కెప్టెన్సీ నుంచి ఊస్టింగ్ పక్కా! రోహిత్ కెరీర్ ముగింపు?

టీ20 వరల్డ్ కప్ లో జట్టుని ముందుండి నడిపించిన కెప్టెన్ రోహిత్ శర్మను వరుస వైఫల్యాలు వెంటాడుతున్నాయి. తన ఆటతీరుతో పాటుగా జట్టుని నడిపించే విషయంలోనై ఘోరంగా విఫలం కావడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ఇక రోహిత్ శర్మ తన కెరీర్ కు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమయినట్టుగా అంతా భావిస్తున్నారు. ఆయన తప్పుకోకపోతే తొలగించాలన్న డిమాండ్ కూడా పెరుగుతోంది.

టీ20 వరల్డ్ కప్ గెలిచిన వెంటనే టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లనుంచి వైదొలుగుతూ ప్రకటన చేశారు. కానీ టెస్ట్, వన్డే మ్యాచ్ లలో కొనసాగుతున్నట్టు వెల్లడించిన రోహిత్ కు తదనుగుణంగా కెప్టెన్సీ కొనసాగుతోంది. కానీ స్వదేశంలో న్యూజీలాండ్ తో జరిగిన సిరీస్ లో క్లీన్ స్వీప్ కావడం, ఆస్ట్రేలియాతో వరుసగా రెండు, మూడు టెస్టులలో రోహిత్ వైఫల్యం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతోంది.

జస్ప్రిత్ బుమ్రా కెప్టెన్సీలో పెర్త్ టెస్ట్ మ్యాచ్ ను కైవసం చేసుకున్న టీమిండియా సిరీస్ లో శుభారంభం చేసింది. కానీ ఆ వెంటనే రెండు టెస్టులలో చేతులెత్తేస్తున్నట్టు కనిపిస్తోంది. అడిలైడ్ టెస్టును 10వికెట్ల తేడాతో కోల్పోయింది. బ్రిస్బేన్ లో కూడా ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ ఆరంభంలో కొంత పట్టు చిక్కుతున్నట్టు కనిపించినా ఆ తర్వాత టీమిండియా పట్టు కోల్పోయింది. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ దూకుడుతో టీమిండియా బౌలర్లు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. వరుసగా ఇండియన్ బౌలర్లను చెడుగుడు ఆడుతున్న ట్రావిస్ కి తగిన సమాధానం వెదకడంలో టీమ్ వైఫల్యం తలనొప్పిగా మారింది. ట్రావిస్ ను కట్టడి చేసే వ్యూహం రచించడంలో రోహిత్ వైపల్యం దానికి కారణమని పలువురు మండిపడుతున్నారు.

రోహిత్ కెప్టెన్సీలో ట్రావిస్ హెడ్ ఆడిన 4 ఇన్సింగ్సులలో కూడా 5 సెంచరీలు చేయడం విశేషం. వరల్డ్ టెస్ట్ సిరీస్ ఫైనల్స్ 2023లో ట్రావిస్ హెడ్ సెంచరీతో టీమిండియా మ్యాచ్ కోల్పోయింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్స్ సైతం హెడ్ సెంచరీ మూలంగానే టీమిండియా ఆశలు నీరుగారిపోయాయి. ప్రస్తుత సిరీస్ లో వరుసగా అడిలైడ్, బ్రిస్బేన్ టెస్టులలో కూడా రెండు సెంచరీలతో ఆస్ట్రేలియాను విజయపథంలో నడుపుతున్నాడు. అయినప్పటికీ హెడ్ ను నిలువరించే వ్యూహం రోహిత్ దగ్గర కరువయ్యిందనే అభిప్రాయం బలపడుతోంది. చివరకు ఫీల్డ్ లో జట్టుకి ఉత్సాహం నింపే రీతిలో కెప్టెన్ వైఫల్యం విమర్శలకు ఊతమిస్తోంది.

దాంతో ఇక రోహిత్ శర్మను సాగనంపడం అనివార్యంగా కనిపిస్తోంది. మిగిలిన రెండు టెస్టులకు కొనసాగిస్తారా లేక ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి సిరీస్ తర్వాత నిర్ణయం తీసుకుంటారా అన్నది కీలకంగా మారింది. అశ్విన్, జడేజాకి తోడుగా రోహిత్ శర్మ కూడా టెస్ట్ మ్యాచ్ లకు గుడ్ బై చెప్పే సమయం ఆసన్నమయ్యిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. బ్యాటింగ్ లో రోహిత్ ఏమేరకు రాణిస్తాడన్నదే తన భవితవ్యం నిర్ణయించబోతోంది. కానీ కెరీర్ చరమాంకంలో ఇంతటి తీవ్ర విమర్శలు తలనెత్తుకుంటున్న తీరు చర్చనీయాంశమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *