ఎట్టకేలకు కనుమూరి రఘురామకృష్ణంరాజుకి ఛాన్స్!
ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఎన్నికయ్యారు. ఈ మేరకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు.
ఈ పదవికి ఒక్క నామినే షనే దాఖలు కావడంతో రఘురామ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. రఘురామ 2019 ఎన్నికల్లో నరసాపురం లోక్‌సభ స్థానం నుంచి వైకాపా తరఫున గెలిచారు. తర్వాత కొద్ది రోజుల్లోనే వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై తిరుగుబాటు జెండా ఎగరేశారు.
అప్పటి సీఎం జగన్ తో విబేధించి ఆపార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. చివరకు ఆయన మీద రాజద్రోహం కేసు కూడా నమోదయ్యింది. ఆ దశలోనే ఆయన మీద కస్టడీలో ఉండగా దాడి జరిగిందంటూ పెను దుమారం రేపారు.
అప్పటి నుంచి ఆయన నిత్యం వైఎస్సార్సీపీ మీద తీవ్రంగా దాడికి దిగారు. వివిధ కేసులతో జగన్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇటీవల అసెంబ్లీలో ఆయన వెల్లడించినట్టుగా ప్రభుత్వానికి అప్పులు రాకుండా అడ్డుపడ్డారు.
మొన్నటి సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి నరసాపురం ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా శ్రమించారు. కానీ ఆ సీటు బీజేపీ ఖాతాలో చేరింది. ఆపార్టీ తరుపున బరిలో దిగాలని యోచించినా బీజేపీ నేతలు కరుణించకపోవడంతో చివరకు ఉండి అసెంబ్లీ స్థానానికి టీడీపీ తరుపున పోటీ చేసి విజయం సాధించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. రఘురామకృష్ణరాజు తనను గతంలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై గుంటూరులో ఫిర్యాదు చేశారు. ఈ కేసులో అప్పటి ముఖ్య మంత్రి జగన్‌తో పాటు పోలీసు ఉన్నతాధికారులు నిందితులుగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సాగుతోంది. అదే దశలో ఏపీ అసెంబ్లీకి స్పీకర్ కావాలని ఆశించిన కనుమూరి రఘురామకృష్ణం రాజు ఆఖరికి డిప్యూటీ స్పీకర్ గా శాసనసభను నడిపించే అవకాశం దక్కించుకున్నారు. చింతకాయల అయ్యన్న పాత్రుడికి డిప్యూటీగా వ్యవహరించబోతున్నారు.