసిన వారిలో జమ్మలమడుగు, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన వారి వివరాలను చాటిచెప్పింది.
దేశంలో దొంగ ఓట్లు వేయించుకునే ఆనవాయితీ ఉంది. అందుకోసం ఊళ్లలో లేని వారు, చనిపోయిన వారు ఉంటే చూసుకుని వారి ఓట్లను తమకు అనుకూలంగా మలచుకుని ఫలితాలు సాధించే ప్రయత్నం చాలాకాలంగా జరుగుతోంది. కానీ ఈసారి పులివెందుల అందుకు భిన్నంగా సాగినట్టు స్పష్టమవుతోంది. స్థానికుల ఓటు హక్కుని పూర్తిగా కాలరాసేసినట్టు కనిపిస్తోంది. స్థానికేతరులను ఉపయోగించుని ఓట్లు వేసుకున్నట్టు భావించాల్సి వస్తోంది. అందుకు అధికార, పోలీస్ యంత్రాంగం పూర్తిగా వత్తాసు పలికినట్టు అర్థమవుతోంది.
ట్రయల్ మాత్రమే..రాబోయే స్థానిక ఎన్నికలన్నీ?
సాధారణ ఎన్నికలు ఒకే దశలో జరిగితే ఇలాంటివి కొంత అసాధ్యమనుకోవచ్చు. దానికి వేరే పద్ధతులు అనుసరిస్తున్నట్టు అనుమానాలున్నాయి. కానీ పులివెందుల ఉప ఎన్నికల్లో అనుసరించిన పద్ధతిని రాబోయే స్థానిక ఎన్నికల్లో రాష్ట్రమంతా ప్రయోగించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు. ఎందుకంటే ఒక్కో రెవెన్యూ డివిజన్ లో ఒక్కో రోజు అన్నట్టుగా జరుగుతాయి కాబట్టి అధికార పక్షాలకు చెందిన కార్యకర్తలను అటూ, ఇటూ తమకు నచ్చినట్టుగా మళ్లించుకుని అసలు ఓటర్లను పోలింగ్ బూత్ ల వరకూ రాకుండా చేసే ప్రమాదముంటుంది.
ఎన్నికల సంఘం కూడా పూర్తిగా చేతులెత్తేసింది. స్థానిక అధికారులు తమకు నచ్చినట్టుగా సాగుతున్నా కనీసం నియంత్రించే ప్రయత్నం కూడా జరగలేదు. అధికార పార్టీ పెద్దల మనసెరిగి వ్యవహరించినట్టు కనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితి అందరి కన్నా ఎక్కువ చేటు తెచ్చేది పాలకపక్షానికే. ఎప్పటికప్పుడు జనాభిప్రాయం తెలుసుకుంటే అబ్రహం లింకన్ చెప్పినట్టు ప్రజానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకతను అర్థం చేసుకుంటే సరిచేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ అన్నింటా తామే గెలవాలి, అన్ని ఎన్నికల్లో తమవాళ్లే విజయం సాధించాలనే ప్రయత్నం చేస్తే చివరకు సమయం వచ్చినప్పుడు సామాన్య ఓటర్లు ఇచ్చే తీర్పునకు విలవిల్లాడాల్సి వస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటివి అర్థం కాకపోవచ్చు గానీ ఓసారి పరిస్థితి తారుమారయితే తలకిందులయిపోతారన్నది గతం చెప్పిన పాఠం. నేర్చుకున్న వాళ్లకు నేర్చుకున్నంత మహదేవా..